సరస్వతి వరం
వరం శ్రీదేవి... ఆమె సరస్వతి వరపుత్రిక. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ... అడుగు పెట్టిన ప్రతిచోటా మార్కుల ప్రభంజనం సృష్టించింది. హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పీహెచ్డీ చేసి, యూకేకు చెందిన ‘జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ అవార్డు’ను సొంతం చేసుకుంది. భర్త, అత్తామామల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందంటున్న శ్రీదేవి పరిచయం ఆమె మాటల్లోనే...
మాది శ్రీశైలం. నాన్న వరం లక్ష్మణ్‌రావు, అమ్మ కామేశ్వరి గవర్నమెంట్ టీచర్స్. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో మా ఇల్లు. ఆ కాలనీలోని ఇంజనీర్స్ పిల్లలు నాకు మంచి ఫ్రెండ్స్. ఇంజనీర్ కావాలన్న ఆలోచన నా మదిలో అప్పుడే బలంగా నాటుకుంది. తోటి స్నేహితులు కూడా ఇంజనీరింగ్వైపే రావడంతో వారితో పోటీగా చదివేదాన్ని. హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూలో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేశా.
తరువాత బాంబే ఐఐటీలో ఎంటెక్ సీటు వచ్చింది. 1999 ఎంటెక్ పూర్తయ్యాక రెండేళ్ల పాటు పుణేలోని వినోదై ఇండస్ట్రీలో అర్ అండ్ డీ ఇంజనీర్‌గా పనిచేశా. అదే ఏడాది నాకు లలిత్ మోహన్‌తో వివాహమైంది. తను మాసబ్‌ట్యాంక్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీలో సీనియర్ టెక్నాలజీ మేనేజర్‌గా పనిచేస్తుండటంతో సిటీలోనే సెటిల్ అయ్యాం.
పదేళ్ల విరామం తర్వాత...
చదువును ఎందుకు కొనసాగించకూడదు అనిపించింది. 2009లో హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్‌డీలో చేరాను. అయితే మేనేజ్ స్ట్రక్చర్ మెటీరియల్‌పైనే ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. అందుకే ఛాలెంజింగ్ టాపిక్ అయిన ‘స్ట్రైన్రేట్ సెన్సివిటీ ఆఫ్ బల్క్ మల్టీఫేస్ మేనేజ్ స్ట్రక్చర్ అల్యూమినియం టంగ్స్టైన్ అలయ్’ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నా. కొంత వర్క్ సింథరింగ్ ఏఆర్‌సీఐలో చేశా. మిగతా వర్క్ క్యారక్టరైజేషన్ చేశా. చాలా పుస్తకాలు చదివా.
ఇంటర్నెట్ బాగా ఉపయోగించుకున్నా. నాలుగో తరగతి చదువుతున్న పాప గాయత్రితోపాటు నేనూ పుస్తకాలు పట్టుకొని పోటీపడి చదివేదాన్ని. నేను ఎంచుకున్న ‘స్ట్రైన్ రేట్ సెన్సివిటీ’ టాపిక్ ఫిల సాఫికల్ మేగజైన్ లెటర్స్‌లో ప్రచురితమైంది. ఈ మాగజైన్లో ప్రచురితమైన తొలి మూడు బెస్ట్ టాపిక్‌లకు ప్రతిఏటా ‘జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్’ అవార్డులిస్తుంటుంది. ఈసారి ఆ అవార్డు నాకు రావడం సంతోషాన్నిచ్చింది.
వాళ్ల ప్రోత్సాహమే...
ఇదంతా నా భర్త, అత్తమామల చలవే. వారు నన్ను ప్రోత్సహించకుండా ఉంటే అసలు పీహెచ్డీ చేసేదాన్నే కాదు. ప్రస్తుతం మహత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్నా. మా పేరేంట్స్ నన్ను టీచర్‌గా చూడాలనుకున్నారు. తరువాత నా ఇంట్రెస్ట్ తెలుసుకొని ప్రోత్సహించారు. నా కల ఇంజనీరింగ్ చేయాలని. ఇప్పటికే పుణేలో ఆ పనిచేశా. ఇప్పుడు మా పేరేంట్స్ అనుకున్న గురువు పాత్రను పోషిస్తున్నా. అకాడమిక్ రంగంలో కొనసాగుతూనే నా పరిశోధనలను కొనసాగించాలనుకుంటున్నా.
వాంకె శ్రీనివాస్