ఎంట్రీలు అదుర్స్
వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన వ్యక్తులను సత్కరించేందుకు సాక్షి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్-2014’ ప్రక్రియ కొనసాగుతోంది. సంగీతం-నృత్య రంగాలకు సంబంధించి ఏపీ, తెలంగాణల నుంచి వచ్చిన ఎంట్రీలను... షార్ట్‌లిస్ట్ జ్యూరీ సభ్యులు- నాటక రంగ ప్రముఖులు గుమ్మడి గోపాలకృష్ణ, అల్లాణి శ్రీధర్, నృత్యకారిణి స్వాతి సోమనాథ్ శుక్రవారం పరిశీలించి స్కోర్ ఇచ్చారు. ఈ స్కోర్ ఆధారంగా ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ ఐదు బెస్ట్ నామినీలను ఫైనల్ జ్యూరీకి పంపనుంది.
తుది విజేతను ఫైనల్ జ్యూరీ ఎంపిక చేయనుంది. ‘ఎంట్రీలలో దాదాపు 70 శాతం బాగున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ ఎంట్రీలు రావడం శుభపరిణామం’ అని సినీ దర్శక నిర్మాత అల్లాణి శ్రీధర్ అన్నారు. ‘ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకు సాక్షి మీడియా
చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అద్భుతమైన కళాకారులు వెలుగులోకి వస్తార’ని రంగస్థల దర్శకుడు, నటుడు గుమ్మడి గోపాలకృష్ణ ఆకాంక్షించారు.
సాక్షి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటానన్నారు నృత్యకారిణి స్వాతి సోమనాథ్. ఈరోజు ‘ఎన్జీవో ఆఫ్ ది ఇయర్’ విభాగ ఎంట్రీలను జ్యూరీ సభ్యులు పరిశీలించనున్నారు. మే ఐదు, ఆరు తేదీల్లో ఆయా విభాగాల్లో తుది విజేతలను ప్రకటిస్తారు.