అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ఎన్నో ఆశలు, లక్ష్యాలతో పదవీ బాధ్యతలు స్వీకరించిన గ్రామ పంచాయతీ సర్పంచులు ప్రస్తుతం నిర్వేదంలో ఉన్నారు. సమైక్య ఉద్యమం వల్ల రెండున్నర నెలలుగా అధికార యంత్రాంగంలో స్తబ్దత నెలకొనడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నయాపైసా విడుదల చేయకపోవడంతో సర్పంచులు పూర్తిగా డీలా పడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలిచ్చామని, కనీసం ఒక్కటి కూడా తీర్చలేని స్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు. బాధ్యతలు చేపట్టి రెండున్నర నెలలైనా పంచాయతీలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నామని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు గ్రామపంచాయతీలు రెండేళ్లకు పైగా ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగాయి. ఆ సమయంలో గ్రామాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. పారిశుధ్యం, వీధిలైట్లు, రోడ్లు, తాగునీరు తదితర సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పారిశుధ్య లోపం వల్ల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని సర్పంచులు భావిస్తున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించడం లేదు.
గ్రామ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వం నిధులను సమకూర్చకపోవడంతో డీలా పడుతున్నారు. గ్రామ పంచాయతీల ఖాతా నుంచి నిధులు డ్రా చేద్దామన్నా ఫలితం లేకుండా పోతోంది. జిల్లాలోని 90 శాతం పంచాయతీల్లో నిధులు పెద్దగా లేవు. మేజర్ పంచాయతీల్లో మాత్రం చిన్నపాటి పనులు చేయడానికి నిధులున్నాయి. గతంలో సర్పంచుగా గెలిచిన వెంటనే వీధిలైట్లు, పారిశుధ్య పనులు వంటివి చేయించేవారు.రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపనలు చేసేవారు.
ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. పంచాయతీ ఎన్నికల మూడవవిడత పోలింగ్ రోజునే సమైక్య ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ఉద్యమంలో అటెండర్ మొదలుకుని గెజిటెడ్‌స్థాయి అధికారి వరకూ పాలుపంచుకుంటున్నారు. దీంతో పంచాయతీల అభివృద్ధిపై సర్పంచులకు దిశానిర్దేశం చేసే నాథులే కరువయ్యారు. దీనికితోడు నిధులు కూడా లేకపోవడంతో సర్పంచులు పూర్తిస్థాయిలో ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నారు.
సర్పంచులు డీలా!
Published Wed, Oct 16 2013 2:44 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement