saravana bhavan
-
సినిమా – బయోపిక్: దోసె కింగ్ పై ఆమె యుద్ధం
ఇరవై ఏళ్లు ఆమె న్యాయం కోసం యుద్ధం చేసింది. ఎక్కడా తగ్గలేదు.. దేనికీ భయపడలేదు. అవతల ఉన్నది వందల కోట్లకు అధిపతి, రెస్టరెంట్ రంగానికి సమ్రాట్, వేలాది ఉద్యోగుల దేవుడు ‘శరవణ భవన్’ రాజగోపాల్. కాని ఆయన వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆమె న్యాయపోరాటం చేసింది. ఆమె కథ ఇప్పుడు ‘జైభీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో బాలీవుడ్లో ‘దోసె కింగ్’గా చిత్ర రూపం దాలుస్తోంది. ఆమె పేరు జీవజ్యోతి శాంతకుమార్. ఇది ఆమె పోరాటగాథ. ‘శరవణ భవన్’ పి.రాజగోపాల్‌ను చెన్నై వచ్చిన కొత్తల్లో ఒక జ్యోతిష్యుడు ఏదైనా ‘అగ్ని’తో ముడిపడిన వ్యాపారం పెట్టు అన్నాడు. రాజగోపాల్ ‘శరవణ భవన్’ రెస్టరెంట్ పెట్టి, సక్సెస్ అయ్యి, 22 దేశాల్లో తన హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 30 వేల కోట్ల సంపదకు ఎగబాకాడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమైంది. అయితే అగ్నితో పోల్చే ‘కామాగ్ని’తో అదే రాజగోపాల్ అంత పేరూ దహించుకుపోవడమూ ఈ జోస్యంలో ఉంది. ఆమె పేరు జీవజ్యోతి జీవజ్యోతి ఎంతో చలాకీ అమ్మాయి. చదువుకుంటున్న అమ్మాయి. శరవణ భవన్లో పని చేసే అసిస్టెంట్ మేనేజర్ కూతురిగా పి.రాజగోపాల్‌కు 1996లో పరిచయం అయ్యింది. అప్పటికే రాజగోపాల్ ‘దోసె కింగ్’ గా చెన్నైలో పేరు గడించాడు. శరవణ భవన్లో వేలాది ఉద్యోగులకు రకరకాల అలవెన్సులు ఇస్తూ కన్నబిడ్డల్లా చూసుకుంటూ దేవుడయ్యాడు. అతని మాటకు ఎదురు లేదు. 1972లో ఒక వివాహం (ఇద్దరు కొడుకులు), 1994లో మరో వివాహం చేసుకున్న రాజగోపాల్ జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలనుకున్నాడు. దానికి కారణం కూడా జోతిష్యమే.‘మీ ఇద్దరి జాతకాలు కలిశాయి. ఆమెను చేసుకుంటే నువ్వు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తావు’ అని ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే జాతకం ఒకటి తలిస్తే జీవజ్యోతి మరొకటి తలిచింది. ట్యూషన్ మాస్టర్‌తో ప్రేమ జీవజ్యోతి పి.రాజగోపాల్‌ను తన గార్డియన్ గా భావించింది. పెద్దాయన అభిమానం ప్రదర్శిస్తున్నాడనుకుంది తప్ప అతని మనసులో ఏముందో ఊహించలేకపోయింది. ఈలోపు ఆమె శాంతకుమార్ అనే లెక్కల ట్యూషన్ మాస్టర్ ప్రేమలో పడి 1999లో పెళ్లి చేసుకోవడానికి పారిపోయింది. ఆమె మీద అప్పటికే కన్ను వేసి ఉన్న రాజగోపాల్ ఆ జంటను చెన్నై రప్పించి కాపురం పెట్టించాడు. కాని 2000 సంవత్సరంలో శాంతకుమార్‌ను బెదిరించి జీవజ్యోతితో తెగదెంపులు చేసుకోమన్నాడు. దీనికి జీవజ్యోతి ఒప్పుకోలేదు. శాంతకుమార్ కూడా. 2001లో హత్య జీవజ్యోతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజగోపాల్ తన దగ్గర పని చేసే డేనియల్‌తో 5 లక్షలకు డీల్ మాట్లాడుకుని శాంతకుమార్‌ను చంపించే పథకం పన్నాడు. అయితే డేనియల్ శాంతకుమార్‌ను కనికరించి ఐదువేలు ఇచ్చి ముంబై పారిపోమని చెప్పాడు. రాజగోపాల్‌తో శాంతకుమార్‌ను హత్య చేశానని చెప్పేశాడు. అయితే శాంతకుమార్ జీవజ్యోతికి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో ‘నువ్వు వచ్చేసెయ్. రాజగోపాల్ కాళ్లమీద పడి వదిలేయ్‌మని అడుగుదాం’ అనేసరికి అతను వచ్చాడు. ఇద్దరూ రాజగోపాల్ దగ్గరకు వెళ్లారు. దీంతో కోపం పట్టలేకపోయిన రాజగోపాల్ అక్టోబర్ 28న వాళ్లను తన మనుషులతో తీసుకెళ్లాడు. అక్టోబర్ 31న శాంతకుమార్ శవం అడవిలో దొరికింది. జీవజ్యోతి ఈ దెబ్బతో పూర్తిగా దారికొస్తుందని భావించిన రాజగోపాల్ ఆమెను ఇంటికి వెళ్లనిచ్చాడు. అయితే ఆమె నేరుగా చెన్నై పోలీస్ కమిషనర్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడంతో దోసె కింగ్ సామ్రాజ్యం ఉలిక్కిపడింది. సుదీర్ఘ పోరాటం రాజగోపాల్‌కు ఉన్న పలుకుబడి ముందు జీవజ్యోతి ఎటువంటి ప్రలోభాలకు, వొత్తిళ్లకూ లొంగలేదు. తనకు అన్యాయం జరిగిందని గట్టిగా నిలబడి న్యాయం కోసం పోరాడింది. అయితే రాజగోపాల్ కేవలం 9 నెలలు మాత్రం జైలులో ఉండి తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. అతను జైలులో ఉన్న కాలంలో మంచి భోజనం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 2004లో సెషన్స్ కోర్టు రాజగోపాల్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దాని మీద రాజగోపాల్ హైకోర్టుకు అప్పీలు చేయగా 2010లో చెన్నై హైకోర్టు మరింత శిక్ష పెంచుతూ యావజ్జీవం చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో పోరాడాడు రాజగోపాల్. ఇంత జరుగుతున్నా జీవజ్యోతి ప్రతి చోటా తన న్యాయపోరాటం కొనసాగించింది. 2019 మార్చిలో సుప్రీం కోర్టు హైకోర్టు శిక్షనే బలపరిచి జూలై 7, 2019న లొంగిపోవాలని రాజగోపాల్‌ను ఆదేశించగా అప్పటికే జబ్బుపడ్డ రాజగోపాల్ జూలై 9న అంబులెన్స్‌లో వచ్చి కోర్టులో లొంగిపోయాడు. కాని ఆ వెంటనే విజయ హాస్పిటల్ ప్రిజనర్స్ వార్డ్‌కు తరలించాల్సి వచ్చింది. గుండెపోటుతో అతడు జూలై 18న మరణించాడు. సినిమా పేరు ‘దోసె కింగ్’ జంగిల్ పిక్చర్స్ వారు జీవ జ్యోతి నుంచి బయోపిక్ రైట్స్ కొనుక్కుని ‘జై భీమ్’ దర్శకుడు టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ పోరాటమంతా హిందీలో సినిమాగా తీయనున్నారు. తారాగణం ఇంకా ఖరారు కావాల్సి ఉంది.‘నా పోరాటం సినిమాగా రానుండటం నాకు సంతోషంగా ఉంది’ అంది జీవ జ్యోతి. అయితే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఒక రోజైనా జైలులో ఉండకుండా రాజగోపాల్ మరణించడం పట్ల ఆమెకు ఇంకా అసంతృప్తే ఉంది. -
King Dosa: భర్తను చంపిన మూర్ఖుడిపై పోరాటమే సినిమాగా..
కొన్ని కథలు సినిమా కంటెంట్‌గా మారుతుంటాయి. కొన్నిసార్లు ఆడియొన్స్‌ను మెప్పిస్తుంటాయి. మరికొన్నిసార్లు బోల్తా పడుతుంటాయి. కానీ, వ్యథలు, పోరాటాలతో కూడిన వాస్తవ గాథలు మాత్రం తెరపై భావోద్వేగాలను పండించి ఆడియొన్స్‌ను మెప్పించిన సందర్భాలే ఎక్కువ!. సూర్య ‘జై భీమ్’ ద్వారా అలాంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయిన దర్శకుడు టీజే జ్ఞానవేల్.. ఇప్పుడు ‘దోశ కింగ్’ అంటూ మరో వాస్తవ ఘటనను సిల్వర్ స్క్రీన్‌పైకి తేబోతున్నాడు. దోశ కింగ్.. వ్యవస్థలో పెద్ద మనిషిగా చెలామణి అయిన ఓ వ్యక్తికి ఎదురు తిరిగి ఓ ఒంటరి అబల చేసిన పోరాటం. జాతకాల పిచ్చితో తన జీవితాన్ని నాశనం చేసిన ఓ మూర్ఖుడిపై సాధించిన విజయం. పీ రాజగోపాల్.. శరవణ భవన్ చెయిన్ రెస్టారెంట్ల వ్యవస్థాపకుడు. తమిళనాడు ట్యూటికొరిన్ జిల్లాలో ఓ మారుమూల పల్లెలో రైతు కుటుంబంలో పుట్టి.. పెద్దగా చదువుకోకుండానే హోటల్ రంగంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. రాజగోపాల్ తండ్రి ఉల్లిపాయల వ్యాపారి.. తల్లి గృహిణి. వ్యవసాయంలో కూడబెట్టిన తల్లిదండ్రుల డబ్బు తీసుకుని మద్రాస్ రైలెక్కాడు. కేకే నగర్లో పచారీ కొట్టుతో మొదలుపెట్టి.. చిరు వ్యాపారిగా ఎదిగాడు. శరవణ భవన్ పేరిట ఓ రెస్టారెంట్ మొదలుపెట్టి.. 22 దేశాల్లో 111 రెస్టారెంట్లున్న ఫ్రాంచైజీగా దానిని విస్తరించాడు. హోటల్ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగిన రాజగోపాల్ అంటే అందరికీ గౌరవమే అయినా.. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం వివాదం.. విమర్శల మయమే!. జాతకాల పిచ్చితో ఓ జ్యోతిష్యుడు చెప్పాడని.. మూడవ పెళ్లికి సిద్ధమయ్యాడు. అదీ తన దగ్గర అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న రామసామి చిన్న కూతురిని పెళ్లాడాలని ప్రయత్నించాడు. అయితే అప్పటికే జీవజ్యోతికి పెళ్లి అయ్యింది. అందుకే రాజగోపాల్ ప్రతిపాదనను ఆమె ఛీ కొట్టింది. దీంతో పగ పెంచుకున్న రాజగోపాల్.. బెదిరింపులు, దాడులు, చేతబడి లాంటి పిచ్చి ప్రయత్నాలెన్నో చేశాడు. అయినా జీవజ్యోతి లొంగలేదు. దీంతో.. ఆ భర్త అడ్డు తొలగించుకుని వివాహం చేసుకోవాలనుకున్నాడు. 2001 అక్టోబర్ 26న బలవంతంగా కిడ్నాప్ చేయించి మరీ జీవజ్యోతి భర్త ప్రిన్స్ శాంతకుమార్‌ను హత్య చేయించాడు. జీవజ్యోతిని లైంగిక వేధించడం, హత్యా నేరారోపణలపై దోశ కింగ్‌గా పేరున్న రాజగోపాల్ పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ నేరారోపణలతో శరవణ భవన్ పేరు ప్రతిష్టలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. మద్రాస్ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే అనారోగ్యంతో బెయిల్ మీద కొన్నాళ్లూ బయట తిరిగాడు. ఆపై సుప్రీం కోర్టు జోక్యంతో.. తిరిగి 2019లో పోలీసులకు లొంగిపోవాల్సి వచ్చింది. పోలీసులకు లొంగిపోయిన నాలుగు రోజులకే గుండెపోటు.. ఆపై మరో ఐదు రోజులకే చికిత్స పొందుతూ కన్నుమూశాడు దోశ కింగ్ రాజగోపాల్. అతను (రాజగోపాల్) తన ఉద్యోగులతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ కారణంతో నా పోరాటాన్ని చాలామంది తప్పుబట్టారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. అందుకే సినిమా తెర మీదకు రావాల్సిన అవసరం ఉందని జీవజ్యోతి చెబుతోంది. ప్రస్తుతం ఆమె తంజావూర్లో ఓ టైలరింగ్ యూనిట్ నడిపిస్తూ.. తల్లి నడిపిస్తున్న హోటల్ వ్యవహరాలను చూసుకుంటోంది. ఆమె పోరాటమే ఇప్పుడు సినిమాగా రాబోతోంది. -
జీవజ్యోతి గుర్తుందా..? తెరపైకి ఆమె బయోపిక్..
Jeevajothi Santhakumar Biopic: జీవజ్యోతి బయోపిక్ సినిమాగా రూపొందనుంది. జీవజ్యోతి పేరు కొనేళ్ల క్రితం పత్రికల్లో మారుమోగింది. ప్రముఖ హోటల్ శరవణ భవన్ అధినేత రాజగోపాల్ తన హోటల్లో పని చేసే కార్మికురాలైన జీవజ్యోతిని వశపరచుకోవడానికి ఆమె భర్తను చంపించారు. రాజగోపాల్‌పై కార్మికురాలైన జీవజ్యోతి 18 ఏళ్లు పెద్ద పోరాటమే చేసి గెలుపు సాధించింది. ఈ సంఘటనతో జీవజ్యోతి బయోపిక్‌ను జంగిల్ పిక్చర్స్ చిత్ర నిర్మాణ సంస్థ సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో జీవజ్యోతి, రాజగోపాల్ పాత్రల్లో నటించే నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేస్తున్నారు. దీనిపై స్పందించిన జీవజ్యోతి అర్థబలం, అంగబలం కలిగిన ఒక హోటల్ అధినేతపై తన 18 ఏళ్ల పోరును జంగిల్ పిక్చర్స్ సంస్థ సినిమాగా రూపొందించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. తన జీవిత గాథను తెరపై చూసిన తర్వాత పురుషాధిక్యం కారణంగా తాను అనుభవించిన బాధ అందరికీ తెలుస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. -
‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత
సాక్షి ప్రతినిధి, చెన్నై: దక్షిణ భారత ఆహారాన్ని అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన శరవణ భవన్ హోటళ్ల గ్రూప్ అధినేత పి.రాజగోపాల్ (73), కోర్టు విధించిన యావజ్జీవ జైలు శిక్షను అనుభవించడానికి ముందే గురువారం కన్నుమూశారు. 2001లో ఓ ఉద్యోగిని హత్య చేసిన కేసులో రాజగోపాల్ యావజ్జీవ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పది రోజుల క్రితమే కోర్టులో లొంగిపోయారు కూడా. ఆ వెంటనే అనారోగ్యం కారణంగా రాజగోపాల్ ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 10 గంటలకు మరణించారు. ఆయన అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వైద్యులు వెల్లడించలేదు. జ్యోతిష్యుడు చెప్పాడంటూ తన దగ్గర పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూతురిని రాజగోపాల్ మూడో పెళ్లిచేసుకోవాలనుకోగా, అందుకు ఆమె ఒప్పుకోకుండా శరవణ భవన్‌లోనే పనిచేస్తున్న శాంతకుమార్ అనే ఉద్యోగిని వివాహం చేసుకుంది. దీంతో ఎలాగైనా ఆమెను పెళ్లిచేసుకునేందుకు శాంతకుమార్‌ను రాజగోపాల్ హత్య చేయించాడు. ఈ కేసులో రాజగోపాల్‌తోపాటు మరో ఎనిమిది మందికి జైలు శిక్ష పడింది. ఆ శిక్షను అనుభవించకుండానే రాజగోపాల్ గురువారం కన్ను మూశాడు. కాగా, రాజగోపాల్ స్థాపించిన శరవణ భవన్ హోటళ్లు ఇండియాలోని పలు నగరాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రిటన్ సహా 20 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. -
‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత హోటల్ శరవణ భవన్ యజమాని రాజగోపాల్ ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో చెన్నై అసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజగోపాల్ గురువారం మరణించారు. మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతోపాటు, ఆమె భర్తను కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించిన రాజగోపాల్ కథ ముగిసింది. హత్య కేసులో దోషిగా తేలి , జీవిత ఖైదు శిక్ష విధించిన నేపథ్యంలో జూలై 8వ తేదీన ఆ యన కోర్టు ఎదుట లొంగిపోయారు. అయితే ఈ సందర్భంగా తీవ్ర అనారోగ్యానికి గురికావడం, గుండెపోటుతో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను విజయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే. చదవండి : పర స్త్రీ వ్యామోహంతో ‘దోశ కింగ్’ పతనం ‘శరవణ’ యజమానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు -
‘శరవణ’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్యంతో ఉన్న కారణంగా జైలుకు వెళ్లేందుకు తనకు మరికొంత సమయం కావాలంటూ ‘శరవణ భవన్’ హోటళ్ల యజమాని పి.రాజగోపాల్ చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. దీంతో ఆయన చెన్నైలోని సెషన్‌కోర్టులో లొంగిపోయారు. దక్షిణ భారత ఆహారాన్ని అందించడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘శరవణ భవన్’ హోటళ్లను స్థాపించిన రాజగోపాల్ ఓ హత్య కేసులో దోషి. ఇద్దరు భార్యలున్న రాజగోపాల్ జ్యోతిష్యాన్ని బాగా నమ్మేవాడు. 2001లో ఓ జ్యోతిష్యుడి మాటను నమ్మిన రాజగోపాల్, తన దగ్గర పనిచేస్తున్న శాంతకుమార్ అనే ఉద్యోగి భార్యను మూడో పెళ్లి చేసుకునేందుకు శాంతకుమార్‌ను అంతమొందించాడు. ఈ కేసులో 2004లో కింది కోర్టు ఆయనతోపాటు మరో 8 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించగా, వారంతా హైకోర్టులో అప్పీల్ చేసుకోవడంతో మద్రాసు హైకోర్టు 2009లో శిక్షను పదేళ్ల నుంచి యావజ్జీవానికి పెంచింది. మద్రాసు హైకోర్టు వేసిన శిక్షను ఇటీవలే సుప్రీంకోర్టు సమర్థించింది. -
శరవణ భవన్స్ అధినేత రాజగోపాల్‌కి సుప్రీంలో ఎదురుదెబ్బ
-
శరవణ భవన్ రాజగోపాల్‌కు ఎదురుదెబ్బ
చెన్నై : తమిళనాడులో ప్రసిద్ధి చెందిన హోటల్ శరవణభవన్ యజమాని రాజగోపాల్‌కు ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష విధించిన సుప్రీంకోర్టు జూలై 7లోగా కోర్టులో లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. అయితే కోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తూ రాజగోపాల్ బెయిల్ కోసం ప్రత్యేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించాడు. రాజగోపాల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ లొంగిపోయేందుకు ఇచ్చిన గడువును పొడిగించేది లేదని, ఆయన వెంటనే కోర్టుకి లొంగిపోవాలని జస్టీస్ ఎన్వీ రమణ మంగళవారం ఆదేశించారు. శాంతాకుమార్ హత్య కేసులో రాజగోపాల్ సహా 11మందికి సర్వోన్నత న్యాయస్ధానం మార్చిలో జీవితఖైదును ధృవీకరించింది. ఈ కేసు విషయంపై కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆధ్వర్యంలో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. హోటల్ శరవణభవన్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే రామస్వామి కూతురు జీవజ్యోతి (20) అదే హోటల్‌కు చెందిన మరో బ్రాంచ్‌లో పనిచేసేది. అయితే ఆమెపై కన్నెసిన రాజగోపాల్ జీవజ్యోతిని పెళ్లి చేసుకొవాలనుకున్నాడు. కాని ఆమె దీనికి తిరస్కరించి అదే హోటల్లో పని చేస్తున్నశాంతాకుమార్‌ను వివాహం చేసుకుంది. అప్పటికి మారని రాజగోపాల్ తనని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు. దీంతో ఆమె భర్త శాంతకుమార్‌ను కిడ్నాప్ చేయించి హత్య చేశాడు. -
పర స్త్రీ వ్యామోహంతో ‘దోశ కింగ్’ పతనం
సాక్షి, చెన్నై: ‘దోశ కింగ్’గా పేరొందిన శరవణభవన్ వ్యవస్థాపకుడు రాజగోపాల్‌కు జీవితఖైదు ఆదివారం నుంచి మొదలు కానుంది. హత్య కేసులో న్యాయస్థానం ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాజగోపాల్ జీవితంలో ఒక సినిమాకు సరిపడా కథ ఉంది. చిన్నతనంలో కడు బీదరికం అనుభవించి, స్వయంకృషితో ఉన్నత స్ధానానికి ఎదిగి.. మూఢ విశ్వాసాల కారణంగా ఎలా పతనం అయ్యాడో చెప్పడానికి ఆయన జీవితం ఓ గొప్ప ఉదాహరణ. ‘మహిళలపై వ్యామోహం, హత్య చేసైనా సొంతం చేసుకోవాలనే బలహీనత కారణంగా చివరకు కారాగారం పాలయ్యారు. ఎప్పుడూ నుదుటిపై గంధపు బొట్టు పెట్టుకుని, తెల్లని దుస్తులు ధరించే 71 ఏళ్ల రాజగోపాల్ తమిళనాడులోని తక్కువ కులానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి కుమారుడు. 1981లో చెన్నైలో కిరాణా దుకాణంతో జీవితాన్ని ప్రారంభించిన రాజగోపాల్, ధైర్యంగా అడుగు ముందుకు వేసి తన మొదటి రెస్టారెంట్‌తో దిగువ మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇడ్లీ, దోసెలు రుచి చూపించారు. అలా ఇంతింతై శరవణ భవన్ పేరు భారతదేశమంతా పాకింది. శరవణభవన్ గ్రూప్‌నకు దేశ, విదేశాల్లో కలిపి 20 వరకు హోటళ్లున్నాయి. ఆయన రెస్టరెంట్స్‌లోని గోడలపై దేవతల చిత్రపటాల పక్కనే రెండు ఫోటోలు కనిపిస్తాయి. ఒకటి కుమారులతో కలిసి, మరొకటి తను నమ్మిన ఆధ్యాత్మిక గురువుతో రాజగోపాల్ దిగిన ఫొటో. తన దగ్గర పనిచేసే కింది స్థాయి ఉద్యోగులకు కూడా ‘హెల్త్ ఇన్సూరెన్స్’ కల్పించి వారికి పెద్ద దిక్కులా మారారు. ఓ జ్యోతిష్కుడి మాటవిని 2000 సంవత్సరం ప్రారంభంలో తన కింది ఉద్యోగి కుమార్తెను మూడవ భార్యగా పొందడానికి విఫలయత్నం చేశారు. అప్పటికే సదరు యువతి ప్రేమ వివాహం చేసుకొన్న కారణంగా ఆయన్ని తిరస్కరించడంతో ఆమె భర్తను 2001లో హత్య చేయించాడు. 2004లో కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మళ్లీ అప్పీలు చేసుకోవడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు మార్చిలో సమర్థించింది. కోర్టు ఆదేశాల మేరకు జూలై 7 నుంచి ఆయనకు శిక్ష అమలు చేస్తారు. అట్టడుగుస్థాయి నుంచి శిఖరాలను అధిరోహించిన రాజగోపాల్ శేషజీవితాన్ని జైలు ఊచల వెనుక గడపనున్నారు. -
శరవణభవన్ యజమానికి యావజ్జీవం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన హోటల్ శరవణభవన్ యజమాని రాజగోపాల్‌కు ఓ హత్య కేసులో సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. జూలై 7వ తేదీలోగా కోర్టులో లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. హోటల్ శరవణభవన్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే రామస్వామి కూతురు జీవజ్యోతి (20) అదే హోటల్‌కు చెందిన మరో బ్రాంచ్‌లో పనిచేసేది. చెన్నై వాసి ప్రిన్స్ శాంతకుమార్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు భార్యలున్న రాజగోపాల్ జీవజ్యోతిని ఎలాగైనా పెళ్లాడాలని ఆమె భర్త శాంతకుమార్‌ను కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు. దీంతో రాజగోపాల్ సహా 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన చెన్నై పూందమల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు రాజగోపాల్‌కు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ 2004లో తీర్పు చెప్పింది. తర్వాత నిందితులు మద్రాసు హైకోర్టుకు, తదనంతరకాలంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు మద్రాసు హైకోర్టు ఇచ్చిన యావజ్జీవశిక్షను సమర్ధించింది. శరవణభవన్ గ్రూప్‌నకు దేశ, విదేశాల్లో కలిపి 20 వరకు హోటళ్లున్నాయి. -
‘శరవణ’ యజమానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : పాపులర్ హోటల్ చైన్ శరవణ భవన్ యజమాని పీ రాజగోపాల్‌కు భారీ షాక్ తగిలింది. ఉద్యోగిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసులో నేరస్థులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది. అలాగే జులై 7వ తేదీలోపు రాజగోపాల్ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. దాదాపు 18ఏళ్ల తరువాత ఈ కేసులు తుది తీర్పు వెలువడింది. శరవణ భవన్ గ్రూపు ఉద్యోగి శాంతా కుమార్‌ని హత్యచేసిన కేసులో రాజగోపాల్ నిందితుడుగా విచారణను ఎదుర్కొన్నారు. ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన మద్రాస్ హైకోర్టు 2009లో అతనికి జీవిత ఖైదును విధించింది. దీనిపై రాజగోపాల్ సుప్రీంను ఆశ్రయించారు. అనారోగ్య కారణాలతో 2009లో అతనికి బెయిల్ మంజూరైంది. దీనిపై తుది విచారణ చేపట్టిన సుప్రీం శుక్రవారం తీర్పును వెలువరించింది. జస్టీస్ ఎన్వీ రామన్ నేతృత్వంలోని ధర్మాసనం రాజగోపాల్‌తోపాటు మొత్తం ఆరుగురు నేరస్థులకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. చెన్నైలోని శరవణ భవన్ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ కుమార్తె జీవజ్యోతిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్వేశాడు రాజ్‌గోపాల్. దీన్ని జ్యోతి గట్టిగా వ్యతిరేకించింది. అప్పటికే ఇద్దరు భార్యలున్న రాజగోపాల్ పన్నాగాన్ని గమనించిన జ్యోతి తండ్రికూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం 1999లో శరవణ గ్రూపులోనే పనిచేస్తున్నశాంతాకుమార్తో జ్యోతికి వివాహ జరిపించారు. అక్కడితో ఈ వివాదం ముగిసిపోతుందని భావించారు. కానీ రాజగోపాల్‌లోని మృగత్వం మరింత బుసలు కొట్టింది. తన వేధింపులపర్వాన్ని కొనసాగించాడు. భర్తతో విడిపోయి, తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తానంటూ బెదరింపులకు దిగాడు. దీంతో సహనం నశించిన జీవజ్యోతి, శాంతాకుమార్ దంపతులు పోలీస్ట్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరింత రెచ్చిపోయిన రాజగోపాల్ ఫిర్యాదు ఇచ్చిన కొద్ది రోజుల్లోనే (2001లో అక్టోబర్) ఎనిమిది మంది కిరాయి గుండాలతో శాంతాకుమార్‌ను కిడ్నాప్ చేసి హతం చేశాడు. కొడైకెనాల్ పెరుమాలమలై అడవుల్లో శాంతాకుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాగా దాదాపు 20 దేశాల్లో హోటళ్లను నిర్వహిస్తూ ప్రాచుర్యం పొందింది శరవణ భవన్ హోటల్ గ్రూపు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాల్లో తన వ్యాపారాన్ని విస్తరించింది. దేశీయంగా ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో 25 శాఖలున్నాయి. -
చెన్నై శరవాణా స్టోర్స్‌లో ఐటీ తనిఖీలు
-
'నా భార్యపై మున్సిపల్ ఛైర్మన్ అనైతిక ప్రవర్తన'
మున్సిపల్ ఛైర్మన్ పేట రాధారెడ్డి తన భార్య పట్ల అనైతికంగా ప్రవర్తించారని శ్రీకాళహస్తిలోని శరవణభవన్ హోటల్ యజమాని మనోహరన్ ఆరోపించారు. తమ హోటల్‌ను ఆయన లాక్కోవాలని చూస్తున్నట్లు మనోహరన్ దంపతులు తెలిపారు. తమకు వాస్తవానికి 30 ఏళ్ల లీజు ఒప్పందం ఉన్నా, ఇప్పటికిప్పుడే ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారని, తమ అనుచరులతో రాధారెడ్డి పదే పదే దాడులు చేయిస్తున్నారని మనోహరన్ వాపోయారు. మహిళ అని కూడా చూడకుండా తన భార్యపట్ల రాధారెడ్డి అనైతికంగా ప్రవర్తించాడని ఆయన ఆరోపించారు.