ఆయన డెస్క్ మీద.. తలకిందులుగా జాతీయ జెండా!
న్యూఢిల్లీ: జైలుపాలైన మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ భార్య, కొడుకుతో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గత గురువారం భేటీ అయ్యారు. సంజీవ్ భట్ కుటుంబానికి పూర్తి మద్దతు ప్రకటించిన శశి థరూర్ ఆయన కుటుంబానికి తప్పకుండా న్యాయం జరగాలని పేర్కొన్నారు. తన కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫొటోను థరూర్ ట్విటర్లో షేర్ చేసుకున్నారు. అయితే, ఆయన కార్యాలయంలోని డెస్క్ మీద ఉన్న చిన్న జాతీయ జెండా తలకిందులుగా ఎగరవేసి ఉండటాన్ని కొందరు నెటిజన్లు గుర్తించారు. దీంతో ఆయనను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
గుజరాత్ మాజీ పోలీసు అధికారి అయిన సంజీవ్ భట్‌కు 30 ఏళ్ల కిందటి ఓ హత్యకేసులో ఇటీవల జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు మద్దతు కోరుతూ శశి థరూర్‌తో భేటీ అయ్యారు. ‘ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్న శ్వేతా భట్, ఆమె కొడుకు శంతనుతో జరిగిన భేటీ నన్ను కదిలించింది. ఆమె భర్త సంజీవ్ భట్‌ను నిర్బంధించడంపై మేం చర్చించాం. వారికి న్యాయం తప్పకుండా జరగాలి’అంటూ ఈ భేటీకి సంబంధించిన రెండు ఫొటోలు శశి ధరూర్ ట్వీట్ చేశారు. అయితే, ఈ ఫొటోలో థరూర్ డెస్క్ మీద చిన్నసైజు జాతీయ జెండా ఉంది. ఫొటోను జూమ్ చేసి చూస్తే తప్ప కనిపించని ఆ జెండా తలకిందులుగా ఎగరవేసి ఉండటంతో.. దానిని గుర్తించిన నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి 1971 జాతీయ గౌరవ చట్టం ప్రకారం జాతీయ జెండాను, రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని అవమానించినా, కించపరిచినా, లేక వాటి పట్ల అగౌరవపూరితంగా వ్యవహరించినా.. చట్టబద్ధమైన నేరంగా భావిస్తారు.
No offence to you but had to correct our National Flag- 👍🏻 pic.twitter.com/GaN0qxrA0w
— Shash (@pokershash) July 19, 2019