న్యూఢిల్లీ: వరుసగా 2004, 2009ల్లో రెండు సార్లు ఓటమి పాలైన నేపథ్యంలో.. ఈ సారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలనే దిశగా ‘సంఘ్’ పరివారం వ్యూహరచన చేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో క్షేత్రస్థాయి నుంచీ చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ సహా ‘సంఘ్’ సంస్థల నేతలు ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, మురళీ మనోహర్ జోషీ, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు సురేష్ భయ్యాజీ, సురేష్ సోనీ, దత్తాత్రేయ హోస్బలే, వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా తదితర ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ భేటీలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. అంతేగాకుండా ఎన్నికల సమయంలో ‘సంఘ్’ పక్షాల మధ్య సమన్వయం, సహకారం, మైనారిటీలు, ఎస్సీఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, యువత లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందించే అంశంపై చర్చిస్తారు. అయితే, బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే అంశం ఈ సమావేశాల్లో చర్చించడం లేదని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ, ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును ప్రతిపాదించిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవలే మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అద్వానీ, సుష్మాలతో భేటీ అయి, ఏకాభిప్రాయం కోసం చర్చించిన నేపథ్యంలో ఈ సమావేశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే తొలిరోజు భేటీలో క్షేత్రస్థాయి నుంచి ప్రజలను ఆకట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో వీహెచ్‌పీ చేపట్టిన యాత్ర, దానిని అడ్డుకున్న అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలపై ‘సంఘ్’ వర్గాలు సోమవారం ప్రకటన చేసే అవకాశముంది.
ఢిల్లీ పీఠం దిశగా ‘సంఘ్’ వ్యూహం
Published Mon, Sep 9 2013 2:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM