saline bottles
-
ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. సరైన సౌకర్యాలు కల్పించని ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో కావాల్సినన్ని గ్లూకోజ్ స్టాండ్లు అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లు గ్లూకోజ్ స్టాండ్‌కి బదులు బెడ్స్ కర్ర సహాయంతో సెలైన్ బాటిల్స్‌ను ఎక్కించుకుంటున్నారు. ఈ దయనీమైన పరిస్ధితి గురించి మీడియాకి సమాచారం అందడంతో అప్రమత్తమైన సిబ్బంది రోగులకు గ్లూకోజ్ స్టాండ్లు తెప్పించారు. -
బాలింత రక్తనాళంలో విరిగిన సూది
సాక్షి, హైదరాబాద్: అత్యవసర రోగులకు ఇంజక్షన్లు, సెలైన్ ఎక్కించేందుకు అమర్చే సెంట్రల్ వీనస్ కేథటర్లు రక్తనాళంలోనే విరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా బయటపడిన విషయం మరిచిపోక ముందే ఈ ఘటన వెలుగు చూడటం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న మందులు, సెలైన్ బాటిళ్లతోపాటు సెంట్రల్ వీనస్ కేథటర్ల, ఇంట్రా కేథటర్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో రోగికి మత్తుమందు, యాంటిబయాటిక్ ఇంజక్షన్లు, సెలైన్ ఎక్కించేందుకు ప్రధాన రక్తనాళానికి వీటిని అమర్చుతారు. కొంతమందికి చేతి నరానికి అమర్చితే.. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి మరికొంత మందికి గొంతు దగ్గర ఉన్న ప్రధాన రక్తనాళానికి అమర్చుతుంటారు. సాధారణంగా ఇవి విరిగిపోవడం అనేది జరగదు. కానీ ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అవుతున్న ఈ కేథటర్లు తొలగించే సమయంలో రక్తనాళంలోనే విరిగి పోతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రక్తనాళంలో విరిగిపోయిన సూది.. మహబూబ్‌నగర్‌కు చెందిన గర్భిణి (21) ప్రసవం కోసం గత నెల 27న పేట్లబురుజు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఒక్కసారిగా హైబీపీ రావడంతో ఈ నెల 3న ఆమెకు ఆస్పత్రి వైద్యులు మెడ వద్ద సెంట్రల్ వీనస్ కేథటర్‌ను అమర్చారు. దీని ద్వారా మత్తుమందు ఇచ్చి ఆమెకు సిజేరియన్ డెలివరీ చేశారు. అయితే కేథటర్‌ను తొలగించే సమయంలో సూది మధ్యకు విరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సదరు బాలింతను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా ఉస్మానియాకు తరలించారు. బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రి కార్డియోథొరాసిక్ వైద్యులు ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు. సీటీ, ఎంఆర్ఐ పరీక్షలు చేశారు. విరిగిపోయిన నీడిల్ ఏ వైపు వెళ్లిందో గుర్తించారు. సర్జరీ చేస్తే బాలింత ప్రాణాలకే ప్రమాదమని భావించి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో కార్డియోథొరాసిక్ వైద్య బృందం శుక్రవారం ఉదయం ఆమెకు సర్జరీ చేసి, దవడ కింది భాగంలోని ప్రధాన రక్తనాళానికి అడ్డుగా ఉన్న నీడిల్‌ను విజయవంతంగా తొలగించింది. నాణ్యతపై అనుమానాలు: ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాల పరిధిలో పేట్లబురుజు, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రి, చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ), సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, చాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రుల్లో రోజుకు సగటున 300పైగా సర్జరీలు అవుతుంటాయి. నగరంలోని వివిధ ప్రసూతి ఆస్పత్రుల్లో రోజుకు సగటున 250 ప్రసవాలు అవుతుంటాయి. అత్యవసర చికిత్సలు అవసరమైన రోగులతోపాటు ప్రసవం కోసం వచ్చిన గర్భిణులకు రోజుకు నాలుగైదు ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లు ఎక్కించాల్సి వస్తుంది. ఇంజక్షన్ల కోసం పదేపదే నీడిల్‌తో గుచ్చడం వల్ల రోగికి నొప్పితో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో ఐవీ కేథటర్లను అమర్చుతుంటారు. ఆస్పత్రి నుంచి రోగిని డిశ్చార్జ్ చేసే సమయంలో చేతికి, మెడ భాగంలో ఉన్న కేథటర్లను తొలగిస్తుంటారు. అయితే నాణ్యతా లోపం వల్ల కేథటర్‌ను తొలగించే సమయంలో రక్తనాళంలో నీడిల్ మధ్యకు విరిగి రక్తంతోపాటే ఇతర భాగాలకు చేరుతుంది. రోగుల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతోంది. నాసిరకం కేథటర్లను సరఫరా చేస్తుండటం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
నర్సు కాదు.. నరరూప రాక్షసి
పెషెంట్ల బాగోగులు చూసుకోవాల్సిన నర్సు.. మృగంగా మారింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు... ఏకంగా 20 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అయితే అందుకు ఆమె చెబుతున్న సమాధానం వింటే ఎవరైనా షాక్‌కి గురికావాల్సిందే... జపాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... టోక్యో: గతంలో నిందితురాలు ఆయూమీ కుబోకి(31) టోక్యో సబ్ అర్బన్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేసేది. ఆ సమయంలో(2016)లో ఓ వృద్ధుడు(88) మరణించటంతో.. అతని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఆయూమీనే అతనికి విషమిచ్చి చంపిందన్న విషయం తేలటంతో గత శనివారం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే విచారణలో ఆమె షాకింగ్ విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. సెలైన్ బాటిళ్లలో విషం(సబ్బు, కాస్మోటిక్‌లతో కలిపి తయారు చేసిన రసాయనం) ఎక్కించి 20 మందిని చంపినట్లు నిందితురాలు ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆయా మరణాలపై ఆరాలు తీయటం ప్రారంభించారు. అయితే వారందిరిపై తనకేం పగలేదని.. కేవలం పనిని తప్పించుకునేందుకు తాను అలా చేశానని ఆమె చెప్పటంతో పోలీసులు కంగుతిన్నారు. ‘పెషెంట్ల బాగోగులు చూసుకోవటం కష్టతరమైంది. రోజు అర్ధరాత్రి దాకా ఉండాల్సి వచ్చేది. ఒకవేళ వాళ్లు చనిపోతే ఆ బాధ్యతంతా నా నెత్తినే పడేది. శవ పరీక్ష.. బంధువులకు అప్పగింత.. అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చేంది. ఈ వ్యవహారం అంతా నాకు చిరాకు తెప్పించింది. అందుకే నా డ్యూటీ అయిపోయ్యాక వెళ్లేముందు వారి సెలైన్ బాటిళ్లకు విషమిచ్చేదాన్ని. ఇందుకోసం తీవ్ర అస్వస్థతో ఉన్న వృద్ధులనే టార్గెట్ చేసుకున్నా’ అని ఆయూమీ స్టేట్మెంట్ను స్థానిక మీడియా ప్రచురించింది. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించింది. ఆమె 2016లోనే పని మానేసిందని, పోలీసు దర్యాప్తులో అసలు నిజాలు వెలుగుచూస్తాయని మేనేజ్మెంట్ పేర్కొంది. ఇదిలా ఉంటే 2016లో ఆస్పత్రిలో మొత్తం 48 మంది పెషెంట్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. -
సెలైన్ బాటిల్స్ వాపస్
-
సెలైన్ బాటిల్స్ వాపస్
► ప్రభుత్వాసుపత్రుల నుంచి వెనక్కి తెప్పించండి ► సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌కు వైద్య శాఖ అత్యవసర ఆదేశాలు ► ఇటీవల బాలింతల మరణంతో అనుమానాలు.. ► 3.5 లక్షల బాటిల్స్ వెనక్కి వచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, బోధనాసుపత్రులకు సరఫరా చేసిన వివిధ రకాల ఐవీ ఫ్లూయిడ్స్ సెలైన్ బాటిళ్లను వెనక్కి తెప్పించాల్సిందిగా తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) అత్యవసర ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లా సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల ఫార్మసిస్టులకు టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్‌రావు ఉత్తర్వులు జారీచేశారు. అత్యవసర ఆదేశంతో మొత్తం 8 రకాల ఐవీ ఫ్లూయిడ్స్‌ను వెనక్కి రప్పిస్తున్నారు. ఇటీవల నీలోఫర్, తాజాగా సుల్తాన్‌బజార్ ఆసుపత్రుల్లో బాలింతల మరణాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకు వెనక్కు రప్పిస్తున్నారన్న సమాచారాన్ని మాత్రం బయటకు పొక్కనీయడం లేదు. ఇటీవల చనిపోయిన బాలింతలకు ఈ ఐవీ ఫ్లూయిడ్ సెలైన్లను వాడారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలింతలకు ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఈ ఐవీ ఫ్లూయిడ్స్‌ను వాడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆగమేఘాలపై అత్యవసర ఉత్తర్వులు జారీచేసినట్లు ప్రచారం జరుగుతోంది. 3.5 లక్షలకుపైనే.. ఐవీ ఫ్లూయిడ్స్‌ను వివిధ సందర్భాల్లో రోగులకు వాడతారు. వాటిల్లో అనేక రకాలున్నాయి. కొన్ని సాధారణ ఐవీ ఫ్లూయిడ్స్‌ను డయేరియా, జ్వరంతో బాధపడుతున్న వారికి వాడతారు. యాంటీబయోటిక్ ఐవీ ఫ్యూయిడ్స్ను శస్త్రచికిత్సలు చేశాక ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు ఉపయోగిస్తారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఇప్పుడు వెనక్కి రప్పించాలని ఆదేశించిన వాటిల్లో అనేకం శస్త్రచికిత్సలు జరిగినప్పుడు ఉపయోగించే ఐవీ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులకు 8 రకాల ఐవీ ఫ్లూయిడ్స్‌ను సరఫరా చేశారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఉస్మానియా, గాంధీ వంటి బోధనాసుపత్రులన్నింటా కలిపి మొత్తం 3.5 లక్షలకు పైనే ఈ సెలైన్ బాటిళ్లు నిల్వ ఉన్నట్లు సమాచారం. వీటి విలువ మార్కెట్లో రూ.4–5 కోట్ల మధ్య ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ ఆగమేఘాలపై వెనక్కు తెప్పించాలని ఆదేశించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటివల్ల ఎంత మందికి ఇతరత్రా దుష్ప్రభావాలు కలిగాయో సమాచారం లేదు. టీఎస్ఎంఎస్ఐడీ వర్గాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. టీఎస్ఎంఎస్ఐడీసీ గత చరిత్ర చూస్తే... నాసిరకం మందులను ఆసుపత్రులకు పంపి తిరిగి వెనక్కు తెప్పించిన చరిత్ర టీఎస్ఎంఎస్ఐడీసీకి ఉంది. అలా తప్పిదాలు చేసిన వాటిల్లో కొన్ని... – గతేడాది మార్చిలో 24,456 సీసాల (మూడు బ్యాచ్‌ల్లో) కాంపౌండ్ సోడియం లాక్టేట్ ఇంజెక్షన్ ఐపీ 500 ఎంఎల్‌ను టీఎస్ఎంఎస్ఐడీసీ ఓ సంస్థ నుంచి కొనుగోలు చేసింది. వాటిని సరోజినీ కంటి ఆసుపత్రి సహా వివిధ ఆసుపత్రులకు పంపిణీ చేసింది. సరోజినీ కంటి ఆసుపత్రిలో ఈ మందును గతేడాది జూన్ 30న జరిగిన శస్త్రచికిత్సల సమయంలో 13 మంది రోగులకు వినియోగించారు. ఆ మరుసటి రోజున రోగులు ఇన్ఫెక్షన్కు గురయ్యారు. కొందరు కంటిచూపు కోల్పోయారు. – 1.12 లక్షల ‘ఆన్డాన్సెట్రాన్ 4 ఎంజీ’మాత్రలను టీఎస్ఎంఎస్ఐడీసీ 2015 జనవరిలో ఒక సంస్థ నుంచి కొనుగోలు చేసి వివిధ ఆసుపత్రులకు పంపించింది. అప్పటివరకు వాటికి సంబంధించిన నాణ్యత నివేదిక రాలేదు. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వ ఔషధ నియంత్రణ ప్రయోగశాల ఆ మందులు నాణ్యమైనవి కావని, వెనక్కు పంపాలని డిసెంబర్లో ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ అప్పటికే ఆసుపత్రులు చాలావరకు వాటిని వినియోగించాయి. – 51 వేల ‘ఈనలప్రిల్ మాలెట్ 5 ఎంజీ’మాత్రలను 2015 ఏప్రిల్, నవంబర్ మధ్య హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి సరఫరా చేసింది. అప్పటికి ఇంకా నాణ్యత నివేదిక రాలేదు. ఈ మందులు నాణ్యమైనవి కావని టీఎస్ఎంఎస్ఐడీసీ 2016 ఏప్రిల్‌లో తెలిపింది. అప్పటికే 44,400 మాత్రలను రోగులకు అందజేశారు. మిగిలిన 6,600 మాత్రలను మాత్రమే తిప్పి పంపారు. వాటిని బాలింతలకు ఉపయోగించలేదు: టీఎస్ఎంఎస్ఐడీసీ వెనక్కి తెప్పించే ఐవీ ఫ్లూయిడ్స్ సెలైన్ బాటిళ్లను సుల్తాన్‌బజార్‌లో ఇటీవల చనిపోయిన బాలింతలకు ఉపయోగించలేదు. అంతర్జాతీయ బ్రాండ్ కలిగిన కొత్త ఐవీ ఫ్లూయిడ్స్ స్టాక్ వచ్చినందునే వీటిని వెనక్కి తెప్పిస్తున్నాం. వీటిపై ఎటువంటి ఫిర్యాదులు లేవు. ముందస్తుగా వెనక్కు తెప్పిస్తున్నాం. పైగా చాలావరకు కాలం తీరే దశకు చేరుకున్నాయి.