sangareddy municipality
-
ఆర్థిక సంక్షోభంలో మున్సిపాలిటీ
సంగారెడ్డి మున్సిపాలిటీలో అన్నీ సమస్యలే! కార్మికులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి సంగారెడ్డి మున్సిపాలిటీ: పురపాలక సంఘం రోజు రోజుకు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఒక వైపు కార్మికులకు వేతనాలు చెలించలేని పరిస్థితి. మరోవైపు కనీసం విద్యుత్ బకాయిలు సైతం అధికారులు చెల్లించలేక సతమతమవుతున్నారు. మున్సిపల్ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఎక్కడా కూడా పురోగతి కనిపించడం లేదు. ఇందుకు గత పక్షం రోజుల్లోనే మూడుమార్లు ట్రాన్స్‌కో అ«ధికారులు బిల్లులు చెల్లించడం లేదని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అలాగే ప్రతి రోజు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఉపయోగించే ట్రాక్టర్లు, అటోలు మరుమ్మతులకు నోచుకోలేకపోతున్నాయి. ఫలితంగా కార్మికులు వాటితో నిత్యం కష్టపడాల్సివస్తోంది. వైకుంఠ రథానికి కనీసం రూ.25 వేలు పెట్టి మరమ్మతులు చేయించలేని పరిస్థితి ఉంది. ముఖ్యoగా చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్లకు చిన్నపాటి మరుమ్మతులు చేస్తే మరింత విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేసే అవకాశం ఉంది. కాని ఆ వాహనాలు ఎక్కడ మొరాయిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఉదయం విధులకు హాజరైన కార్మికులు ఇంటికి ఎప్పుడు వచ్చేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు ట్రాక్టర్లు మరమ్మతులు నోచుకోలేకపోవడమే కారణమనిచెప్పవచ్చు. మరో వైపు మున్సిపల్లో ఉన్న ఆటోల పరిస్థితి మారి దారుణంగా ఉంది. తోస్తే కాని ఆటోలు కదలని పరిస్థితి. ఇటీవల మరమ్మతుల కోసం మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో పలుమార్లు తీర్మానం చేసి ఆమోదించినా ఇంత వరకు అమలుకు నోచుకోలేకపోయింది. ఫలితంగా నెలల తరబడి ట్రాక్టర్లు మరుమ్మతులకు నోచుకోలేక రోడ్డుపై దిష్టి బొమ్మలా ఉన్నాయి. కాగా ప్రతి సమావేశంలో సభ్యులు మున్సిపల్‌కు వచ్చేఆదాయం కంటే ఖర్చు పద్దులు అధికంగా ఉన్నాయని అందుకు అస్తి పన్నులు పెంచడంతో పాటు వాణిజ్య సంస్థల ట్యాక్స్‌లను పెంచాలని నిర్ణయించారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలు సైతం చాలా తక్కువగా వస్తున్నాయి. ఫలితంగా మున్సిపల్‌కు వచ్చే అన్ని ఆదాయాలు కూడా అతంతంగానే కావడంతో కార్మికులకు సరైన సమయంలో వేతనాలు చెల్లించలేని పరిస్థితి. దీంతో పాటు కనీసం విద్యుత్ బకాయిలు చెల్లించలేని ఆర్థిక లోటుతో మున్సిపాల్టీ నడుస్తోంది. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన కోట్ల రూపాయల ఆస్తిపన్ను బకాయిలపై ఏశాఖకు నోటీసులు ఇవ్వలేక పోయారు. మున్సిపల్ కార్యాలయానికి కరెంట్ కట్ చేసిన ట్రాన్స్‌కోకు చెందిన భవనాలు. ఇతర స్థిరాస్తుల ద్వారా రావాల్సిన బకాయిలపై మాత్రం మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు పట్టణంలో ఎన్ని ట్రాన్స్‌కోకు చెందిన విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. ఎన్ని భవనాలు ఉన్నాయి. వాటి నుంచి ఏడాదికి ఎంత ఆదాయం రావాల్సి ఉంది. ఎంత వసూలు చేశారు అనే ప్రాథమిక సమాచారం ఇంత వరకు మున్సిపల్లో లేదు. గతంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన జాయింట్ కలెక్టర్ శరత్ ట్రాన్స్‌కో మున్సిపల్ పట్ల కఠినంగా వ్యహరించినప్పుడు మనమెందుకు ఊరుకోవాలని వారి నుంచి ఎంత పన్నులు రావాలో లేక్కలు వేయాలని అదేశించారు. అప్పట్లోనే పట్టణం మొత్తం 5,721 విద్యుత్ స్తంభాలు ఉన్నాయని, ట్రాన్స్‌కో కార్యాలయ ఆవరణలో అతిథి గృహానికి అనుమతి లేదని నిర్ధారించారు. వాటితో పాటు క్వార్టలకు సైతం అనుమతి లేదని, పన్నులు సైతం నిర్మాణం పూర్తి అయినప్పటి నుంచి ఇంత వరకు చెల్లించలేదని గుర్తించారు. ట్రాన్స్‌కో ద్వారానే మున్సిపల్‌కు కనీసం ఏడాదికి రూ.12 నుంచి 15 లక్షల వరకు వివిధ పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంది. కాని ట్రాన్స్‌కో దృష్టి పెట్టినట్లుగా మున్సిపల్ అధికారులు వారి బకాయిలపై దృష్టి పెట్టాలేకపోతున్నారన్న కౌన్సిల్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ట్రాన్స్ కోనుంచి పన్నులు, భవనాల అనుమతులకు డబ్బులు వసూలు చేస్తే కరెంటు బకాయిలు చెల్లించేందుకు వీలుంటుంది. -
మంత్రి జూపల్లి ఓఎస్డీ వీరారెడ్డిపై విచారణ
సంగారెడ్డి మునిసిపాలిటీల్లో అవినీతి వ్యవహారం సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా సంగారెడ్డి మునిసిపాలిటీలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకు బాధ్యులైన ఐదుగురు అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎం.జి.గోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కష్ణారావు పేషీలో ఓఎస్డీగా పనిచేస్తున్న జి.వీరారెడ్డి సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో వున్నారు. మిగతా నలుగురిలో సంగారెడ్డి మునిసిపాలిటీ మాజీ శానిటరీ ఇన్స్పెక్టర్ విక్రంసింహారెడ్డి, మాజీ అకౌంటెంట్ కె.లత, మాజీ మేనేజర్ రమేశ్, మాజీ కమిషన్ కేవీవీఆర్ రాజు ఉన్నారు. -
పుర సమరం నేడే
పోలింగ్ సమయం ఉ. 7 నుంచి సా.5 గం.ల వరకు సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ పోరు తుది దశకు చేరింది. ఓట్ల మిషన్లతో ఎన్నికల సంఘం.. నోట్ల కట్టలతో నేతలు ఎవరికి వారుగా సిద్ధమయ్యారు. మరోవైపు ఆదివారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా రాత్రికి రాత్రే నోట్లు పంచి ఓట్లు కొల్లగొట్టేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. పోటీని బట్టి ఓటుకు రూ. 500 నుంచి రూ. 3 వేల వరకు పంచుతున్నట్టు సమాచారం. గజ్వేల్‌లో నాలుగు ఓట్లున్న కుటుంబానికి బంగారు నాణెం కూడా పంచుతున్నట్లు వినికిడి. ఈసీ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్రీయంగా మద్యం సరఫరా చాలినంత లేకపోవడంతో అభ్యర్థులు కర్ణాటక రాష్ట్రం నుంచి తెప్పించి పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే పోలింగ్ ప్రక్రియకు 192 పోలింగ్ కేంద్రాలు, 192 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో మొత్తం 145 వార్డులకు గాను 845 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1,91,212 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరో వైపు ఎలాంటి అక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3,287 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ స్లిప్‌ల పంపిణీ వివిధ మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రా ల వద్ద ఓటర్లకు అవసరమైన ఓటర్ స్లిప్‌లను అందజేసేందుకు మున్సిపల్ సిబ్బంది ద్వారా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కాగా ఇదివరకే మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్‌లను జారీ చేశారని, దీనివల్ల పోలింగ్ కేంద్రంలో కాలయాపన లేకుండా ఓటరు జాబితాలో ఓటర్ను వెంటనే గుర్తించే ఆవకాశం ఉందన్నారు. ఓటర్లు విధిగా ఓటర్ స్లిప్‌తో పాటు ఎన్నికల గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డుతో హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఒక అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్‌ను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఓటర్లు తప్ప ఇతరులకు అనుమతించేది లేదని, పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లను అనుమతించేది లేదన్నారు. ఓటరు తీర్పుపైనే ఆశలు.. పోలింగ్ మరికొద్ది సమయంలోప్రారంభం కానుండటంతో అభ్యర్థులంతా ఓటరు తీర్పుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇన్నిరోజులు చేసిన ప్రచారం కలిసివస్తుందో, లేదోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తమ గుర్తు పలానా అంటూ అభ్యర్థులు ఓటర్లకు చూపిస్తూ.. తమకే ఓటు వేయాలని ఒట్టేయించుకుంటున్నారు. చివరి సమయం కీలకం కానుండటంతో పోలింగ్ కేంద్రాల సమీపంలో తమక గుర్తు గుర్తుంచుకోవాలని చెప్పించేందుకు యువతను పోగేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గీత దాటకుండా.. పోలింగ్ కేంద్రానికి దూరంలో అభ్యర్థుల వారీగా.. కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ‘గుర్తు.. గుర్తుంచుకోండి..’ అంటూ చివరి అస్త్రాన్ని ఉపయోగించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఓటరన్న ఎవరికి పట్టం కడతారో ఫలితాల తర్వాతే తేలనుంది. -
వాలీబాల్ జాతీయ జట్లు ఎంపిక
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం లో మూడు రోజు లుగా నిర్వహించిన అండర్-14 బాల బాలికల వాలీబాల్ రాష్ట్ర స్థాయి పో టీలు ఆదివారం ముగిశాయి. త్వర లో జమ్మూ-కాశ్మీర్లో జరగనున్న జాతీయస్థాయి అండర్-14 బాలబాలికల జట్టును ఎంపిక చేశారు. ఈ పోటీలకు మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో భానుచందర్(మెదక్), జి.రాజేశ్(వరంగల్), ఎండీ సయ్యద్(మెదక్), బి.వెంకటేశ్(వరంగల్), కె.వెంకటేశ్వర్‌రెడ్డి(గుంటూరు), శ్రీశైలం(మహబూబ్‌నగర్), టి.వెంకటేశ్వర్ (విజ యనగరం), డి.గణేశ్(శ్రీకాకుళం), కె.శ్రీనివాస్‌రావు(కృష్ణ), హరితేజ(మెదక్), గోపి(నిజామాబాద్), ఎం డీ సా హెబ్(మహబూబ్‌నగర్), నిఖిల్(రంగారెడ్డి), కృష్ణాప్రసాద్ (గుంటూరు), ఆదినారాయణ(శ్రీకాకుళం), అనురాగ్(హైదరాబాద్) ఎంపికయ్యారు. బాలికల విభాగంలో... జి.రమ్య(నిజామాబాద్), రజిత(నిజామాబా ద్), తన్మయి(కృష్ణ), మౌనిక(కృష్ణ), శ్రీవిద్య(వరంగల్), అనూష(వరంగల్), కాంచన(రంగారెడ్డి), లోహిత(కడప), శోభారాణి(శ్రీకాకుళం), శివపార్వతి(గుంటూరు), అఖిల(మహబూబ్‌నగర్), స్టాండ్‌బైగా వి.లత(నిజామాబాద్), ముస్కాన్ బేగం(కరీంనగర్), డి.లావణ్య(నెల్లూరు), ఎస్.రాజేశ్వరి(రంగారెడ్డి)లు జాతీయ స్థాయికి ఎంపికైన వారిలో ఉన్నారు. -
సంగారెడ్డి మున్సిపాలిటీలో రికార్డులు మాయం?
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: స్థానిక మున్సిపాలిటీలో అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తడం సాధారణ విషయం గా మారింది. ఈ దశలో కార్యాలయానికి చెందిన పలు రికార్డులు గల్లంతు కావడం అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలో భద్రంగా ఉండాల్సి న రికార్డులు గల్లంతు కావడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని బయటపెడుతుంది. రికార్డులు గల్లంతు కావడంతో తాజాగా ఆడిటింగ్ నిలిచిపోయింది. సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో 2005 నుంచి 2009 వరకు వివిధ పద్దుల కింద రూ.20 కోట్లతో వివిధ అభివృద్ధి పను లు చేపట్టారు. జనరల్ ఆడిటింగ్ అధికారులతోపాటు మున్సిపల్ ఆడిటింగ్ అధికారులు రికార్డులను పరిశీలించేందుకు గత మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. కాగా ఇందులో సుమారు రూ.1.20 కోట్ల వి లువ చేసే పనులకు సంబంధించిన రికార్డులు లేకపోవడంతో ఆడిటింగ్ నిలిచిపోయింది. వచ్చిన అధికారులు ఏం చేయాలో పాలుపోక ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. రికార్డులు అందజేయాల్సిందిగా ఆడిటింగ్ అధికారులు కమిషనర్‌పై కూడా వత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. రికార్డుల విషయమై వివరాలు తెలపాల్సిం దిగా కమిషనర్ కృష్ణారెడ్డి గతంలో పనిచేసిన కమిషనర్లు, అకౌంటెంట్లకు లేఖలు రాశారు. రికార్డులు ఛిద్రమయ్యాయని వారు సమాధా నం ఇచ్చినట్టు సమాచారం. రికార్డుల గల్లం తు విషయాన్ని మున్సిపల్ అధికారులు తేలి గ్గా తీసుకోవడం పలు అనుమానాలకు తావి స్తోంది. రూ.1.20 కోట్ల విలువైన పనుల్లో అవి నీతి చోటు చేసుకోవడం వల్లే రికార్డులు గల్లం తు చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గల్లంతైన రికార్డులను నెల రోజు ల్లోగా అందుబాటులో ఉంచాలని ఆడిటింగ్ అధికారులు సూచించినట్టు సమాచారం. రికార్డుల కోసం ప్రయత్నిస్తున్నాం మున్సిపాలిటీలో రికార్డుల గల్లంతు అంశం నా దృష్టికి వచ్చింది. రికార్డులను ఆడిటింగ్ అధికారుల ముందు ఉంచేందుకు ప్రయత్నా లు చేస్తున్నా. రికార్డుల విషయమై గతంలో పనిచేసిన అకౌంటెంట్‌కు లేఖ రాసిన. రికార్డులు ఛిద్రమైనట్టు సమాధానమిచ్చారు. ఇది సరైంది కాదని పేర్కొంటూ అతనికి మరో లేఖ రాస్తున్నా. సరిగా స్పందించకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. - కృష్ణారెడ్డి, కమిషనర్, సంగారెడ్డి -
సంగారెడ్డి మున్సిపాలిటీలో అక్రమాలు
సాక్షి, సంగారెడ్డి: ‘‘నిధులు దారి మళ్లించి కరెంటు బి ల్లులు, కార్మికులకు వేతనాల చెల్లించినా తప్పు లేదు. మేమే అలా చేయమని చెప్పాం. చేయకపోతేనే యాక్షన్ తీసుకుంటాం. చేసినందుకు చర్య ఉండదు. సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.77.50 లక్షల దారిమళ్లింపుపై ఎంక్వైరీ రిపోర్టు వచ్చింది. మాజీ ఇన్చార్జి కమిషనర్, ప్రస్తుత మేనేజర్ టి. రమేశ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.’’అంటూ మున్సిపల్ రీజినల్ డెరైక్టర్ ఎన్. సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ ‘మున్సిపల్ మేనేజర్ రివర్షన్ ?’ అంటూ ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆయన పైవిధంగా స్పందించారు. ఆర్డీ సత్యనారాయణ పేర్కొన్నట్లు కార్మికుల వేతనాల కోసమే సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.77.50 లక్షల నిధులను దారిమళ్లించారా ? లేక స్వాహా చేశారా ?.. అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం రావాల్సి ఉంది. ఇంతకీ ఆ రూ.60 లక్షలు ఏమైనట్టు ? సంగారెడ్డి మున్సిపాలిటీలో దాదాపు 300 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం వారందరికీ కలిపి ఇచ్చే నెలవారీ వేతనాలు రూ.2.75 లక్షలకు మించవు. మూడు నెలల పెండింగ్ వేతనాల చెల్లింపు కోసమని గత ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.77.50 లక్షల నిధులను దారి మళ్లించిన అధికారులు ఇద్దరు బినామీ లేబర్ కాంట్రాక్టర్లకు చెల్లించారు. కానీ, మూడు నెలల వేతనాలకు అయ్యే ఖర్చు కేవలం రూ.8.25 లక్షలే. మిగిలిన రూ.69 లక్షల నిధులు ఏమైనట్టు ?. అసలా కార్మికులకైనా వేతనాలు చెల్లించారా ? అంటే అదీ లేదు. అక్రమంగా దారిమళ్లించిన రూ.77.50 లక్షల నిధులతో ఏకంగా రెండేళ్లకు పైగా కార్మికులకు ప్రతి నెలా ఠంచన్‌గా వేతనాలు చెల్లించవచ్చు. కానీ, గత మార్చి నుంచి వేతనాలు అందక కార్మికులు పండుగలకు సైతం దూరమవుతున్నారు. కొందరికి అంతకు ముందు చెల్లించిన వేతనాల చెక్కులు సైతం చెల్లుబాటు కావడం లేదు. ఇక పీఎఫ్, ఈఎస్‌ఐలకు చెల్లింపుల గురించి మాట్లాడకపోతేనే నయం. ఉత్తుత్తి విచారణలు సంగారెడ్డి మున్సిపాలిటీకి 2012-13కు సంబంధించి రూ.77.50 లక్షల ప్రణాళికేతర నిధులు గత మార్చిలో విడుదలయ్యాయి. ఈ నిధులను కేవలం రోడ్ల మరమ్మతు, నిర్వహణ పనుల కోసం మాత్రమే వినియోగించాలని, ఇతర అవసరాలకు దారి మళ్లించకూడదని, మూడు నెలల తర్వాత యుటిలైజేషన్ పత్రాలను సమర్పించాలని అప్పట్లో ప్రభుత్వం షరతులు విధించింది. ఈ నిధులను యాక్సిస్ బ్యాంకు ఖాతా(నెం.911010030941340)లో జమ చేసి ఆ వెంటనే సంగారెడ్డి సబ్ ట్రెజరీ కార్యాలయం ఖాతా ‘పీడీ 001’కు బదిలీ చేశారు. అప్పటి ఇన్చార్జీ కమిషనర్ టి. రమేశ్ ఏప్రిల్ 18న ఎస్టీఓకు రాసిన లేఖ(నెం.536/ఏ1/2013) ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అదే రోజు 18 అడ్వాన్స్ చెక్కుల ద్వారా రూ.66, 15, 800 నిధులను డ్రా చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మిగిలిన నిధులూ డ్రా చేసేయడంతో ‘పీడీ 001’ ఖాతా ఖాళీ అయింది. ఈ చెక్కులన్నింటినీ ఏప్రిల్ 14 నుంచి 18వ తేదీ మధ్యకాలంలో లేబర్ కాంట్రాక్టర్లకు కమిషనర్ రమేశ్ జారీ చేసినవే. ఓ ప్రజాప్రతినిధి, చోటా నేతల ఒత్తిడికి తలొగ్గి ఆయనీ పనిచేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 28న ‘రూ.77 లక్షలు హాంఫట్’ శీర్షికతో ‘సాక్షి’ ప్రచురించిన కథనం ఈ అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి సాయిలుతో విచారణ జరిపించారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ అక్రమాల్లో భాగమైన అధికారులకు క్లీన్‌చీట్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ ఒత్తిడితో చర్యలు తీసుకునే విషయంలో ఉన్నతాధికారులు సైతం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా, జిల్లా ఉన్నతాధికారులు ఈ అక్రమంపై నోరు మెదపకపోవడం గమనార్హం.