జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
జగ్గయ్యపేట: అనంతపురంలో సాక్షి పత్రిక కార్యాలయం వద్ద తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన తండ్రిని అసభ్య పదజాలంతో టీడీపీ ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్‌రెడ్డి దూషించాడు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను ఆదివారం ఫిర్యాదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి దూషించిన వీడియో క్లిప్పింగ్‌ల సీడీలను ఎస్ఐ వి.వి.రావుకు అందజేశారు.
అనంతరం స్థానిక ఆర్ అండ్ బీ వసతి గృహంలో ఉదయభాను విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను డిమాండ్ చేశారు. ప్రభాకర్‌రెడ్డి వీధి రౌడీలా ప్రవర్తించారన్నారు. జేసీ సోదరులకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సు పెనుగంచిప్రోలు మండలం, ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురై 10 మంది మృతి చెందారని, బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రభాకర్‌రెడ్డి అవివేకానికి నిదర్శనమన్నారు.