66 రోజులు ఒంటరిగా సముద్రంలో...
మియామి: సముద్ర జలాల్లో రెండు నెలల క్రితం తప్పిపోయిన లూయీ జోర్డాన్ అనే 37 ఏళ్ల సెయిలర్ 66 రోజుల అనంతరం సురక్షితంగా బయటపడి తిరిగి అమెరికాకు చేరుకున్నాడు. తాను వెళుతున్న సెయిలింగ్ బోటు తిరగబడి ఇన్ని రోజుల పాటు సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన జోర్డాన్, చేతులతో పట్టుకున్న చేపలు తిని, వర్షం నీటిని తాగుతూ ఇంతకాలం ప్రాణాలు నిలుపుకున్నాడు.
ప్రాణాలతో బయటపడతానన్న ఆశ అడుగంటుతున్న సమయంలో అటువైపు వచ్చిన ‘హూస్టన్ ఎక్స్‌ప్రెస్ ట్యాంకర్’ అనే జర్మన్ రవాణా నౌక ఆపదలోవున్న ఆ యువకుడిని గుర్తించి రక్షించింది.ఈ విషయాన్ని నార్త్ కరోలినా తీర గస్తీ దళానికి సమాచారమందించగా అది హెలికాప్టర్‌ను పంపించి జోర్డాన్‌ను సురక్షితంగా నార్త్ కరోలినాలోని అతని ఇంటికి చేర్చింది.
జనవరి 29వ తేదీన సేయిలింగ్ బోటుపై సముద్ర జలాల్లోకి వెళ్లిన జోర్డాన్ బోటు తిరగబడడంతో చిక్కుకుపోయాడు. తిరడబడ్డ బోటు మీదనే కూర్చొని ఒడ్డుకు 322 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో అలల వెంట వెళ్లాడు. ప్రాణాలను నిలుపుకోవడానికి చేతులతోనే చేపలు పట్టుకొని, పచ్చివాటిని అలాగే తిన్నానని జార్డాన్ వివరించాడు. సెయిలింగ్‌లో అంతగా అనుభవంలేని తన కుమారుడు సురక్షితంగా ఇంటికి వస్తాడని తాను ఎంతమాత్రం ఊహించలేక పోయానని, పైగా ఇంతకాలం గల్లంతైన తర్వాత ప్రాణాలతో తిరిగి రావడం ఊహకందని విషయమేనని లూయీ జోర్డాన్ తండ్రి ఫ్రాంక్ జోర్డాన్ ఆనంద భాష్పాలతో అమెరికా సీఎన్ఎన్ ఛానల్‌కు వివరించారు.
ఈ సందర్భంగా తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానంటూ ఆస్పత్రి నుంచి లూయీ జోర్డాన్ ఇచ్చిన ఆడియో సందేశాన్ని ఆయన వినిపించారు.నా అనేవారు ఎవరూలేని సముద్ర జలాల్లో ఒంటరిగా రక్షణ కోసం ఎదురు చూస్తున్న తనకు భయంకన్నా ఇంట్లో తల్లిదండ్రులు తన గురించి ఎంత ఆందోళన చెందుతున్నారనే బాధే తనను ఎక్కువ భయపెట్టిందని లూయీ చెప్పాడు.