సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేసులో శాస్త్రీయ ఆధారాల సేకరణ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కారు నడిపిన ఆమె పీఏ ఆకాశ్‌కు ఇప్పటికే బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించి ఆయన మద్యం సేవించలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు... తాజాగా ఆకాశ్ రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌తోపాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపినట్లు తెలిసింది.
అలాగే ఆకాశ్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆకాశ్ స్టేట్‌మెంట్‌ను మేజి్రస్టేట్ సమక్షంలో రికార్డు చేసినట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు కళ్లు బైర్లు కమ్ముకున్నాయని.. ఏం జరిగిందో తెలిసేలోపే ప్రమాదం జరిగిందని ఆకాశ్ చెప్పినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
ప్రమాదానికి ముందు రాత్రి ఆయనకు సరిగ్గా నిద్ర లేకపోవడంతోనే కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్ర మత్తు ఆవహించిందా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? అనే దానిపై ల్యాబ్ రిపోర్టులు వస్తేనే సైంటిఫిక్ ఎవిడెన్స్ లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
వాహన తయారీ లోపాలేమైనా ఉన్నాయా?
ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే ప్రయాణించిన వాహనంలో తయారీ లోపాలేమైనా ఉన్నాయా? అని పరిశీలిస్తున్నారు.
ప్రమాదానికి గురైనప్పుడు వాహనం గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు.. ప్రమాద తీవ్రతకు కారు విడిభాగాలు సుమారు 100 మీటర్ల దూరం వరకు పడిపోవడాన్ని బట్టి చూస్తే అంతకంటే ఎక్కువ వేగంతో వాహనం ప్రయాణిస్తోందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పటాన్‌చెరు పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగిన చోట ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment