సే(షే)మ్ సీన్ రిపీట్స్..
న్యూఢిల్లీ: ఆగని ఆందోళనలు.. విపక్షాల అరుపులు నినాదాలు.. ప్రభుత్వం మొండిపట్టు.. ప్రతి సవాళ్లు.. వాటి మధ్యే ప్రశ్నలు.. వినిపించీ వినిపించని మంత్రుల సమాధానాలు.. ఇవీ ప్రస్తుతం సోమవారం ఉదయం లోక్సభలో నెలకొన్న తాజా దృశ్యా లు. రెండు రోజుల విరామం తరువాత సోమవారం ఉదయం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో లలిత్ గేట్, వ్యాపం కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేయాల్సిందేనని ప్లకార్డులతో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి.
ఓ వైపు గందరగోళం నెలకొన్నప్పటికీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను అలానే కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సభ్యులు ఏయే ప్రశ్నలు అడుగుతున్నారో, వాటికి మంత్రులు ఏం సమాధానాలు చెప్పారనేదానిపై సమావేశాల వీక్షకులకు స్పష్టత లేకుండాపోయింది.
రాజ్యసభ: విపక్షా లను శాంతింపజేసే ప్రయత్నంలో భాగంగా హఠాత్తుగా మైకు అందుకున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.. లలిత్ మోదీకి తాను సహాయం చేయలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ఆమె అన్నారు. అయితే ఈ చర్యను అనూహ్యంగా భావించిన విపక్షాలు.. ఒక్కసారిగా స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లాయి. ముందు సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలని, ఆ తరువాత వివరణ ఇవ్వాలని పట్టుబట్టాయి.
సుష్మా స్వరాజ్ తిరిగి తన స్థానంలో కూర్చున్నతర్వాత కాస్త వెనక్కు తగ్గిన విపక్షాలు తమ తమ స్థానలవద్దకు వెళ్లి అక్కడ నిల్చొని స్లోగన్లు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది.