ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలైన బీజేపీకి అవసరమైతే సలహాలు మాత్రమే ఇస్తామని, ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చమని ఆ పార్టీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టం చేసింది.
సంఘ్‌కు ఎలాంటి పాత్ర ఉండదు: వెంకయ్య
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలైన బీజేపీకి అవసరమైతే సలహాలు మాత్రమే ఇస్తామని, ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చమని ఆ పార్టీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టం చేసింది. బీజేపీకి రిమోట్ కంట్రోల్‌గా వ్యవహరించబోమని పేర్కొంది. మరోవైపు ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి బీజేపీ నేతల తాకిడి కొనసాగుతోంది. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే సంఘ్ అగ్ర నేతలను కలిశారు. ఇతర ముఖ్య నేతలు కూడా సంఘ్‌తో మంతనాల్లో మునిగిపోయారు. కేంద్ర మంత్రివర్గ కూర్పులో ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదని సంఘ్ జాతీయ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ ఆదివారం జైపూర్‌లో స్పష్టం చేశారు. తాము రిమోట్ కంట్రోల్‌గా వ్యవహరించబోమన్నారు.
ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తాము బీజేపీకి ఎలాంటి మార్గనిర్దేశనం చేయలేదని చెప్పారు. సంఘ్ సిద్ధాంతాలు వారికి(బీజేపీ నేతలకు) తెలుసునని, ఆ దిశగానే వారు పనిచేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనితీరులో కానీ, రాజకీయాల్లో కానీ తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, అవసరమైతే సలహాలు మాత్రం ఇస్తామని తెలిపారు. ఇక మోడీ ప్రభుత్వ పనితీరును ప్రజలే సమీక్షిస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత వెంకయ్యనాయుడు కూడా ఇదే ధోరణిలో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటులో సంఘ్‌కు ఎలాంటి పాత్ర ఉండబోదన్నారు.