హత్య కేసులో నిందితురాలి లొంగుబాటు
ఈ నెల 7వ తేదీన జరిగిన ఆటోడ్రైవర్ హత్య కేసులో నిందితులలో ఒకరైన అస్మా సుల్తానాను చాంద్రాయణగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఘాజీమిల్లత్ కాలనీకి చెందిన అస్మా సుల్తానా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇటీవల ప్రకటనలు ఇచ్చింది. దీంతో హఫీజ్‌బాబానగర్ ఉమర్‌కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ సమీ అహ్మద్ సిద్ధిఖీ భార్య అస్మాఖాన్ కూడా దరఖాస్తు చేసుకుంది.
ఈ మేరకు అస్మాఖాన్‌ను ఈనెల 7వ తేదీన అస్మాసుల్తానా పిలిపించుకుంది. అయితే, ఇతర పురుషులతోపాటు తన భార్యను కలిపి ఉంచటంపై అహ్మద్ సిద్దిఖీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అస్మా సుల్తానాతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనలో ముఖ్తార్ మరో ఇద్దరు యువకులు కలసి అహ్మద్ సిద్దిఖీని కొట్టి చంపారు. ఘటనపై అస్మాఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ముగ్గురు పరారీలో ఉండగా అస్మాసుల్తానా మాత్రం కోర్టులో లొంగిపోయింది.
కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టారు. కాగా, అస్మా సుల్తానా భర్త జహంగీర్ అలియాస్ పర్వేజ్ కూడా పలు కేసులలో నిందితుడిగా ఉండడంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అతనిపై పి.డి.యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. కాగా, తమ విచారణలో అస్మా సుల్తానా ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేదని పోలీసులు తెలిపారు.