డబ్బింగ్ వద్దే వద్దు...
ముక్తకంఠంతో నినదించిన సినీ కళాకారులు
డబ్బింగ్‌కు వ్యతిరేకంగా నేడు శాండిల్‌వుడ్ బంద్
సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్ భూతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వబోమని శాండిల్‌వుడ్ కళాకారులు నిన దించారు. కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్ చిత్రాలను అనుమతించాలనే కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ చళువళి వ్యవస్థాపకుడు వాటాళ్ నాగరాజ్ ఆదివారమిక్కడ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాండల్‌వుడ్‌కు చెందిన నటీ నటులు, సంగీత దర్శకులు, కొందరు నిర్మాతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ... కన్నడిగులైన వారందరికీ కన్నడ భాషపై మమకారం ఉండాలని అన్నారు. కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్‌ని అనుమతిస్తే ఇక్కడున్న వ ందలాది మంది నటీనటులు, కన్నడ సినీ పరిశ్రమను నమ్ముకున్న వేలాది మంది టెక్నీషియన్లు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. డబ్బింగ్ సంస్కృతిని కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్ ఎప్పుడో వ ్యతిరేకించారని ఆయన బాటలోనే ఇప్పటి సినీ కళాకారులు నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డబ్బింగ్‌కు ఎవరు మద్దతు ఇచ్చినా కూడా తాము వారిని అడ్డుకుని తీరతామని హెచ్చరించారు.
అనంతరం నటుడు రవిచంద్రన్ మాట్లాడుతూ...ఇతర చిత్రాలను నేరుగా విడుదల చేస్తుంటేనే కన్నడ చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదని పేర్కొన్నారు. ఇక అలాంటి పరిస్థితుల్లో డబ్బింగ్‌కు కూడా అనుమతిస్తే కన్నడ సినీ పరిశ్రమ పూర్తిగా కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు చిత్రాలు కేరళలో విడుదలై అక్కడి మళయాళీ నటుల చిత్రాలను దెబ్బతీస్తున్నాయని, తమిళ చిత్రాలు ఆంధ్రప్రదేశ్‌లో డబ్బింగ్ చేయబడి టాలీవుడ్ మార్కెట్‌పై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
అందుకే తాము శాండల్‌వుడ్‌లోకి డబ్బింగ్ సంస్కృతిని అనుమతించడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. డబ్బింగ్ మాత్రమే కాక రీమేకింగ్కి కూడా వ్యతిరేకత వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కన్నడ చళువళి వ్యవస్థాపకుడు వాటాళ్ నాగరాజు మాట్లాడుతూ... కన్నడ సినీ పరిశ్రమలోకి డబ్బింగ్ విధానాన్ని అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ నేడు (సోమవారం) సినీ కళాకారులు బంద్ పాటించనున్నారని తెలిపారు.
నగరంలోని ఎస్బీఎం సర్కిల్ నుంచి వేలాది మంది సినీ కళాకారులు ర్యాలీగా బయలుదేరి సెంట్రల్ కాలేజ్ ఆవరణకు చేరుకొని అక్కడ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నటీ నటులు యష్, పూజాగాంధీ, రాధికా పండిట్, శృతి, హేమా చౌదరి, భారతీ విష్ణువర్ధన్, శశికుమార్, జగ్గేష్, సంగీత దర్శకులు గురుకిరణ్ తదితరులు పాల్గొన్నారు.