సలేశ్వరం లింగమయ్య జాతరలో విషాదం.. ముగ్గురు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల సలేశ్వరం లింగమయ్య జాతరలో విషాదం చోటుచేసుకుంది. జాతరకు భక్తులు పోటెత్తడంతో.. గుండెపోటుతో అమన్‌గల్‌కు చెందిన విజయ అనే మహిళ మృతిచెందింది. దీంతో సలేశ్వరం జాతరలో మరణించిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తొక్కసలాట జరిగి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. మృతులను నాగర్ కర్నూల్ జిల్లాకే చెందిన గొడుగు చంద్రయ్య (55), వనపర్తి జిల్లాకు చెందిన యువకుడు అభిషేక్‌గా (32) గుర్తించారు.
కాగా నల్లమల్ల అడవుల్లోని సలేశ్వరంలో కొలువై ఉన్న శివుడిని (లింగమయ్య) దర్శించుకోవాలంటే దట్టమైన అడవీ, కొండలు, లోయల మార్గంలో రాళ్లు, రప్పలను దాటుకుంటూ సుమారు 4 కి.మీ. దూరం కాలినడకన నడవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సలేశ్వరం యాత్రకు భక్తులు పోటెత్తారు. లింగమయ్య నామస్మరణతో నల్లమల కొండలు మార్మోగుతున్నాయి.
అయితే ఈ ఏడాది ఈ యాత్ర కేవలం 3 రోజులు మాత్రమే కొనసాగనుండటం, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సలేశ్వరంలో పరిస్థితి అదుపుతప్పింది. అక్కడి లోయల్లో భక్తులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు స్తంభించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
భక్తుల అసంతృప్తి
సలేశ్వరం యాత్ర ఏర్పాట్లపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వారం పది రోజులపాటు నిర్వహించవలసిన జాతరను కేవలం మూడు రోజులపాటు మాత్రమే నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాత్ర ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలను చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సలేశ్వరం జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమవ్వగా శుక్రవారం వరకు జాతర కొనసాగనుంది. ఉగాది తరువాత తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమస్తారు.