samaikyandhra movements
-
మూడో రోజూ.. అదే జోరు
సమైక్యానికి మద్దతుగా కొనసాగుతున్న ఉద్యమం కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలు దహనం సాక్షి, నెట్వర్క: సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో ఎన్జీవోలు, సమైక్యవాదులు వరుసగా మూడో రోజైన శనివారం రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలు, రిలే దీక్షలు నిర్వహించారు. విశాఖ, అనంతపురంలలో కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలను దహనం చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో సమైక్యవాదులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏపీఎన్జీవోలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు కావురి సాంబశివరావు, చిరంజీవి, పురందేశ్వరి, పళ్ల్లంరాజుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ మెయిన్ గేట్ ఎదుట సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర క్యాబినెట్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎర్రగొండపాలెంలో ఎన్జీవోలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, కొవ్వూరు, పెరవలిలలో విద్యార్థులతో కలిసి సమైక్యవాదులు, ఉద్యోగులు రాస్తారోకో జరిపారు. వైఎస్సార్ జిల్లా కడపలో కలెక్టరేట్, ఎమ్మార్వో, ఆర్డీవో, రిజిస్ట్రేషన్ తదితర శాఖల ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో పాలన స్తంభించింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని వ్యవసాయశాఖ, ఖజానా, రిజిస్ట్రార్ కార్యాలయం, జిల్లా ప్లానింగ్ కార్యాలయాలలో సేవలు నిలిచిపోయాయి. కృష్ణాజిల్లా కలిదిండిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియచేశారు. రాష్ట్రాన్ని ఐక్యంగా వుంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మైలవరం నుంచి 10వేల పోస్టుకార్డులను పంపారు. పామర్రులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్మించారు. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ బైక్ రాలీ జరిగింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ముత్తుకూరులో రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఉద్యోగులు తాళాలు వేశారు. అనంతపురం కలెక్టరేట్లో కార్యకలాపాలు స్తంభించాయి. హిందూపురం, కర్నూలు జిల్లాలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు ఉద్ధృతమయ్యాయి.శ్రీకాకుళంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయగనరంలో కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలతో నిరసన ర్యాలీ నిర్వహిం చారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రిలో ఎన్జీవోలు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. -
వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 10వ తేదీ వైఎస్సార్ సీపీ నేతలు శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, టీడీపీ నేతలు, వారి వర్గీయులు దాడి చేసిన ఘటనలో 47 మంది వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు కేసు పెట్టారు. వీరిలో 37 మందిని సోమవారం అరెస్టు చేశారు. అప్పట్లో టీడీపీ వారిని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రతిఘటించే యత్నం చేశారు. ఈ క్రమంలో పరస్పరం మాటల తూటాలు పేలాయి. టీడీపీ నేతలు తొడలు చరిచి వైఎస్సార్ సీపీ నేతలను హతమారుస్తామనే స్థాయిలో బెదిరింపులకు దిగారు. అయితే వైఎస్సార్ సీపీ నాయకులపై దాడి చేసిన మూకలోని టీడీపీ నేతలతో పాటు కార్యకర్తలు కేవలం 22 మందిని మాత్రమే కేసుల్లో ఉంచి అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మినహా ఆయన సోదరులు ఎర్రిస్వామిరెడ్డి, యోగేశ్వరరెడ్డి, ఆకుల రాగువేంద్ర, జిలాన్‌బాషా, సుధీర్‌రెడ్డి, రాయపరెడ్డి, మహేంద్రరెడ్డి, గోపాల్‌రెడ్డి, నదీమ్, మారుతీనాయుడు, ప్రభాకర్‌రెడ్డి, గోపాల్, షెక్షా, సోమశేఖర్‌రెడ్డి, లక్ష్మమ్మ, శ్రీదేవి, దేవి, ఆజాద్, నాగార్జున రెడ్డి, జలందర్‌రెడ్డి, సురేష్‌రెడ్డితో పాటు 47 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడం, గుంపులుగా ఉండడం, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ మాధవ్, ఎస్ఐ జాకీర్ హుస్సేన్ వెల్లడించారు. 22 మంది టీడీపీ వారి అరెస్ట్ టీడీపీ నేతల్లో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పెనుకొండ ఎమ్మెల్యే బీసీ పార్థసారథి, అనంతపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మహాలక్ష్మీ శ్రీనివాసులు, స్వామిదాస్, నారాయణస్వామి, పీవీ వెంకటరాముడు, బుగ్గయ్య చౌదరి, పరచూరి రమణ , నదీమ్, గోపాల్, ప్రకాష్, ఆదినారాయణ, బాలాజీ వెంకటస్వామి, వెంకటప్పతో సహా 22 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా గంటల తరబడి వైద్య పరీక్షల పేరుతో వేధించారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు.