వైఎస్సార్‌సీపీ సమైక్య ఆందోళనను అడ్డుకున్న పోలీసులు.. ఠాణాలో ధర్నా | Police obstruct YSRCP leaders' agitation | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ సమైక్య ఆందోళనను అడ్డుకున్న పోలీసులు.. ఠాణాలో ధర్నా

Published Sat, Sep 21 2013 2:24 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Police obstruct YSRCP leaders' agitation

పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల ఆందోళన భగ్నం
 అసెంబ్లీకి వెళ్లకుండా తెలుగుతల్లి విగ్రహం వద్దే అరెస్టు
 దీంతో పోలీస్ స్టేషన్‌లోనూ కొనసాగిన ధర్నా
 కాంగ్రెస్, టీడీపీ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు
 అసెంబ్లీకెళ్లే హక్కు తమకు లేదా అని నిలదీసిన ఎమ్మెల్యేలు
 చరిత్రహీనుడిగా మిగలొద్దంటూ చంద్రబాబుకు హితవు
 విభజన లేఖను వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్
 రాష్ట్రం కోసం మరిన్ని పోరాటాలు చేయాలి: విజయమ్మ
 నేతలకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేసినపార్టీ గౌరవాధ్యక్షురాలు

 
 ఎన్ని ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో చలనం రావటం లేదు. అందుకే టీడీపీ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు, రాష్ట్రంలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి విభజన నిర్ణయం వెనక్కుతీసుకునే అవకాశం ఉంటుంది.
 - వైఎస్ విజయమ్మ

 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ, విభజన పట్ల కాంగ్రెస్, టీడీపీ అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు శుక్రవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ప్రజాప్రతినిధులు, నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానీ, వారంతా పోలీస్‌స్టేషన్‌లోనూ ధర్నా కొనసాగించారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల సమైక్య నినాదాలతో పోలీస్‌స్టేషన్ ఆవరణ దద్దరిల్లింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. అనంతరం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్వయంగా గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నేతలను పరామర్శించారు. సమైక్య డిమాండ్‌పై మరిన్ని ఆందోళనలు చేపట్టాల్సి ఉన్నందున ఈ ఆందోళనను నిలిపివేయాలని సర్దిచెప్పడంతో.. ప్రజాప్రతినిధులు, నేతలు వారి ఆందోళన విరమించారు.
 
 రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో పాటు, విభజన అంశంలో కాంగ్రెస్, టీడీపీ వైఖరులను నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం పదిగంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పదిహేను మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, పద్నాలుగు మంది తాజా మాజీ ఎమ్మెల్యేలు సచివాలయం వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్దకు చేరుకుని, నివాళి అర్పించారు. అయితే, తెలుగుతల్లి విగ్రహం పరిసరాల్లో అప్పటికే భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించడంతో పాటు అక్కడ ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. వెంటనే ఆ ముళ్ల కంచెను తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన పట్ల కాంగ్రెస్, టీడీపీల ద్వంద్వ వైఖరులను నిరసిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ, ఎలాంటి షరతులూ లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
 
 స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రానికి ద్రోహం తలపెట్టడం మంచిది కాదని, చరిత్రహీనుడిగా మిగలవద్దని చంద్రబాబుకు హితవు చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులంతా సీడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగా పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద కొంతసేపు బైఠాయించారు. అనంతరం పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు వెళ్లి పూలతో నివాళి అర్పించారు. పొట్టి శ్రీరాములు ఆశయసాధన కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ప్రాణాలైనా అర్పిస్తామంటూ పెద్దపెట్టున నినదించారు. తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, నేతలంతా పాదయాత్రగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి, నివాళులర్పించారు.
 
 అక్కడి నుంచి అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు బయలుదేరుతుండగానే.. పోలీసులు చుట్టుముట్టి వారిని అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీకి వెళ్లే హక్కు తమకు ఉందంటూ వారు ప్రతిఘటించడంతో తోపులాట చోటుచేసుకుంది. ‘‘మేమంతా అసెంబ్లీకి వెళ్లాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ప్రజాస్వామ్యయుతంగా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతాం.. మీరు పక్కకు తప్పుకోండి’’ అని వారు కోరినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. దాంతో ఎమ్మెల్యేలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘‘ఎంపీ, ఎమ్మెల్యేలమైన మాకు కూడా రాజధానిలో నడిచే హక్కులేదా?’’ అని నేతలు పోలీసులను నిలదీశారు. పోలీసులు ఇదేమీ పట్టించుకోకుండా, నిరంకుశంగా వ్యవహరిస్తూ నేతలందరినీ వ్యాన్లలో ఎక్కించి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 
 పోలీస్‌స్టేషన్‌లో ధర్నా: పోలీసులు తమను అడ్డుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో... వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నేతలంతా గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే బైఠాయించి తమ ఆందోళన కొనసాగించారు. కాంగ్రెస్, టీడీపీ వైఖరిని ఎండగడుతూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. చెవుల్లో పూలు పెట్టుకుని, మోకాళ్లపై నిలుచుని.. ఇలా రెండున్నర గంటల పాటు నిరసన తెలిపారు. అయితే, వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నేతలను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్వయంగా గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ముందుముందు మరిన్ని పోరాటాలు చేయాల్సి ఉంటుందని నచ్చజెప్పి వారి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం పోలీసులు వారందరినీ సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
 
 ధర్నాలో పాల్గొన్న నేతలు
 ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి... ఎమ్మెల్యేలు భూమా శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్ల బాబూరావు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి,  కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎ.బాలరాజు, ఆకేపాటి అమరనాథరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గుర్నాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కాటసాని రామిరెడ్డి... ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, మేకా శేషుబాబు, దేవగుడి నారాయణరెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు... తాజా మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, సుజయకృష్ణ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కొడాలి నాని, పేర్నినాని, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమరనాథరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జోగి రమేష్, మద్దాల రాజేష్, బాలనాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదతరులతో పాటు పలువురు పార్టీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement