Salman Nizami
-
దేశమే నా తల్లి, తండ్రి
లూనావాడా/బోడేలి: దేశమే తనకు తల్లి, తండ్రి అని..దేశ సేవలోనే తుదిశ్వాస విడుస్తానని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ, నాయనమ్మ ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, ముత్తాత నెహ్రూ స్వాతంత్య్ర సమరయోధుడంటూ ట్వీట్ చేసిన కాంగ్రెస్ నేత సల్మాన్ నిజామీ.. ప్రధాని మోదీ తల్లిదండ్రులెవరంటూ ప్రశ్నించారు. ఈ ట్వీట్లపై మహిసాగర్ జిల్లా లూనావాడాలో జరిగిన ర్యాలీలో మోదీ విరుచుకుపడ్డారు. కశ్మీర్‌కు చెందిన నిజామీ.. ఆజాద్ కశ్మీర్ కోసం డిమాండ్ చేశాడని, అక్కడి భారత సైన్యాన్ని రేపిస్టులని ఆరోపించాడని అన్నారు. పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురును అమరుడంటూ కీర్తించిన ఘనత నిజామీది అని దుయ్యబట్టారు. అఫ్జల్ గురును ఉరి తీసిన తర్వాత ఇంటింటికీ ఒక అఫ్జల్ తయారు కావాలని ప్రసంగించాడని ఆరోపించారు. . పటీదార్లకు రిజర్వేషన్ హామీ ప్రత్యేక కోటాలో రిజర్వేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ ఇస్తున్న హామీని నమ్మవద్దని పటీదార్లను మోదీ కోరారు. పటీదార్ల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో కోత వేస్తారా..లేక మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా ముస్లింలకు రిజర్వేషన్లు అంటూ హామీ ఇచ్చి వదిలేస్తారా అని కాంగ్రెస్‌ను నిలదీశారు. ఏ రాష్ట్రంలోనైనా ముస్లింలకు రిజర్వేషన్లు అమలయ్యాయా అని ప్రశ్నించారు. బీసీలు పనికిరాని వారా? అయ్యర్ ట్వీట్లను మోదీ ప్రస్తావించారు. చోటా ఉదయ్‌పూర్ జిల్లా బోడేలిలో మాట్లాడుతూ.. వెనుకబడిన కులంలో పుట్టినందుకే తనను ‘నీచ్’అంటూ విమర్శించారన్నారు. వెనుకబడిన వర్గాల వారంతా పనికిరాని వారని అనుకుంటున్నారా అని అడిగారు. ఎన్నికలు జరిగిన ప్రతీచోటా ఓడిన కాంగ్రెస్ తనను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. తనను ఓడిస్తే ప్రధాని పదవి ఖాళీ అవుతుందని, యువరాజు(రాహుల్)ను గద్దెపై కూర్చోబెట్టవచ్చనే ఆశతో ఉందన్నారు. -
'నా తల్లిదండ్రులెవరా..? కాంగ్రెస్‌కు సిగ్గు లేదు'
సాక్షి, గాంధీనగర్ : ఓ పక్క తొలిదశ పోలింగ్ జరుగుతుండగానే రెండో దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ మునిగిపోయారు. తనను నీచమైన వ్యక్తి అంటూ కాంగ్రెస్ పార్టీ నేత మణిశంకర్ చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రజలకు గుర్తు చేస్తూ ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కీలక అనుచరుడైన సల్మాన్ నిజామీ చేసిన వ్యాఖ్యలను మరో ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. సల్మాన్ తన తల్లిదండ్రులు ఎవరని ప్రశ్నిస్తున్నారని, అసలు అలాంటి భాష ఉపయోగించవచ్చా అని మోదీ ప్రశ్నించారు. 'నా తండ్రి, తల్లి ఎవరని కాంగ్రెస్ పార్టీ నన్ను ప్రశ్నిస్తోంది. నా సోదరీసోదరులారా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను.. అలాంటి భాషను మనం శత్రువుల విషయంలోనైనా ఉపయోగిస్తామా? కానీ, ఒక బాధ్యతగల కాంగ్రెస్ పార్టీ నేత నన్ను ఇలా అడిగారు. రాహుల్‌గాంధీ పార్టీ నా తల్లిదండ్రులెవరని ప్రశ్నిస్తోంది. ఈ దేశ ప్రజలే నాతల్లిదండ్రులు. నేను ఈ భూమిపుత్రుడిని.. ఈ లునావాడ బిడ్డను. భాష విషయంలో, పనుల విషయంలో మాటల విషయంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గును వదిలేసింది. ఆ పార్టీ ఓటమి అంచుల్లో ఉంది. ఎన్నో అబద్ధాలు ప్రచారం చేస్తుంది. అలా అబద్ధాలు చెప్పడం కూడా నేరమే. సామాన్య ప్రజలకోసం పనిచేసేది మన ప్రభుత్వమే' అని మోదీ చెప్పారు. -
కాంగ్రెస్ సిగ్గు వదిలేసింది:మోదీ
-
‘సీఎం యోగికి భయపడను’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే తనకు భయం లేదని, ఆయనపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కశ్మీర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ నిజామీ అన్నారు. సీఎం యోగిపై ట్విటర్ లో అభ్యంతకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ అభిషేక్ ఆత్రే పరువునష్టం దావా నోటీసు పంపారు. దీనిపై సల్మాన్ నిజామీ స్పందిస్తూ... ‘నేను భయపడను. సీఎం యోగిపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. మా లాయర్ ద్వారా నోటీసుకు సమాధానం ఇస్తాను. ఎవరో చెప్పినదాన్ని నేను చెప్పను. నేను నమ్మిన విషయాన్ని నిర్భయంగా ప్రకటిస్తాను. ముఖ్యమంత్రి పదవికి యోగి తగరని బలంగా విశ్వసిస్తున్నాను. యూపీలో ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదని, కమలం పార్టీ ఆయనను బలవంతంగా ప్రజలపై రద్దుతోంద’ని పేర్కొన్నారు. మతోన్మాదులు, విద్వేషాలు రెచ్చగొట్టే వారిని వ్యతిరేకించే హక్కు రాజ్యాంగం అందరికీ ఇచ్చిందని అన్నారు. ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ పై సాక్ష్యాలు లేనప్పటికీ ఆయనను వేటాడుతున్నారని.. హత్య, దాడుల కేసులు ఎదుర్కొంటున్న యోగి ఆదిత్యనాథ్ ను యూపీ సీఎం చేశారని ట్విటర్ లో సల్మాన్ నిజామీ పోస్ట్ చేయడంతో వివాదం రేగింది.