సాక్షి, సంగారెడ్డి: ‘‘నిధులు దారి మళ్లించి కరెంటు బి ల్లులు, కార్మికులకు వేతనాల చెల్లించినా తప్పు లేదు. మేమే అలా చేయమని చెప్పాం. చేయకపోతేనే యాక్షన్ తీసుకుంటాం. చేసినందుకు చర్య ఉండదు. సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.77.50 లక్షల దారిమళ్లింపుపై ఎంక్వైరీ రిపోర్టు వచ్చింది. మాజీ ఇన్‌చార్జి కమిషనర్, ప్రస్తుత మేనేజర్ టి. రమేశ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.’’అంటూ మున్సిపల్ రీజినల్ డెరైక్టర్ ఎన్. సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ ‘మున్సిపల్ మేనేజర్ రివర్షన్ ?’ అంటూ ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆయన పైవిధంగా స్పందించారు. ఆర్డీ సత్యనారాయణ పేర్కొన్నట్లు కార్మికుల వేతనాల కోసమే సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.77.50 లక్షల నిధులను దారిమళ్లించారా ? లేక స్వాహా చేశారా ?.. అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం రావాల్సి ఉంది.
ఇంతకీ ఆ రూ.60 లక్షలు ఏమైనట్టు ?
సంగారెడ్డి మున్సిపాలిటీలో దాదాపు 300 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం వారందరికీ కలిపి ఇచ్చే నెలవారీ వేతనాలు రూ.2.75 లక్షలకు మించవు. మూడు నెలల పెండింగ్ వేతనాల చెల్లింపు కోసమని గత ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.77.50 లక్షల నిధులను దారి మళ్లించిన అధికారులు ఇద్దరు బినామీ లేబర్ కాంట్రాక్టర్లకు చెల్లించారు. కానీ, మూడు నెలల వేతనాలకు అయ్యే ఖర్చు కేవలం రూ.8.25 లక్షలే. మిగిలిన రూ.69 లక్షల నిధులు ఏమైనట్టు ?. అసలా కార్మికులకైనా వేతనాలు చెల్లించారా ? అంటే అదీ లేదు. అక్రమంగా దారిమళ్లించిన రూ.77.50 లక్షల నిధులతో ఏకంగా రెండేళ్లకు పైగా కార్మికులకు ప్రతి నెలా ఠంచన్‌గా వేతనాలు చెల్లించవచ్చు. కానీ, గత మార్చి నుంచి వేతనాలు అందక కార్మికులు పండుగలకు సైతం దూరమవుతున్నారు. కొందరికి అంతకు ముందు చెల్లించిన వేతనాల చెక్కులు సైతం చెల్లుబాటు కావడం లేదు. ఇక పీఎఫ్, ఈఎస్‌ఐలకు చెల్లింపుల గురించి మాట్లాడకపోతేనే నయం.
ఉత్తుత్తి విచారణలు
సంగారెడ్డి మున్సిపాలిటీకి 2012-13కు సంబంధించి రూ.77.50 లక్షల ప్రణాళికేతర నిధులు గత మార్చిలో విడుదలయ్యాయి. ఈ నిధులను కేవలం రోడ్ల మరమ్మతు, నిర్వహణ పనుల కోసం మాత్రమే వినియోగించాలని, ఇతర అవసరాలకు దారి మళ్లించకూడదని, మూడు నెలల తర్వాత యుటిలైజేషన్ పత్రాలను సమర్పించాలని అప్పట్లో ప్రభుత్వం షరతులు విధించింది. ఈ నిధులను యాక్సిస్ బ్యాంకు ఖాతా(నెం.911010030941340)లో జమ చేసి ఆ వెంటనే సంగారెడ్డి సబ్ ట్రెజరీ కార్యాలయం ఖాతా ‘పీడీ 001’కు బదిలీ చేశారు. అప్పటి ఇన్‌చార్జీ కమిషనర్ టి. రమేశ్ ఏప్రిల్ 18న ఎస్టీఓకు రాసిన లేఖ(నెం.536/ఏ1/2013) ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
అదే రోజు 18 అడ్వాన్స్ చెక్కుల ద్వారా రూ.66, 15, 800 నిధులను డ్రా చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మిగిలిన నిధులూ డ్రా చేసేయడంతో ‘పీడీ 001’ ఖాతా ఖాళీ అయింది. ఈ చెక్కులన్నింటినీ ఏప్రిల్ 14 నుంచి 18వ తేదీ మధ్యకాలంలో లేబర్ కాంట్రాక్టర్లకు కమిషనర్ రమేశ్ జారీ చేసినవే. ఓ ప్రజాప్రతినిధి, చోటా నేతల ఒత్తిడికి తలొగ్గి ఆయనీ పనిచేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 28న ‘రూ.77 లక్షలు హాంఫట్’ శీర్షికతో ‘సాక్షి’ ప్రచురించిన కథనం ఈ అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు ఫారెస్టు సెటిల్మెంట్ అధికారి సాయిలుతో విచారణ జరిపించారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ అక్రమాల్లో భాగమైన అధికారులకు క్లీన్‌చీట్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ ఒత్తిడితో చర్యలు తీసుకునే విషయంలో ఉన్నతాధికారులు సైతం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా, జిల్లా ఉన్నతాధికారులు ఈ అక్రమంపై నోరు మెదపకపోవడం గమనార్హం.
సంగారెడ్డి మున్సిపాలిటీలో అక్రమాలు
Published Mon, Oct 7 2013 2:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
Advertisement
Advertisement