sangh
-
ఆర్ఎస్ఎస్ చేతికి యూపీ ఉపఎన్నికల బాధ్యత
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన సన్నాహాల్లో ఎస్పీ, బీజేపీలు బిజీగా ఉన్నాయి. ఎస్పీ ఇప్పటివరకు ఏడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, బీజేపీ కూడా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిందని, ఒకట్రెండు రోజుల్లో జాబితాను విడుదల చేసే అవకాశం ఉందనే వార్తలు వినవస్తున్నాయి. యూపీలో ఉప ఎన్నికల బాధ్యతను ఆర్ఎస్ఎస్కు బీజేపీ అప్పగించింది.ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొనేందుకు మధురకు చేరుకున్నారు. ఆయన 10 రోజుల పాటు మధుర పర్యటనలో ఉండనున్నారు. తాజాగా సంఘ్ చీఫ్‌తో సీఎం యోగి భేటీ అయ్యారు. ఉప ఎన్నికల్లో ఓటింగ్‌శాతాన్ని పెంచడం, బూత్ నిర్వహణ, ఎన్నికల వ్యూహం తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.సంఘ్ వ్యూహంతోనే హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని పార్టీ భావిస్తోంది. ఇప్పుడు జార్ఖండ్, మహారాష్ట్రతో పాటు యూపీలో బీజేపీ గెలుపునకు వ్యూహం రచించే పనిలో సంఘ్ బిజీగా ఉంది. యూపీలో హిందూ ఓటర్లను ఏకం చేయడం, ఓబీసీ, దళిత ఓటర్లను బీజేపీవైపు ఆకర్షించడం తదితర అంశాలపై సంఘ్ దృష్టి సారిస్తోంది. ఇందుకోసం సంఘ్ కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి, ఇంటింటికీ ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడంపై కూడా సంఘ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: బెజవాడలో వ్యక్తి దారుణ హత్య -
ప్రభుత్వంలో జోక్యం చేసుకోం: ఆర్ఎస్ఎస్
సంఘ్‌కు ఎలాంటి పాత్ర ఉండదు: వెంకయ్య న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలైన బీజేపీకి అవసరమైతే సలహాలు మాత్రమే ఇస్తామని, ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చమని ఆ పార్టీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. బీజేపీకి రిమోట్ కంట్రోల్‌గా వ్యవహరించబోమని పేర్కొంది. మరోవైపు ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి బీజేపీ నేతల తాకిడి కొనసాగుతోంది. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే సంఘ్ అగ్ర నేతలను కలిశారు. ఇతర ముఖ్య నేతలు కూడా సంఘ్‌తో మంతనాల్లో మునిగిపోయారు. కేంద్ర మంత్రివర్గ కూర్పులో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదని సంఘ్ జాతీయ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ ఆదివారం జైపూర్‌లో స్పష్టం చేశారు. తాము రిమోట్ కంట్రోల్‌గా వ్యవహరించబోమన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తాము బీజేపీకి ఎలాంటి మార్గనిర్దేశనం చేయలేదని చెప్పారు. సంఘ్ సిద్ధాంతాలు వారికి(బీజేపీ నేతలకు) తెలుసునని, ఆ దిశగానే వారు పనిచేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనితీరులో కానీ, రాజకీయాల్లో కానీ తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, అవసరమైతే సలహాలు మాత్రం ఇస్తామని తెలిపారు. ఇక మోడీ ప్రభుత్వ పనితీరును ప్రజలే సమీక్షిస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత వెంకయ్యనాయుడు కూడా ఇదే ధోరణిలో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటులో సంఘ్‌కు ఎలాంటి పాత్ర ఉండబోదన్నారు. -
ఢిల్లీ పీఠం దిశగా ‘సంఘ్’ వ్యూహం
న్యూఢిల్లీ: వరుసగా 2004, 2009ల్లో రెండు సార్లు ఓటమి పాలైన నేపథ్యంలో.. ఈ సారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలనే దిశగా ‘సంఘ్’ పరివారం వ్యూహరచన చేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో క్షేత్రస్థాయి నుంచీ చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ సహా ‘సంఘ్’ సంస్థల నేతలు ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, మురళీ మనోహర్ జోషీ, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు సురేష్ భయ్యాజీ, సురేష్ సోనీ, దత్తాత్రేయ హోస్బలే, వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా తదితర ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. అంతేగాకుండా ఎన్నికల సమయంలో ‘సంఘ్’ పక్షాల మధ్య సమన్వయం, సహకారం, మైనారిటీలు, ఎస్సీఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, యువత లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందించే అంశంపై చర్చిస్తారు. అయితే, బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే అంశం ఈ సమావేశాల్లో చర్చించడం లేదని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ, ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును ప్రతిపాదించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవలే మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అద్వానీ, సుష్మాలతో భేటీ అయి, ఏకాభిప్రాయం కోసం చర్చించిన నేపథ్యంలో ఈ సమావేశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే తొలిరోజు భేటీలో క్షేత్రస్థాయి నుంచి ప్రజలను ఆకట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో వీహెచ్‌పీ చేపట్టిన యాత్ర, దానిని అడ్డుకున్న అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలపై ‘సంఘ్’ వర్గాలు సోమవారం ప్రకటన చేసే అవకాశముంది.