samaika movement
-
అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాల్సిందే
ఒంగోలు, న్యూస్‌లైన్: ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇప్పుడు అసెంబ్లీ ముందు ఉన్న ఒకేఒక ఆయుధం సమైక్యాంధ్ర తీర్మానం చేయడమే. సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఆ దిశగా కృషి చేయాలి’ అని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా రెండో రోజు జరిగిన రిలే దీక్షల్లో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రంలో జరిగిన దీక్షలో పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఒక్కటే మార్గమన్నారు. కాంగ్రెస్ ఒక వైపు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తూ, మరోవైపు తమ పార్టీని టార్గెట్ చేయాలని చూడడం దారుణమన్నారు. ఇప్పటికైనా సీఎం కిరణ్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం 15 మంది నిరాహార దీక్షకు పూనుకున్నారు. కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మలు రిలే దీక్షలను ప్రారంభించారు. ఇక్కడ 10 మంది, పామూరులో 8 మంది, వెలిగండ్లలో 17మంది దీక్షల్లో కూర్చున్నారు. దర్శిలోని రెవెన్యూ కార్యాలయ సమీపంలో చేపట్టిన దీక్షలను నియోజకవర్గ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర తీర్మానం చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీలో చర్చ కోసం పట్టుబట్టి ఏదో ఒక విధంగా సోనియా గాంధీ నిర్ణయానికి మద్దతు పలకాలన్న కుట్రలను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. టీడీపీ అధినేత ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతం పాటిస్తూ ప్రజలను వంచన చేస్తున్నారని మండిపడ్డారు. 33 మంది దీక్ష చేపట్టారు. గిద్దలూరులో 12 మంది దీక్ష వహించగా.. నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుమల అశోక్‌రెడ్డి ప్రారంభోపాన్యాసం చేశారు. మద్దిపాడులో జరిగిన దీక్షలను సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, వరికూటి అమృతపాణిలు ప్రారంభించారు. పెద్దారవీడులో సమన్వయకర్త పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో 15 మంది దీక్ష చేపట్టారు. చీరాలలో 9మంది దీక్షలో కూర్చోగా.. సమన్వయకర్తలు పాలేటి రామారావు, సజ్జాహేమలతలు ప్రారంభించారు. ఒంగోలులో వివిధ అనుబంధ సంఘాల నగర కన్వీనర్లు చేపట్టిన శిబిరాన్ని ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్ ప్రారంభించారు. యూత్ నగర కన్వీనర్ నెరుసుల రాము, సేవాదళ్ నగర కన్వీనర్ కంకణాల వెంకట్రావు, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ ముదివర్తి బాబూరావు, ఎస్సీసెల్ నగర కన్వీనర్ వై.రమేష్, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, బీసీ విభాగం నగర కన్వీనర్ బొప్పరాజు కొండలరావు, విద్యార్థి విభాగం నగర కన్వీనర్ రేలా అమర్నాథ్రెడ్డి, ప్రచార కమిటీ నగర కన్వీనర్ దూళిపూడి ప్రసాద్‌నాయుడు, నగర అధికారప్రతినిధి రొండా అంజిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు రాయని వెంకట్రావు, గాలేటి వెంకటేశ్వర్లు, మారెడ్డి రామకృష్ణారెడ్డి, మహిళా నాయకులు పాలేటి లక్ష్మి, బత్తుల ప్రమీల, ఎస్.మహాలక్ష్మి, షేక్ రసూల్, గంధం సామేలు, వర్థుశేషయ్య తదితరులు దీక్ష చేపట్టారు. సాయంత్రం దీక్షకు హాజరైన జిల్లా అధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ డీఎస్ క్రాంతికుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తోటపల్లి సోమశేఖర్ సంఘీభావం ప్రకటించారు. -
పిలుపే ప్రభంజనం
సాక్షి, అనంతపురం : సమైక్య ఉద్యమంలో మరో అంకానికి తెరలేచింది. ఇంతవరకు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, వంటా వార్పు, వినూత్న నిరసనలతో జిల్లా అట్టుడికింది. అయితే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 26న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో చేపట్టనున్న ‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభ నేపథ్యంలో ఉద్యమం స్వరూపం ఉధృతంగా మారింది. జిల్లాలోని చిన్నా..పెద్దా.. కుల.. మతాల తేడా లేకుండా అన్ని వర్గాల వారు చేయి చేయి కలిపి సమర శంఖం పూరించడానికి సిద్ధమయ్యారు. జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ ఎవరి నోట విన్నా.. ‘సమక్య శంఖారావం కార్యక్రమానికి నేను వెళ్తున్నా.. నువ్వూ వస్తున్నావు కదా..’ అంటూ శంఖారావం కార్యక్రమానికి తరలివెళ్లడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని జేఏసీలు శంఖారావానికి మద్దతు తెలిపాయి. ప్రధానంగా పార్టీ శ్రేణులు విశేషంగా స్పందిస్తున్నాయి. జగన్మోహన్రెడ్డి చేపట్టిన అసాధారణ సంకల్పానికి జిల్లా ప్రజలు సమైక్య గళంతో మద్దతు తెలపడానికి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని చేపట్టిన సమైక్య శంఖారావం కార్యక్రమానికి మేము సైతం బాసటగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. విభజనను అడ్డుకోవడానికి ఇదే మంచి అవకాశమని, ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ అడ్డుకోలేమని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలంటే సమైక్య శంఖారావానికి మద్దతు పలకాల్సిందేనంటూ ప్రజలు వేలాదిగా తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. గురువారం వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రం కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన సమైక్య శంఖారావానికి జిల్లా నుంచి చిన్నా..పెద్దా తేడా లేకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రం కోసం పోరు సాగిస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డేనని అన్నారు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక సీమాంధ్ర అగ్నిగుండమౌతుంటే.. ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయకుండా.. రాజధాని కోసం, ప్యాకేజీల కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తూ.. కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. సమైక్య రాష్ట్రం కోసం పోరు సాగిస్తున్న జననేత కు అండగా నిలిచి సమైక్యాంధ్ర పరిరక్షణకు చివరి వరకు పోరాడుతామని పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోతే సాగు.. తాగునీటి సమస్యలు తీవ్రమవుతాయని అన్నారు. కరువుకు నిలయమైన అనంతపురం జిల్లా ఎడారిగా మారుతుందన్నారు. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్రను కాంక్షించే ప్రతి ఒక్కరూ సమర సైనికులై ‘సమైక్య శంఖారావానికి తరలి వచ్చి.. సమైక్య గళం వినిపించాలన్నారు. పార్టీ అభిమానులు, సమైక్య వాదులు, జిల్లా ప్రజల సౌకర్యార్థం జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నాయకుల సహకారంతో హైదరాబాద్‌కు వందలాది బస్సులు, వేలాది జీపులు, కార్లు, గుంతకల్లు నుంచి రైలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాహనాలు, రైలు 25వ తేదీ సాయంత్రం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్తాయని చెప్పారు. -
సర్పంచులు డీలా!
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ఎన్నో ఆశలు, లక్ష్యాలతో పదవీ బాధ్యతలు స్వీకరించిన గ్రామ పంచాయతీ సర్పంచులు ప్రస్తుతం నిర్వేదంలో ఉన్నారు. సమైక్య ఉద్యమం వల్ల రెండున్నర నెలలుగా అధికార యంత్రాంగంలో స్తబ్దత నెలకొనడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నయాపైసా విడుదల చేయకపోవడంతో సర్పంచులు పూర్తిగా డీలా పడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలిచ్చామని, కనీసం ఒక్కటి కూడా తీర్చలేని స్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు. బాధ్యతలు చేపట్టి రెండున్నర నెలలైనా పంచాయతీలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నామని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు గ్రామపంచాయతీలు రెండేళ్లకు పైగా ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగాయి. ఆ సమయంలో గ్రామాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. పారిశుధ్యం, వీధిలైట్లు, రోడ్లు, తాగునీరు తదితర సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పారిశుధ్య లోపం వల్ల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని సర్పంచులు భావిస్తున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించడం లేదు. గ్రామ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వం నిధులను సమకూర్చకపోవడంతో డీలా పడుతున్నారు. గ్రామ పంచాయతీల ఖాతా నుంచి నిధులు డ్రా చేద్దామన్నా ఫలితం లేకుండా పోతోంది. జిల్లాలోని 90 శాతం పంచాయతీల్లో నిధులు పెద్దగా లేవు. మేజర్ పంచాయతీల్లో మాత్రం చిన్నపాటి పనులు చేయడానికి నిధులున్నాయి. గతంలో సర్పంచుగా గెలిచిన వెంటనే వీధిలైట్లు, పారిశుధ్య పనులు వంటివి చేయించేవారు.రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపనలు చేసేవారు. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. పంచాయతీ ఎన్నికల మూడవవిడత పోలింగ్ రోజునే సమైక్య ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ఉద్యమంలో అటెండర్ మొదలుకుని గెజిటెడ్‌స్థాయి అధికారి వరకూ పాలుపంచుకుంటున్నారు. దీంతో పంచాయతీల అభివృద్ధిపై సర్పంచులకు దిశానిర్దేశం చేసే నాథులే కరువయ్యారు. దీనికితోడు నిధులు కూడా లేకపోవడంతో సర్పంచులు పూర్తిస్థాయిలో ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నారు. -
వైఎస్సార్సీపీ సమైక్య ఆందోళనను అడ్డుకున్న పోలీసులు.. ఠాణాలో ధర్నా
పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల ఆందోళన భగ్నం అసెంబ్లీకి వెళ్లకుండా తెలుగుతల్లి విగ్రహం వద్దే అరెస్టు దీంతో పోలీస్ స్టేషన్లోనూ కొనసాగిన ధర్నా కాంగ్రెస్, టీడీపీ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు అసెంబ్లీకెళ్లే హక్కు తమకు లేదా అని నిలదీసిన ఎమ్మెల్యేలు చరిత్రహీనుడిగా మిగలొద్దంటూ చంద్రబాబుకు హితవు విభజన లేఖను వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ రాష్ట్రం కోసం మరిన్ని పోరాటాలు చేయాలి: విజయమ్మ నేతలకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేసినపార్టీ గౌరవాధ్యక్షురాలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో చలనం రావటం లేదు. అందుకే టీడీపీ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు, రాష్ట్రంలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి విభజన నిర్ణయం వెనక్కుతీసుకునే అవకాశం ఉంటుంది. - వైఎస్ విజయమ్మ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ, విభజన పట్ల కాంగ్రెస్, టీడీపీ అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు శుక్రవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ప్రజాప్రతినిధులు, నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానీ, వారంతా పోలీస్స్టేషన్లోనూ ధర్నా కొనసాగించారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధుల సమైక్య నినాదాలతో పోలీస్‌స్టేషన్ ఆవరణ దద్దరిల్లింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. అనంతరం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్వయంగా గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నేతలను పరామర్శించారు. సమైక్య డిమాండ్‌పై మరిన్ని ఆందోళనలు చేపట్టాల్సి ఉన్నందున ఈ ఆందోళనను నిలిపివేయాలని సర్దిచెప్పడంతో.. ప్రజాప్రతినిధులు, నేతలు వారి ఆందోళన విరమించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో పాటు, విభజన అంశంలో కాంగ్రెస్, టీడీపీ వైఖరులను నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం పదిగంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పదిహేను మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, పద్నాలుగు మంది తాజా మాజీ ఎమ్మెల్యేలు సచివాలయం వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్దకు చేరుకుని, నివాళి అర్పించారు. అయితే, తెలుగుతల్లి విగ్రహం పరిసరాల్లో అప్పటికే భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించడంతో పాటు అక్కడ ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. వెంటనే ఆ ముళ్ల కంచెను తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన పట్ల కాంగ్రెస్, టీడీపీల ద్వంద్వ వైఖరులను నిరసిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ, ఎలాంటి షరతులూ లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రానికి ద్రోహం తలపెట్టడం మంచిది కాదని, చరిత్రహీనుడిగా మిగలవద్దని చంద్రబాబుకు హితవు చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులంతా సీడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగా పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద కొంతసేపు బైఠాయించారు. అనంతరం పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు వెళ్లి పూలతో నివాళి అర్పించారు. పొట్టి శ్రీరాములు ఆశయసాధన కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ప్రాణాలైనా అర్పిస్తామంటూ పెద్దపెట్టున నినదించారు. తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, నేతలంతా పాదయాత్రగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి, నివాళులర్పించారు. అక్కడి నుంచి అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు బయలుదేరుతుండగానే.. పోలీసులు చుట్టుముట్టి వారిని అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీకి వెళ్లే హక్కు తమకు ఉందంటూ వారు ప్రతిఘటించడంతో తోపులాట చోటుచేసుకుంది. ‘‘మేమంతా అసెంబ్లీకి వెళ్లాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ప్రజాస్వామ్యయుతంగా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతాం.. మీరు పక్కకు తప్పుకోండి’’ అని వారు కోరినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. దాంతో ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘‘ఎంపీ, ఎమ్మెల్యేలమైన మాకు కూడా రాజధానిలో నడిచే హక్కులేదా?’’ అని నేతలు పోలీసులను నిలదీశారు. పోలీసులు ఇదేమీ పట్టించుకోకుండా, నిరంకుశంగా వ్యవహరిస్తూ నేతలందరినీ వ్యాన్లలో ఎక్కించి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో ధర్నా: పోలీసులు తమను అడ్డుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో... వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నేతలంతా గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే బైఠాయించి తమ ఆందోళన కొనసాగించారు. కాంగ్రెస్, టీడీపీ వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. చెవుల్లో పూలు పెట్టుకుని, మోకాళ్లపై నిలుచుని.. ఇలా రెండున్నర గంటల పాటు నిరసన తెలిపారు. అయితే, వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్వయంగా గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ముందుముందు మరిన్ని పోరాటాలు చేయాల్సి ఉంటుందని నచ్చజెప్పి వారి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం పోలీసులు వారందరినీ సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ధర్నాలో పాల్గొన్న నేతలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి... ఎమ్మెల్యేలు భూమా శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్ల బాబూరావు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎ.బాలరాజు, ఆకేపాటి అమరనాథరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గుర్నాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కాటసాని రామిరెడ్డి... ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, మేకా శేషుబాబు, దేవగుడి నారాయణరెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు... తాజా మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, సుజయకృష్ణ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కొడాలి నాని, పేర్నినాని, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమరనాథరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జోగి రమేష్, మద్దాల రాజేష్, బాలనాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదతరులతో పాటు పలువురు పార్టీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు.