అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 10వ తేదీ వైఎస్సార్ సీపీ నేతలు శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, టీడీపీ నేతలు, వారి వర్గీయులు దాడి చేసిన ఘటనలో 47 మంది వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు కేసు పెట్టారు.
వీరిలో 37 మందిని సోమవారం అరెస్టు చేశారు. అప్పట్లో టీడీపీ వారిని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రతిఘటించే యత్నం చేశారు. ఈ క్రమంలో పరస్పరం మాటల తూటాలు పేలాయి. టీడీపీ నేతలు తొడలు చరిచి వైఎస్సార్ సీపీ నేతలను హతమారుస్తామనే స్థాయిలో బెదిరింపులకు దిగారు. అయితే వైఎస్సార్ సీపీ నాయకులపై దాడి చేసిన మూకలోని టీడీపీ నేతలతో పాటు కార్యకర్తలు కేవలం 22 మందిని మాత్రమే కేసుల్లో ఉంచి అరెస్టు చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మినహా ఆయన సోదరులు ఎర్రిస్వామిరెడ్డి, యోగేశ్వరరెడ్డి, ఆకుల రాగువేంద్ర, జిలాన్‌బాషా, సుధీర్‌రెడ్డి, రాయపరెడ్డి, మహేంద్రరెడ్డి, గోపాల్‌రెడ్డి, నదీమ్, మారుతీనాయుడు, ప్రభాకర్‌రెడ్డి, గోపాల్, షెక్షా, సోమశేఖర్‌రెడ్డి, లక్ష్మమ్మ, శ్రీదేవి, దేవి, ఆజాద్, నాగార్జున రెడ్డి, జలందర్‌రెడ్డి, సురేష్‌రెడ్డితో పాటు 47 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడం, గుంపులుగా ఉండడం, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ మాధవ్, ఎస్‌ఐ జాకీర్ హుస్సేన్ వెల్లడించారు.
22 మంది టీడీపీ వారి అరెస్ట్
టీడీపీ నేతల్లో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పెనుకొండ ఎమ్మెల్యే బీసీ పార్థసారథి, అనంతపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మహాలక్ష్మీ శ్రీనివాసులు, స్వామిదాస్, నారాయణస్వామి, పీవీ వెంకటరాముడు, బుగ్గయ్య చౌదరి, పరచూరి రమణ , నదీమ్, గోపాల్, ప్రకాష్, ఆదినారాయణ, బాలాజీ వెంకటస్వామి, వెంకటప్పతో సహా 22 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా గంటల తరబడి వైద్య పరీక్షల పేరుతో వేధించారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు.