లౌకికవాదంపై ఎవరి సర్టిఫికెటూ అవసరంలేదు
లౌకిక వర్సిటీకి ములాయం ఏమైనా వీసీనా?: నితీశ్
పట్నా: లౌకికవాదంపై తనకు సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ నుంచి సర్టిఫికెట్ అవసరం లేదని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. బీజేపీతో 12 ఏళ్ల పాటు స్నేహం చేసినందుకు తన లౌకిక విశ్వసనీయతను ములాయం ప్రశ్నించటాన్ని తిప్పికొడుతూ ఆయన పైవిధంగా స్పందించా రు. మంగళవారం ఒక ప్రైవేటు టీవీ చానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నితీశ్ మాట్లాడుతూ.. ‘‘ఆయనేమైనా లౌకికవాద విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్లరా?
నేనేమైనా పరిశోధన స్కాలర్నా? ఆయన నుంచి నేను లౌకికవాదంపై సర్టిఫికెట్ (ధ్రవీకరణపత్రం) కోరుతున్నానా?’’ అని ఎద్దేవా చేశారు. ‘‘నేను లోక్‌నాయక్ జయప్రకాశ్‌నారాయణ్, రామ్మనోహర్ లోహియా స్కూల్ నుంచి వచ్చినవాడిని. లౌకికవాదంపై ఎవరి నుంచీ నాకు ఎటువంటి సర్టిఫికెటూ అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
నితీశే మా కూటమి సీఎం: లాలూ
న్యూఢిల్లీ: బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా తమ కూటమి ముఖ్యమంత్రి నితీశ్‌కుమారే అవుతారని ఆ పార్టీ అధినేత లాలూప్రసాద్ స్పష్టంచేశారు. ‘కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీలతో కూడిన మహా కూటమి అధికారంలోకి వస్తే.. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయనే దానితో సంబంధం లేకుండా.. నితీశ్ సీఎం పదవి చేపడతారు. బీజేపీని బిహార్ నుంచి వట్టిచేతులతో వెనక్కు పంపేలా చూడటమే మా ప్రాధాన్యం’అని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో అన్నారు.