మళ్లీ...
ప్రశంస పొందిన కథ
‘శశి’
‘రియాజ్’...
‘శశి... అమ్మీ’....
‘ఏమైంది అమ్మీకి? ఏంటలా ఉన్నావు?’
‘అమ్మీ ఐసియులో ఉంది పది రోజుల నుండి. నిన్ను చూడాలనుందని పేపర్ మీద నీ పేరు రాసింది’
గొంతు ఏడుస్తున్నట్టుగా ఉంది.
‘నే వస్తున్నా. ధైర్యంగా ఉండు. అమ్మీకి ఏమీ కాదు’
కాల్ కట్ చేశాను. కాని వెళ్లాలా వద్దా అని- ఒక నిమిషం ఆలోచించాను. వెళ్లకుండా ఉంటే? కాని రియాజ్ అమ్మీ గుర్తుకొచ్చింది. తెల్లగా పాలరంగులో ఉండే మనిషి. ‘పరీ’... అని పిలిచేది. ‘పరీ అంటే ఏంటి అమ్మీ?’ అని అడిగాను ఒకసారి.
‘దేవకన్య బేటీ’... అంది. ‘అంత అందంగా ఉంటావ్ నువ్వు’ అని కూడా అంది. దేవకన్యలు పెళ్లిళ్లకు కాపురాలకు పనికిరారు. నేను కూడా పనికి రానని ఆమె అనుకున్న రోజులను ఎలా మర్చిపోవడం? ఇప్పుడు వెళితే అవన్నీ గుర్తుకే వస్తాయి. కాని చావు బతుకుల్లో ఉన్న మనిషి. ఎందుకు బాధ పెట్టడం?
అరగంటలో పని ముగించుకొని బయట కార్ స్టార్ట్ చేశాను. కాకినాడ నుండి ఏలూరుకు నాలుగు గంటల ప్రయాణం. వద్దన్నా ఆలోచనలు చుట్టుముడుతున్నాయి.
పదేళ్లవుతోంది రియాజ్‌తో మాట్లాడి. ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఒకే ఊళ్లో కలిసి తిరిగాం. ఎప్పుడు చూసినా నూగు గడ్డంతో అందంగా ఉండేవాడు. చూసి నవ్వేవాడు. బదులు నవ్వకుండా ఉండటం సాధ్యం కాలేదు. నలుగురైదుగురం గ్రూప్‌గా ఉండేవాళ్లం. ఆ గ్రూప్‌లో మళ్లీ మేమిద్దరం ప్రత్యేకం. అందరి ఇళ్లకు వెళ్లేవాళ్లం. అందరికీ అందరం తెలుసు. మా ప్రేమ తెలియకుండా ఉంటుందా?
‘మన పెళ్లి జరుగుతుందనిపించడం లేదు’ ఒకరోజు బెంగగా అన్నాడు.
‘ఏం?’
‘అమ్మీ ఒప్పుకోవడం లేదు’
‘ఏం?’
‘అన్నయ్య కూడా’
‘ఏం?’
‘నువ్వు నమాజ్ చదవలేవు. మా పద్ధతులూ ఏమీ తెలియవు అంటున్నారు’
‘మా ఇంట్లో కూడా అంతే. మన పూజలు పద్ధతులు నీకు తెలియవు వద్దు అన్నారు. నేను వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా. నువ్వూ చెయ్’
కాని చేయలేకపోయాడు. రియాజ్ చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. అన్నయ్య మాట ఎన్నడూ కాదనలేనట్టుగా పెరిగాడు. అమ్మీకి కూడా ఎప్పుడూ ఎదురు చెప్పిన పిల్లాడు కాదు.
రియాజ్‌కి తన మనవరాలికి ఇచ్చి చేయాలని పెద్దావిడ కోరిక. అలా అని కూతురికి ఎప్పుడో మాటిచ్చింది. ఇప్పుడు కాదంటే తమ మీదే ఆశ పెట్టుకున్న మనవరాలి జీవితం ఏమౌతుందోనని ఆమె భయం.
ఆ రోజు సాయంత్రం రియాజ్ ఆమెతో మార్కెట్‌కు వెళుతూ నేను ఎదురుపడితే చూపిస్తూ అడిగాడు-
‘శశి లేకుండా నేను బతకలేను అమ్మీ’...
‘దాన్నే చేసుకుంటానంటే మాత్రం నేను చచ్చిపోతారా’
నేను చేతులు పట్టుకున్నాను.
‘ఒప్పుకోండి అమ్మీ, సంతోషంగా ఉంటాము. విడిపోయి ఎలా బతకాలో ఊహకి కూడా రావడంలేదు’
‘బేటీ... నువ్వు మంచిపిల్లవు. మంచిపిల్లలానే ఉండు. నాకు నువ్వు చెడ్డ కావడం నీకు నేను చెడ్డ కావడం నాకు ఇష్టం లేదు’
కొడుకును తీసుకుని వెళ్లిపోయింది.
నా అంత ధైర్యవంతుడు కాదు రియాజ్. సున్నితమైన మనసు. ఈ గొడవలతో మానసికంగా కుంగిపోతున్నాడు. నేనే ఏదో ఒక దారి వెతుకుతానని ఆశపడుతున్నాడు. కాని పెద్దావిడ మొండికేసింది.
ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది ఊహించని సంఘటన. లొంగక తప్పలేదు.
అక్క కూతురు నాజియాతో రియాజ్ పెళ్లి ఖాయమైంది. అంచుల్లో అత్తరు రాసి ఎల్లో కలర్లో ఉన్న కార్డ్ మీద గ్రీన్ లెటర్స్‌తో వచ్చిన వెడ్డింగ్ కార్డ్‌ను చూసి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత మళ్ళీ మేం కలవలేదు. మాట్లాడుకోలేదు. ఊరు మారినా ఫోన్ నెంబర్ మారినా చిన్న మెసేజ్ పెట్టుకుంటాం. అంతే. పదేళ్ళ నుండి అతని నంబర్, చిరునామా చూస్తూనే ఉన్నాను. ఎప్పుడూ కలుసుకోలేదు.
ఈ రోజు ఫోన్ కాల్‌తో అది తప్పేలా లేదు.
ఉద్వేగంగా ఉందని అర్థమవుతూ ఉంది. ఎంత ప్రయత్నించినా కారు వేగం ఇంతకు మించి తగ్గించలేకపోతున్నాను. మధ్య మధ్యలో అమ్మీ ఇక బతకదేమో అనే ఆలోచన వచ్చినప్పుడు కొంచెం ఆందోళనగా అనిపిస్తోంది. ఎందుకంటే రియాజ్‌కి అమ్మీ అంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే నన్ను కూడా కాదనుకునేంత ప్రాణం.
‘రియాజ్.... ధైర్యంగా ఉండు... ప్ల్లీజ్ ధైర్యంగా ఉండు... నే వచ్చేస్తున్నా’ నాలో నేను మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నాను.
స్నేహితులు చెప్పారు- రియాజ్ వాళ్ల అన్నయ్యతో కూడా మాట్లాడటం మానేశాడట. నాతో పెళ్లికి సపోర్ట్ చేయలేదని కోపం అట. పిచ్చోడు. రక్తసంబంధాలు వద్దనుకుంటారా ఎవరైనా.
ఎప్పుడొచ్చిందో ఏలూరు వచ్చేసింది.
అప్పటికి సాయంత్రం ఐదయ్యింది.
రియాజ్ హాస్పిటల్ అడ్రస్ మెసేజ్ పెట్టాడు. దాని ప్రకారం చేరుకుని కార్ పార్క్ చేసి హాస్పిటల్ వైపు చూస్తూ కూచున్నాను. రియాజ్‌కి కాల్ చేయాలి. ఇంతలో వాళ్ల అన్నయ్య సర్ఫరాజ్ గేటు దగ్గర కనిపించేడు. నన్ను చూసి లోపలికి వెళ్లి ఐదు నిమిషాల తరువాత నేరుగా నా కారు వైపు వచ్చాడు.
కారు దిగి నిలబడ్డాను. ‘రా.. శశి’... అనుసరించమంటూ ముందుకు దారి తీశాడు. మౌనంగా వెంబడించాను. ర్యాంప్ మీద నడుచుకుంటూ మూడో అంతస్తులోని ఐసియు వద్దకు చేరాం. సర్ఫరాజ్ ఐసియులోకి వెళ్లి అక్కడున్న సిబ్బందితో మాట్లాడి బయటకొచ్చాడు.
‘లోనికి వెళ్లి అమ్మీని కలువు శశీ’
చల్లగా ఉంది ఐసియు లోపలికి అడుగు పెట్టాను.
సిబ్బంది బ్లూ గౌన్ తొడిగి స్లిప్పర్స్ చూపించి వాటిని వేసుకొని వెళ్లమన్నారు.
ఒక బెడ్ మీద రకరకాల ట్యూబులు, వైర్ల మధ్య అమ్మీ కనిపించింది. మంచానికి అతుక్కుపోయినట్టు కనిపిస్తోంది. చేయి మీద నరాలు బయటకొచ్చేశాయి. శ్వాస భారంగా ఆడుతోంది. సగం మూసిన కళ్ళు, సగం తెరిచిన నోరు... చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నా ధైర్యంగా రెక్కల కష్టం మీద పిల్లలని పెంచి పెద్ద చేసిన అమ్మీ ఈమేనా?
అమ్మీ... అరచేతిని నిమిరాను.
కళ్ళు తెరిచింది. దగ్గరగా జరిగి నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగాను...
‘ఎలా ఉన్నావు అమ్మీ’...
కళ్ళలో కన్నీళ్లు ఉబికి బయటకు వచ్చాయి. వారిస్తూ వేళ్ళతో మెత్తగా తుడిచాను. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. పెదాలు కదులుతున్నాయి కానీ మాట బయటకు రావటం లేదు.
‘ఏమీ కాదు అమ్మీ... అందరూ బావుంటారు. రియాజ్, సర్ఫరాజ్ అందరూ బాగానే ఉంటారు’
శక్తి కూడగట్టుకుంటూ అడిగింది - ‘మరి నువ్వూ’
‘నేను కూడా బాగున్నా అమ్మీ. ఉద్యోగముంది. బతుకుతున్నా’ సంతోషంగా ... అనే మాట అనలేక పోయాను.
కళ్ల నుంచి వేడి కన్నీటి బొట్లు ధారగా జారాయి. తప్పు చేసిన దానిలా తలవొంచుకుంటూ అంది-
‘మాఫ్ కరో బేటా... క్షమిస్తావా నన్ను? పువ్వు సంతోషంగా లేదు... తీగ సంతోషంగా లేదు... క్షమిస్తావా నన్ను...’
ఈ ఒక్క మాట చెప్పడానికే పిలిపించిందా? అందుకోసమే బతికి ఉందా?
‘అలా అనకండి అమ్మీ.. ప్లీజ్ అలా అనకండి. మీరు ప్రశాంతంగా ఉండండి ప్లీజ్’
ఏదో గొణుక్కున్నట్టుగా ఉండిపోయింది.
ఇంతలో స్టాఫ్ వచ్చారు.
‘మేడమ్... ఆవిడని ఇక రెస్ట్ తీసుకోనివ్వండి’
ఆమె వైపు చూడకుండా చివుక్కున తిరిగి ఐసియు నుండి బయటపడి అక్కడ ఉన్న బల్ల మీద కూలబడ్డాను. భోరున ఏడుపు వచ్చింది. పక్కనే నిలబడ్డ సర్ఫరాజ్ మాటలు లేనట్టుగా ఉండిపోయాడు. కాసేపటికి అన్నాడు-
‘రియాజ్ నీ కార్ దగ్గర ఉన్నాడు’
కార్ దగ్గరకు వచ్చాను. రియాజ్ కనిపించ లేదు. కార్ స్టార్ట్ చేసి అలాగే కూర్చున్నాను. రెండో నిమిషంలోనే వచ్చి నా పక్క సీట్లో కూర్చున్నాడు. ఒక్క క్షణం చూశాను. మనిషి పూర్తిగా మారిపోయాడు. ఆ మెరుపు, ఆ నవ్వు... మాయమైపోయాయి. పదేళ్ళు చాలా పెద్ద కాలం కదా.
కారు స్టార్ట్ చేసి ముందుకు నడిపించాను. రియాజ్ ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు. కారు పోనిస్తున్నాను. ఎక్కడికని తను అడగలేదు. నేను చెప్పలేదు. పావుగంట తర్వాత కారు ఊరి పొలిమేర్లలో ఉన్న గుడి దగ్గర ఆపాను. విశాలమైన గ్రౌండ్ ప్రశాంతమైన సాయంత్రం... ఒకప్పుడు వారానికి ఒకసారైనా ఇక్కడికి వచ్చేవాళ్ళం ఇద్దరం.
అక్కడే రావిచెట్టు ఉంటుంది. అదే మా స్పాట్.
ఎప్పటిలాగే నేను కాళ్లు ముడుచుకుని కూచున్నాను. ఎప్పటిలాగే కాళ్లు కిందకు జార్చి రియాజ్ కూచున్నాడు. తన అరచేతుల్ని మూస్తూ, తెరుస్తూ వాటి వైపే చూస్తున్నాడు. ఆ వేళ ఆ సాయంత్రం పదేళ్ల ఎడబాటుకు సాక్షీభూతం.
‘రియాజ్... మాట్లాడు’
తల అడ్డంగా ఊపి కింద పెదవిని గట్టిగా అదిమి పట్టుకున్నాడు. అలాగే ఉండిపోయాడు. తెరిచిన తన అరచేతిలో చెయ్యి వేశాను. చప్పున ఇంకో చెయ్యి దాని మీద వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఏడుస్తున్నాడు. చూస్తున్నాను.
‘ఇక నా వల్ల కాదు శశి... నాతో నేను పోరాడుతూ, జీవితంలో పోరాడుతూ పూర్తిగా ఓడిపోయాను. ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? ఈ బాధ పదేళ్లయినా తగ్గదే.
దీన్ని జీవితమంటారా?’
నేను ఏమీ మాట్లాడలేదు. ఏమి చెప్పి ఓదార్చాలి? రియాజ్ సంతోషంగా లేడు, తను కూడా లేదు. బతుకుతున్నారు. జీవించటం లేదు. అంతకు మించి మార్గం ఏమైనా ఉంది. నాకు తెలుసు నేను అధైర్యపడితే రియాజ్ అస్సలు చూడలేడని.
‘అలా మాట్లాడకు రియాజ్. ధైర్యంగా ఉండు. ఇటు చూడు. నేనెంత ధైర్యంగా ఉన్నానో చూడు’ రియాజ్ ముఖాన్ని నా వైపు తిప్పుకున్నాను. నన్ను రెప్ప ఆర్పకుండా చూస్తున్నాడు. ఒకప్పటి మెరుపు ఒక్క క్షణం మళ్లీ తన కళ్లలో వెలిగింది.
‘అందంగా ఉన్నావు శశీ... చాలా అందంగా ఉన్నావు. ఎప్పటిలానే’...
చిన్నగా నవ్వాను.
‘అవునూ నువ్వేంటి ఇంత పొట్ట పెంచావు?’ పొట్ట మీద చిన్నగా కొడుతూ అడిగాను.
ఇద్దరం ఒక్కసారిగా నవ్వేశాం.
‘పిల్లలు ఎలా ఉన్నారు రియాజ్? ఏమి చేస్తున్నారు?’
పిల్లలు అనగానే రియాజ్ పెదాల మీద చిరునవ్వు.
ఇలా ఆనందంగా ఉంటే ఎంత అందంగా ఉంటాడు... అనిపించింది. ఊహూ... పక్కన కూర్చుంటే సరిగా కనబడటం లేదు.
లేచి నిల్చున్నాను రియాజ్ చెప్పులలో కాళ్లు పెట్టి నెమ్మదిగా అక్కడే తన ముందు అటూ ఇటూ నడుస్తున్నాను. రియాజ్ నా కాళ్లవైపే చూస్తున్నాడు. కుడి అరికాలు వంపులో ఉన్న పుట్టుమచ్చ, దాన్ని ఎన్నిసార్లు ముద్దాడాడో నాకే గుర్తులేదు. అప్పట్లో ఉన్న పట్టీలు, మువ్వలు ఇప్పుడు లేవు. నాకు ఎప్పుడూ ఇష్టముండేది కాదు మువ్వలంటే. రియాజ్ కోసం వేసుకునేదాన్ని.
‘చెప్పు రియాజ్’
‘పిల్లలు బాగున్నారు. రోషినీ అయిదవ తరగతికి వచ్చింది. చాలా పెద్దదైపోయిందన్న భావన తనకి. లేనిపోని గాంభీర్యం నటిస్తుంది. నీలాగా బట్టల పిచ్చి. షాప్‌కి తీసుకెళితే వంద తీయించి ఒకటి సెలక్ట్ చేస్తుంది.’
కూతురి గురించి ఆనందంగా మాట్లాడు తుంటే రియాజ్ వైపు రెప్పార్పకుండా చూశాను.
‘మరి ఆసిఫ్?’
‘వాడా, వాడు నాకంటే పెద్ద వెధవ అవుతాడు శశి. వాడి మీద టీచర్ల నుండి రోజు కంప్లైంట్స్. వాడు నాకొద్దు. నువ్వు తీసుకెళ్లి పెంచుకో వాడిని’ నవ్వుతూ అన్నాడు.
నవ్వడానికి ప్రయత్నించాను. నా కళ్లలో బాధ, గొంతులో వణుకు గమనించాడు. పదేళ్లలో ఏం మారిందని? తన ముందు నెమ్మదిగా అడుగులు కదిలిస్తున్న అదే అమ్మాయిని. రెండు చేతులూ పట్టుకున్నాడు.
‘పెళ్లి చేసుకోవా ఇక?’
మౌనంగా ఉన్నాను.
‘నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్నట్లే నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటానుగా’
‘నేను బాగానే ఉన్నాను. నమ్ము ప్లీజ్.’
‘నమ్మను’
‘శశి. ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ఇప్పటికైనా మన కోసం మనం జీవించవచ్చేమో...’ రెండు చేతులు గట్టిగా పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు.
నెమ్మదిగా విడిపించుకుని పక్కనే కూచున్నాను.
‘ఆ ఆలోచన కూడా రానివ్వకు రియాజ్. ఎన్నో జీవితాలు ముడిపడి ఉన్నాయి. పిల్లలు నాజియా వాళ్లేం తప్పు చేశారు? వాళ్లు పూర్తిగా నీ బాధ్యత. జాగ్రత్తగా చూసుకో వాళ్లని.’
‘మరి నువ్వు? నువ్వు నా బాధ్యత కాదా? నువ్వు ఒంటరిగా అలా ఉండిపోయావన్న బాధ నన్ను ప్రతిక్షణం చంపేస్తుంది తెలుసా?’
‘అది మనిద్దరి నిర్ణయం. నేను నిజంగా బాగానే ఉన్నాను’
‘నువ్వు చాలా మొండిదానివి, నా మాట వినవు’.
లేచి నిలబడ్డాను.
‘పద.. అన్నయ్య నీ కోసం ఎదురుచూస్తుంటాడు. సరిగ్గా మాట్లాడుకుంటున్నారా మీరిద్దరూ?’
‘పదేళ్ల తర్వాత ఇప్పుడే మాట్లాడటం అన్నయ్యతో’ అన్నాడు దూరంగా చూస్తూ.
‘అలా ఉండకు రియాజ్. సర్ఫరాజ్ తప్ప నీకెవరున్నారు? కోపాలు వదిలెయ్.’
‘ఆ రోజు తను నావైపు ఉంటే అమ్మీ ఒప్పుకునేదే’
‘వదిలేయి ప్లీజ్. అనవసరంగా నీ మనసుని ఇంకా కష్టపెట్టుకోకు. అందరితో కలిసి ఉండు. నీ జీవితం అన్ని విధాలుగా బాగుండాలి. నువ్వు బాధ్యతగా ఉండాలి. అలా ఉంటానని మాటిస్తావా రియాజ్’ తను చెయ్యి చాచింది.
‘ఇవ్వను. అస్సలు ఇవ్వను’ రెండు చేతులూ కట్టుకుంటూ అడ్డంగా తలాడించాడు రియాజ్. తనెప్పుడూ అంతే చిన్న పిల్లాడిలా మారాం చేస్తాడు. కానీ తన మాట ఎప్పుడూ కాదనడు.
‘పద వెళదాము’.
చెయ్యి పట్టుకుని పైకి లేపాను. ఇష్టం లేకుండానే లేచాడు. కార్ స్టార్ట్ అయింది. మళ్లీ బిగుసుకుపోయాడు.
కారు హాస్పిటల్ వద్దకు చేరింది.
‘శశి...’
‘దిగి వెళ్లి పో రియాజ్.’
దిగాడు. నా విండో వైపు వచ్చాడు. చేయి తాకాలని అనుకున్నాడు. కాని అవకాశం ఇవ్వక స్టీరింగ్ మీదే నా చేయి బిగించి ఉంచాను.
వెళ్లిపోతున్నాడు.
అందమైన రియాజ్. మంచి మనసున్న రియాజ్. నన్ను ప్రేమిస్తూనే ఉన్న రియాజ్.
ఒక్క క్షణం గట్టిగా పిలవాలనిపించింది. వెనక్కు పిలవాలనిపించింది.
కాని- ఆగాను.
అతి కష్టం మీద నన్ను నేను కూడగట్టుకున్నాను.
దేవుడా... ఏంటిది?
ఈ ముగిసిన కథలోకి మళ్లీ రావడం... మళ్లీ ఈ జ్ఞాపకాలను తిరగదోడుకోవడం... తెగిన దారాన్ని అతుకులు పెట్టాలనుకోవడం... దూరంగా ఉండటంలోని కష్టం కంటే ఈ కష్టం ఎక్కువగా ఉంది.
మెల్లగా కారు స్టార్ట్ చేసి కాసేపటిలోనే హైవే మీదకు చేరుకున్నాను. కారు కూడా కుదుపులు సర్దుకుని ముందుకు పరిగెట్టడానికి సిద్ధమవుతూ ఉంది. రేర్ వ్యూ మిర్రర్లో దూరమవుతున్న ఊరు కనిపిస్తూ ఉంది.
బహుశా రెండు మూడు రోజులలో అమ్మీ చనిపోయిన ఫోన్ రావచ్చు. రియాజ్ మళ్లీ కాల్ చేయవచ్చు. కాని ఇక తను రాకపోవచ్చు. ఎప్పటికీ రాకపోవచ్చు. బాధను మిగిల్చే అనుభవంలోకి మళ్లీ మళ్లీ ఎందుకు రావడం?
మలుపు దాటితే కొత్తగా వేసిన రోడ్డు కనిపిస్తూ ఉంది.
అటుగా ఎక్సిలరేటర్ తొక్కాను.
- సంజీవని కుసుమ్