samples collecting
-
ల్యాబ్‌కు ఆకాశ్ రక్త నమూనాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేసులో శాస్త్రీయ ఆధారాల సేకరణ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కారు నడిపిన ఆమె పీఏ ఆకాశ్‌కు ఇప్పటికే బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించి ఆయన మద్యం సేవించలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు... తాజాగా ఆకాశ్ రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌తోపాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపినట్లు తెలిసింది. అలాగే ఆకాశ్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆకాశ్ స్టేట్మెంట్ను మేజి్రస్టేట్ సమక్షంలో రికార్డు చేసినట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు కళ్లు బైర్లు కమ్ముకున్నాయని.. ఏం జరిగిందో తెలిసేలోపే ప్రమాదం జరిగిందని ఆకాశ్ చెప్పినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ప్రమాదానికి ముందు రాత్రి ఆయనకు సరిగ్గా నిద్ర లేకపోవడంతోనే కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్ర మత్తు ఆవహించిందా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? అనే దానిపై ల్యాబ్ రిపోర్టులు వస్తేనే సైంటిఫిక్ ఎవిడెన్స్ లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. వాహన తయారీ లోపాలేమైనా ఉన్నాయా? ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే ప్రయాణించిన వాహనంలో తయారీ లోపాలేమైనా ఉన్నాయా? అని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గురైనప్పుడు వాహనం గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు.. ప్రమాద తీవ్రతకు కారు విడిభాగాలు సుమారు 100 మీటర్ల దూరం వరకు పడిపోవడాన్ని బట్టి చూస్తే అంతకంటే ఎక్కువ వేగంతో వాహనం ప్రయాణిస్తోందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పటాన్చెరు పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగిన చోట ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అని పరిశీలించారు. -
కోవిడ్ డేటాను చైనా తొక్కిపెడుతోంది
ఐరాస/జెనీవా: 2020లో వూహాన్ మార్కెట్లో సేకరించిన శాంపిళ్ల డేటాను చైనా తొక్కిపెడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆరోపించింది. కరోనా మూలాలను అంచనా వేయడంలో ఈ సమాచారమే కీలకమని పేర్కొంది. కోవిడ్ పరిశోధనల ఫలితాలను అంతర్జాతీయ సంస్థలతో పంచుకుంటూ పారదర్శకంగా వ్యవహరించాలని హితవు పలికింది. మహమ్మారి పుట్టుకను అర్థం చేసుకోవడం నైతిక, శాస్త్రీయ అవసరమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెసియస్ అన్నారు. ‘‘వూహాన్‌లోని హునాన్ మార్కెట్లో సేకరించిన నమూనాల డేటాను ఈ ఏడాది జనవరి చివర్లో ఆన్లైన్ నుంచి తొలగించారు. దాన్ని తిరిగి అందరికీ అందుబాటులో ఉంచాలని చైనాకు చెప్పాం’’ అన్నారు. చైనాలోని వూహాన్ నగరంలో 2019 ఆఖరులో పుట్టిన కరోనా వైరస్ సార్స్–కోవ్–2 ప్రపంచమంతటా వ్యాపించి, లక్షలాది మరణాలకు కారణంగా మారడం తెలిసిందే. -
కరోనా టెస్ట్ పేరిట నీచం.. ల్యాబ్‌టెక్నీషియన్‌కు పదేళ్ల శిక్ష
కరోనా టెస్టుల పేరిట నీచంగా వ్యవహరించిన ఒక ల్యాబ్‌టెక్నీషియన్‌కు ఎట్టకేలకు కఠిన కారాగార శిక్ష పడింది. శాంపిల్ కలెక్షన్ పేరుతో అసభ్యకర రీతిలో వ్యవహరించిన కేసులో.. పదిహేడు నెలల తర్వాత ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అమరావతి (మహారాష్ట్ర)కి చెందిన యువతి.. స్థానికంగా ఓ మాల్లో పని చేస్తోంది. కరోనా మొదటి వేవ్ సమయంలో ఆమె పనిచేసే మాల్లో పాతిక మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా ఎంప్లాయిస్‌తో కలిసి ఆమె సైతం పరీక్షలకు వెళ్లింది. అయితే ఆమెకు పాజిటివ్ వచ్చిందని.. మరిన్ని టెస్టుల కోసం బద్నేరాలోని ల్యాబ్‌కు రావాలంటూ సదరు ల్యాబ్‌టెక్నీషియన్(నిందితుడు) ఆ యువతి రప్పించుకున్నాడు. స్వాబ్ సేకరణలో భాగంగా ఈసారి శాంపిల్ సేకరణ ప్రైవేట్ పార్ట్ నుంచి చేయాలని చెప్పి.. నీచంగా ప్రవర్తించాడు. అయితే ఈ విషయంలో అనుమానం వచ్చిన యువతి.. తన సోదరుడికి చెప్పింది. వాళ్లు ఓ డాక్టర్‌ను సంప్రదించగా.. కొవిడ్-19 స్వాబ్ టెస్ట్ ముక్కు, నోటి నుంచి మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో బాధితురాలు బద్నేరా పోలీసులను ఆశ్రయించింది. అయినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంతో పెద్ద ఎత్తున్న నిరసనలు చెలరేగాయి. దీంతో జులై 30, 2020న నిందితుడిని బద్నేరా పోలీసులు అత్యాచార ఆరోపణలపై అరెస్ట్ చేశారు. సుమారు పదిహేడు నెలల విచారణ తర్వాత.. అమరావతి జిల్లా కోర్టు 12 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించి.. ఐపీసీ సెక్షన్ల 354, 376 ప్రకారం.. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. -
కోవిడ్ శాంపిల్ కోసం రోబో
సింగపూర్: గొంతులో నుంచి ఉమ్మిని సేకరించే రోబోను సింగపూర్ కు చెందిన మూడు సంస్థల నిపుణులు తయారు చేశారు. ఈ రోబో ముక్కులో నుంచి గొంతులోపల 10 సెంటీమీటర్ల లోతు నుంచి శాంపిల్‌ను సేకరిస్తుంది. వివిధ రకాల ముక్కు పరిమాణాలు ఉన్న వారికీ అసౌకర్యం కలగకుండా శాంపిల్‌ను తీసుకుందని పరిశోధనలో పాల్గొన్న వైద్యులు తెలిపారు. ఈ రోబో వల్ల శాంపిళ్లను సేకరించే వారికి వ్యాధి ముప్పు తప్పుతుందని పేర్కొన్నారు. -
కరోనా శాంపిళ్ల సేకరణకు కాస్త విరామం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యేకంగా చేపట్టిన కరోనా శాంపిళ్ల సేకరణకు రెండు రోజుల విరామం ప్రకటించారు. ఇప్పటివరకు స్వీకరించిన శాంపిళ్లకు సంబం ధించి అన్ని ఫలితాలు ప్రకటించిన తర్వాతే మళ్లీ నమూనాలు స్వీకరించా లని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందుకోసం రెండు రోజులపాటు కరోనా శాంపిళ్ల స్వీకరణకు విరామం ఇచ్చామని.. అయితే, కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆస్పత్రుల్లో పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలను ఎక్కువ మొత్తంలో చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనెల 16 నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో భారీగా కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయాలని సూచించారు. పది రోజుల్లో 50వేల పరీక్షలు పూర్తిచేసి ఫలితాలు ప్రకటించాలని స్పష్టంచేశారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అనుమానితుల నుంచి నమూనాలు స్వీకరిస్తోంది. అయితే, ప్రభుత్వ ల్యాబ్‌ల సామర్థ్యానికి మంచి శాంపిళ్లను స్వీకరించడంతో వాటి పరీక్షలు పెండింగ్‌లో పడ్డాయి. బుధవారం వరకు దాదాపు 36వేల శాంపిల్స్ సేకరించగా.. 27,747 నమూనాలను పరిశీలించి ఫలితాలు ప్రకటించారు. ఇంకా 8,253 నమూనాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఆ శాంపిళ్ల పరీక్షలకు రెండు రోజులు.. ప్రస్తుతం ప్రభుత్వ ల్యాబ్‌లలో రోజువారీ పరీక్షల సామర్థ్యం నాలుగు వేలు మాత్రమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న నమూనాలను పరీక్షించడానికి రెండు రోజులు పడుతుంది. పైగా రోజువారీగా నమూనాల సేకరణ కొనసాగిస్తే, వాటిని నిల్వ చేయడం కష్టమవుతుంది. నిర్ణీత ఉష్ణోగ్రతల మధ్య వేల సంఖ్యలో శాంపుల్స్ నిల్వ చేసే సామర్థ్యం వైద్య, ఆరోగ్య శాఖ వద్ద లేదు. అంతేకాకుండా ఎక్కువ రోజులు ఆ శాంపిళ్లను నిల్వ చేస్తే ఫలితాలు తప్పుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే నమూనాల సేకరణకు రెండు రోజుల విరామం ప్రకటించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ సమయంలో శాంపిల్ కలెక్షన్ సెంటర్లను శానిటైజేషన్ చేయనుంది. ఇక కరోనా లక్షణాలు ఉన్నవారికి, ఆ పరీక్షలు అవసరమైన వారికి ఆస్పత్రుల్లో పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. -
గబ్బిలాన్ని కరోనా ఏం చేయలేదా?
సింగపూర్ సిటీ: నిఫా, ఎబోలా వైరస్ల తరహాలో కరోనా వైరస్ సైతం గబ్బిలాల నుంచే సోకిందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మొదట కరోనా వైరస్‌ను గుర్తించిన చైనాలోని వుహాన్‌లోని కరోనా పేషెంట్ల నుంచి చైనా శాస్త్రవేత్తలు శాంపిల్స్ సేకరించారు. వాటిని ఇతర వైరస్ల జన్యు క్రమాలతో పోల్చారు. చైనాలోని ఒక తరహా గబ్బిలం(హార్స్‌షూ)లో లభించిన వైరస్ జన్యుక్రమంతో ఈ శాంపిల్‌లోని వైరస్ జన్యుక్రమం 96% సరిపోలింది. అయితే, ఈ వైరస్ నేరుగా గబ్బిలం నుంచి మనిషికి సోకలేదని, మధ్యలో మరో వాహకం ఉండే చాన్సుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సార్స్ వ్యాధికి కారణమైన కరోనా వైరస్ గబ్బిలం నుంచి ముంగిస జాతికి చెందిన వాహకం ద్వారా మనుషులకు సోకినట్లు, అలాగే, మెర్స్ వ్యాధి గబ్బిలం నుంచి ఒంటె ద్వారా మనుషులకు సోకినట్లు నిర్ధారణ అయిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. గబ్బిలాల్లో పెద్ద సంఖ్యలో వివిధ రకాలైన వైరస్లు ఉంటాయి. మనుషులకు సోకే ముప్పున్న దాదాపు 130 రకాల వైరస్‌లను గబ్బిలాల్లో గుర్తించారు. మల, మూత్రాలు, ఉమ్మి ద్వారా గబ్బిలాలు వైరస్‌ను వ్యాప్తి చేస్తాయి. ఇన్ని వైరస్‌లకు ఆవాసమైన గబ్బిలాలపై ఆ వైరస్ ప్రభావం ఎందుకు పడదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి సమాధానాన్ని సింగపూర్‌లోని డ్యూక్ ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్లో గబ్బిలాల్లోని వైరస్‌లపై పరిశోధన చేస్తున్న లిన్ఫా వాంగ్ వివరించారు. ‘గబ్బిలం ఎగరగల క్షీరద జాతి. ఎగిరేటపుడు వాటి శరీర ఉష్ణోగ్రత 100 ఫారన్‌హీట్ వరకు వెళ్తుంది. గుండె నిమిషానికి 1000 కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మిగతా క్షీరదాలైతే చనిపోతాయి. ఎగిరే సమయంలో తలెత్తే ఈ ఒత్తిడిని తట్టుకునేలా ఒక ప్రత్యేక వ్యాధి నిరోధక వ్యవస్థను గబ్బిలాలు సమకూర్చుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా అవి తమ శరీరంపై వైరస్ల ప్రభావాన్ని చంపేసే ప్రత్యేక కణాలను తయారుచేసుకుంటాయి. అలా, వాటి శరీరాలు వైరస్ల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొని, జబ్బు పడకుండా ఉంటాయి’అని వాంగ్ వివరించారు. ఇలాంటి వ్యవస్థ మనుషులు సహా ఇతర క్షీరదాల్లో లేదని చెప్పారు. -
నమూనాల సేకరణలో జాగ్రత్త వహించండి
మాంట్రియల్: కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో తమ అనుబంధ సంస్థలకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నూతన మార్గనిర్దేశకాలు జారీ చేసింది. అథ్లెట్ల నుంచి నమూనాలు సేకరించే క్రమంలో కరోనా కారణంగా అధికారులతో పాటు, ఆటగాళ్లకు ఎలాంటి హాని కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. స్థానిక ఆరోగ్య అధికారుల నిబంధనల మేరకు నడుచుకోవాలని డోపింగ్ నిరోధక సంస్థలకు సూచించింది. ‘డోపింగ్ నియంత్రణ కోసం మనం పరీక్షలు నిర్వహించే సమయంలో అథ్లెట్లకు, అధికారుల ఆరోగ్యానికి తగిన రక్షణ కల్పించాలి. ఎలాంటి అనారోగ్యం లేని వారినే అథ్లెట్ల నుంచి శాంపుల్స్ సేకరించేందుకు ఉపయోగించాలి. ఈ క్రమంలో అథ్లెట్లను కూడా వారి ఆరోగ్యం గురించి ఆరా తీశాకే నమూనాలు సేకరించాలి’ అని ‘వాడా’ పేర్కొంది. పని చేసే ప్రాంతాలను శుభ్రం గా ఉంచుకోవాలని సూచించింది. తప్పనిసరిగా మాస్క్‌లను వాడాలని హెచ్చరించింది. -
కూల్ కూల్‌గా మోసం
సాక్షి,వేపగుంట(గోపాలపట్నం (విశాఖపశ్చిమ) : నాణ్యత పాటించని ఫ్రూట్ జ్యూస్ షాపుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. వేపగుంట సాయిమాధవనగర్‌లో పిల్లా శ్రీనివాసరావు శీతల పానీయాల తయారీ కేంద్రం కృప ఏజెన్సీస్ పేరిట నిర్వహిస్తున్నాడు. బుధవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సీఎంనాయుడు ఆ శాఖ ఎస్ఐ రమేష్, ఆహార భద్రతాధికారులు వెంకటరత్నం, శ్రీరాములుతో అక్కడికి వచ్చి తనిఖీలు చేపట్టారు. శీతల పానీయాల తయారీకి శుద్ధి చేసిన నీరు వాడాల్సి ఉండగా, ఇక్కడ మా త్రం బాటిళ్లలో బావిలో నీరుపోసేస్తున్నారు. అందులో మామిడి, ద్రాక్ష రసాలతో పాటు కొద్ది రోజులు నిల్వ ఉండేలా రసాయనాలు కలి పేస్తున్నారు. దీంతో శ్రీనివాసరావును అరె స్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. శాంపిళ్లను హై దరాబాద్ సేఫ్టీ ఫుడ్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. -
డీఎన్ఏ పరీక్షకు శాంపిల్స్ సేకరణ
రిపోర్ట్ వచ్చిన తర్వాతే శవం అప్పగింత మునిపల్లి: మండలంలోని పిల్లోడి గ్రామంలో వివాదాస్పదంగా మారిన శవాన్ని బయటకు తీశారు. గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ రమణమూర్తి, సిబ్బంది డీఎన్ఏ పరీక్ష నిర్వహించడానికి ఆ శవం నుంచి శాంపిల్స్ సేకరించారు. బుధవారం పిల్లోడి గ్రామానికి గాంధీ ఆసుపత్రి నుంచి ప్రొఫెసర్ రమణమూర్తితోపాటు సిబ్బంది, మునిపల్లి తహసీల్దార్ పద్మావతి, బుదేరా ఎస్ఐ కోటేశ్వర్ రావు వచ్చి పాతిపెట్టిన శవాన్ని బయటకు తీసి శాంపిల్స్ సేకరించారు. పిల్లోడి గ్రామానికి చెందిన బాలయ్య పిల్లలు, కుటుంబ సభ్యులు, మునిపల్లి గ్రామానికి చెందిన పద్మారావు పిల్లలు, కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలను సేకరించి డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రొఫెసర్ రమణమూర్తి తెలిపారు. శవం డీఎన్ఏ పరీక్షకు ఎవరిది అనుకూలంగా ఉంటే వారికే శవాన్ని అప్పగించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఆగస్టు 29న బుదేరా శివారు 65వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతి చెందిన బాలయ్య తన భర్తేనంటూ పిల్లోడికి చెందిన భూమమ్మ బుదేరా పోలీసులకు ఫిర్యాదు చేసి శవాన్ని గ్రామానికి తీసుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించిన విషయం విధితమే. ఈ క్రమంలో మునిపల్లికి చెందిన పద్మారావు కుటుంబ సభ్యులు స్పందిస్తూ పాతిపెట్టిన శవం తమదంటే తమదంటూ వారు, భూమమ్మ పర్సపరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుదేరా పోలీసులు శవానికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించ తలపెట్టారు. దీని కోసమే డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బయటికి తీసిన శవాన్ని డీఎన్ఏ రిపోర్టు వచ్చేంత వరకు మళ్లీ పాతిపెట్టారు. టెన్షన్.. టెన్షన్ పాతి పెట్టిన శవాన్ని బయటకు తీయడానికి డాక్టర్లు వస్తున్నారని తెలియడంతో పిల్లోడి గ్రామస్తులతోపాటు మునిపల్లివాసుల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది. డీఎన్ఏ పరీక్ష నిర్వహించి ఇక్కడే శవం బాలయ్యదా, పద్మారావుదా అని చెబుతారని ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూశారు. శాంపిల్స్ సేకరించి గాంధీ ఆసుపత్రిలోనే డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తారని అసలు విషయం తెలియడంతో ఇరుగ్రామాల ప్రజలు, ఇరు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పంచె, పాయింట్‌కు తేడా లేదా? పిల్లోడి గ్రామానికి చెందిన బాలయ్య పంచె, లుంగీపైనే ఎక్కువగా ఉండెవాడని పిల్లోడి గ్రామస్తులు తెలిపారు. మునిపల్లికి చెందిన పద్మారావు ఎప్పుడూ పాయింట్‌నే వేసుకునేవాడని గ్రామస్తులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పాయింట్ వేసుకున్నాడా? లేకుంటే పంచె కట్టుకునఆడా అని తెలుసుకునే పని పోలీసులకు తిరిగి మొదలైంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపకుండానే శవాన్ని అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదరా బాదరగా ఫిర్యాదు తీసుకుని శవాన్ని అప్పగించి చేతులు దులుపుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి.