జాతీయ స్కూల్ చెస్ విజేత సంహిత
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి సంహిత పుంగవనం విజేతగా నిలిచింది. కాకినాడలోని పెద్దాపురంలో జరిగిన ఈ టోర్నీలో సంహిత అండర్–11 బాలికల విభాగంలో చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత సంహిత, రిషిత (ఆంధ్రప్రదేశ్) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా సంహితకు టైటిల్ దక్కగా... రిషిత రన్నరప్‌గా నిలిచింది. ఏడు గేముల్లో నెగ్గిన సంహిత... ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయింది. అండర్–11 బాలుర విభాగంలో తెలంగాణకే చెందిన శ్యామల్ నిధిశ్ (7.5 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచాడు. అండర్–7 బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన శ్రేయాంశ్ (7.5 పాయింట్లు) రజతం సాధించగా... ఓం ఈశ్ (7 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకున్నాడు. అండర్–9 బాలికల విభాగంలో అరవ విశ్వాణి (ఆంధ్రప్రదేశ్; 7 పాయింట్లు) రజతం సాధించింది. అండర్–9 బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన తిప్పర్తి శ్రేయాన్ (8.5 పాయింట్లు) చాంపియన్‌గా నిలువగా...తిమ్మరాజు వెంకట సాత్విక్ (7.5 పాయింట్లు) కాంస్యం గెలిచాడు. అండర్–13 బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన మోదిపల్లి దీక్షిత (8 పాయింట్లు) స్వర్ణ పతకం నెగ్గగా, వి.త్రిపురాంబిక (ఆంధ్రప్రదేశ్; 7.5 పాయింట్లు) రజతం సొంతం చేసుకుంది. అండర్–13 బాలుర విభాగంలో సామ్యూల్ స్టీఫెన్ నోబుల్ (ఆంధ్రప్రదేశ్; 8 పాయింట్లు) చాంపియన్‌గా నిలిచాడు. అండర్–15 బాలికల విభాగంలో గోర్లి నైనా (ఆంధ్రప్రదేశ్; 7 పాయింట్లు) రజతం... అండర్–17 బాలికల విభాగంలో చీదెళ్ల శర్వాణి (ఆంధ్రప్రదేశ్; 6.5 పాయింట్లు) రజతం... అండర్–17 బాలుర విభాగంలో జ్ఞాన సాయి సంతోష్ (ఆంధ్రప్రదేశ్; 7.5 పాయింట్లు) స్వర్ణం... మజ్జి రాంచరణ్ తేజ (ఆంధ్రప్రదేశ్; 6.5 పాయింట్లు) కాంస్యం గెలిచారు.