శరద్‌యాదవ్‌పై అట్రాసిటీ కేసు
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝిపై కులతత్వ విమర్శలు చేసినందుకు జేడీ(యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్‌పై మంగళవారం పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జస్టిస్ భరత్ సింగ్ ఆదేశం మేరకు, శరద్‌యాదవ్‌పై ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని పట్నా సీనియర్ ఎస్పీ జితేంద్ర రానా తెలిపారు.
శరద్‌యాదవ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు పాశ్వన్ డిసెంబర్ 3న చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 2న శరద్‌యాదవ్ కాన్పూర్‌లో మంఝి విద్యా, రాజకీయ అర్హతలపై చేసిన వ్యాఖ్యలు దళితుల, ముసాహర్ కులస్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన ఆరోపించారు. మంఝిని ముసాహర్గా వర్ణించారని విష్ణు పేర్కొన్నారు.