సాక్షి, అనంతపురం : సమైక్య ఉద్యమంలో మరో అంకానికి తెరలేచింది. ఇంతవరకు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, వంటా వార్పు, వినూత్న నిరసనలతో జిల్లా అట్టుడికింది. అయితే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 26న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో చేపట్టనున్న ‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభ నేపథ్యంలో ఉద్యమం స్వరూపం ఉధృతంగా మారింది.
జిల్లాలోని చిన్నా..పెద్దా.. కుల.. మతాల తేడా లేకుండా అన్ని వర్గాల వారు చేయి చేయి కలిపి సమర శంఖం పూరించడానికి సిద్ధమయ్యారు. జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ ఎవరి నోట విన్నా.. ‘సమక్య శంఖారావం కార్యక్రమానికి నేను వెళ్తున్నా.. నువ్వూ వస్తున్నావు కదా..’ అంటూ శంఖారావం కార్యక్రమానికి తరలివెళ్లడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని జేఏసీలు శంఖారావానికి మద్దతు తెలిపాయి. ప్రధానంగా పార్టీ శ్రేణులు విశేషంగా స్పందిస్తున్నాయి.
జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అసాధారణ సంకల్పానికి జిల్లా ప్రజలు సమైక్య గళంతో మద్దతు తెలపడానికి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని చేపట్టిన సమైక్య శంఖారావం కార్యక్రమానికి మేము సైతం బాసటగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. విభజనను అడ్డుకోవడానికి ఇదే మంచి అవకాశమని, ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ అడ్డుకోలేమని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలంటే సమైక్య శంఖారావానికి మద్దతు పలకాల్సిందేనంటూ ప్రజలు వేలాదిగా తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రం కోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన సమైక్య శంఖారావానికి జిల్లా నుంచి చిన్నా..పెద్దా తేడా లేకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
సమైక్య రాష్ట్రం కోసం పోరు సాగిస్తున్న ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డేనని అన్నారు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక సీమాంధ్ర అగ్నిగుండమౌతుంటే.. ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయకుండా.. రాజధాని కోసం, ప్యాకేజీల కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తూ.. కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. సమైక్య రాష్ట్రం కోసం పోరు సాగిస్తున్న జననేత కు అండగా నిలిచి సమైక్యాంధ్ర పరిరక్షణకు చివరి వరకు పోరాడుతామని పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోతే సాగు.. తాగునీటి సమస్యలు తీవ్రమవుతాయని అన్నారు. కరువుకు నిలయమైన అనంతపురం జిల్లా ఎడారిగా మారుతుందన్నారు.
ఈ నేపథ్యంలో సమైక్యాంధ్రను కాంక్షించే ప్రతి ఒక్కరూ సమర సైనికులై ‘సమైక్య శంఖారావానికి తరలి వచ్చి.. సమైక్య గళం వినిపించాలన్నారు. పార్టీ అభిమానులు, సమైక్య వాదులు, జిల్లా ప్రజల సౌకర్యార్థం జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నాయకుల సహకారంతో హైదరాబాద్‌కు వందలాది బస్సులు, వేలాది జీపులు, కార్లు, గుంతకల్లు నుంచి రైలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాహనాలు, రైలు 25వ తేదీ సాయంత్రం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్తాయని చెప్పారు.
పిలుపే ప్రభంజనం
Published Fri, Oct 25 2013 2:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement