‘నక్షత్రం’ డిజప్పాయింట్ చెయ్యదు
-దర్శకుడు కృష్ణవంశీ
‘‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రీకరణకు రామ్‌చరణ్‌ను కలవడానికి వెళ్లా. అప్పుడు కృష్ణవంశీగారితో ‘ఎప్పుడైనా మీ సినిమాలో ఓ క్యారెక్టర్ ఉంటే చెప్పండి. చేస్తా’ అన్నాను. ‘నక్షత్రం’లో అలెగ్జాండర్ అనే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. వెంటనే చిరంజీవి, పవన్‌కల్యాణ్ మావయ్యల దగ్గరకు వెళ్లి ‘కృష్ణవంశీగారి సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నా’ అని చెప్పా. ‘వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్’ అన్నారు. ముఖ్యంగా చిరంజీవిగారయితే చాలా చెప్పారు. నువ్వెంతో నేర్చుకుంటావన్నారు’’ అన్నారు సాయిధరమ్ తేజ్.
సందీప్ కిషన్, రెజీనా జంటగా సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ కీలక తారలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నక్షత్రం’. ఎస్. వేణుగోపాల్, సజ్జు, కె. శ్రీనివాసులు నిర్మాతలు. భీమ్స్ సిసిరోలియో, భరత్, హరి గౌర సంగీత దర్శకులు. పాటల సీడీలను ఆవిష్కరించిన సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్‌లు, తొలి సీడీని శ్రియ, రెజీనా, ప్రగ్యాలకు అందించారు. కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘డెఫినెట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చేయదు. అందరూ చాలా కష్టపడి చేశారు. నేనూ కష్టపడి చేశాను’’ అన్నారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘ప్రతి రోజూ ఈ సినిమా సెట్‌కు కాలేజి స్టూడెంట్ లా వెళ్లా. కృష్ణవంశీగారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా’’ అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘2009లో కృష్ణవంశీగారికి ఫేస్బుక్లో ‘మిమ్మల్ని ఓసారి కలవాలని’ మెసేజ్ పెట్టా. ఆయన రిప్లై ఇవ్వలేదు. ఏడేళ్ల తర్వాత ఈ సినిమా కుదిరింది. కృష్ణవంశీగారితో సినిమా చేయాలనుకునే చాలామంది కల ఈ ఒక్క సినిమాతో తీరింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు మూడు పాటలతో పాటు నేపథ్య సంగీతం అందించాను. ప్రేక్షకులకు సంగీత దర్శకుడిగా తెలిసిన నన్ను నటుడిగా, గాయకుడిగా పరిచయం చేస్తోన్న మా దర్శకునికి కృతజ్ఞతలు’’ అన్నారు భీమ్స్. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ఓ పాట మాత్రమే చేసినందుకు బాధగా ఉంది. నెక్స్›్ట ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నా’’ అన్నారు శ్రియ. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొన్నారు.