ర్యాపిడ్ మెట్రో ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: సైబర్‌సిటీ గుర్గావ్ను ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానించే రాపిడ్‌మెట్రో రైలు సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఉద్యోగ, వ్యాపారాల కోసం ఢిల్లీ-గుర్గావ్ల మధ్య ప్రయాణించేవారి ఇబ్బందులు ఇక దూరమైనట్లే. అంతేగాకుండా ఈ రెండు నగరాల మధ్య ట్రాఫిక్ సమస్య కూడా కనుమరుగవనుంది. దేశంలోనే ఇది మొట్టమొదటి ప్రైవేట్ మెట్రో . దీనిని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ నడుపుతోంది. గురువారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూలు పిల్లలకు ర్యాపిడ్ మెట్రోలో ఉచిత ప్రయాణాన్ని కానుకగా అందించారు. ట్రయల్ రన్ తర్వాత గతవారం తుది తనిఖీ నిర్వహించిన రైల్వే భద్రతా కమిషనర్ ర్యాపిడ్ మెట్రో నడపడానికి అనుమతించడంతో 5.1 కిలోమీటర్ల తొలిదశ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మెట్రో మార్గంలో సికిందర్‌పూర్, డీఎల్ఎఫ్ ఫేజ్-2, బెల్వర్డేర్ టవర్, మోల్సారీ ఎవెన్యూ, డీఎల్ఎఫ్ ఫేజ్-3 స్టేషన్లు ఉన్నాయి. ర్యాపిడ్ మెట్రోను సికిందర్‌పూర్ మెట్రో స్టేషన్ వద్ద ఢిల్లీ మెట్రోతో అనుసంధానం చేశారు. ర్యాపిడ్ మెట్రో వేళలు ఢిల్లీ మెట్రో వేళలతో సమన్వయం చేస్తారు. దీంతో ప్రయాణికులు ర్యాపిడ్ మెట్రో కోసం వేచిచూడవలసిన అవసరముండదు. ర్యాపిడ్ మెట్రో కోసం 12 రూపాయల టికెట్‌గా నిర్ధారించారు.