నిర్భయ దోషులకు నేడు శిక్ష!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిర్భయ కేసులో దోషుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మధ్యాహ్నం వారికి శిక్షలు ఖరారు చేయనుంది. శిక్షలు ఏవిధంగా ఉంటాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దోషులకు మరణశిక్ష విధించాలని నిర్భ య తల్లిదండ్రులతో పాటు దేశవ్యాప్తంగా పలు విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దోషులకు మరణశిక్ష పడే అవకాశాలే అధికంగా ఉన్నప్పటికీ యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు కూడా లేకపోలేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హత్య కేసులలో అత్యంత అరుదైన కేసుల్లోనే దోషులకు మరణశిక్ష పడుతుందని అం టున్నారు. చిన్నారులు, నిస్సహాయులైన మహిళలు, బలహీనులైన వ్యక్తులు లేదా వృద్ధులను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన దోషులకు కోర్టు సాధారణంగా మరణశిక్ష విధిస్తుందని, ఇలాంటివే అత్యంత అరుదైన కేసుల కోవలోకి వస్తాయని పేర్కొం టున్నారు. 1955 వరకు హత్య కేసులన్నిటిలో దోషులకు మరణశిక్షే విధించేవారు.
ఒకవేళ జీవితఖైదు విధించినట్లయితే న్యాయమూర్తి అందుకు కారణాలను వివరించేవారు. కానీ 1955లో చట్ట సవరణ ద్వారా హత్య కేసులలో దోషులకు మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించే విచక్షణాధికారాన్ని జడ్జీలకే వదిలేశారు. అయితే 1973లో భారతీయ శిక్షా స్మృతిని సవరించి దోషులకు మరణశిక్ష విధించినట్లయితే ఆ నిర్ణయానికి గల కారణాలను తీర్పు సందర్భంగా వివరించాలనే నిబంధన చేర్చారు.