Sarbananda sonoval
-
బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాలి: సోనోవాల్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చేసిన సలహాలు, సూచనల మేరకు బీసీసీఐకి జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ అన్నారు. క్రికెట్ బోర్డును సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉందన్నారు. ‘బీసీసీఐ పబ్లిక్ బాడీ అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కాబట్టి కచ్చితంగా జవాబుదారీతనం ఉండాలి. రోజువారి కార్యకలాపాలను మరింత పారదర్శకంగా నిర్వహించాలి. అన్ని విషయాలు ప్రజలకు తెలిసేలా ఉండాలి’ అని సోనోవాల్ వ్యాఖ్యానించారు. -
మేమంతా... నీవెంటే
న్యూఢిల్లీ: బాక్సర్ సరితాదేవి సస్పెన్షన్‌పై పునరాలోచించాలని అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి (ఏఐబీఏ-ఐబా) భారత ప్రభుత్వం అప్పీల్ చేయనుంది. ఇటీవలి ఆసియా క్రీడల్లో తనకు లభించిన కాంస్య పతకాన్ని తీసుకోకుండా మరో బాక్సర్ మెడలో వేసినందుకు ఐబా ఆమెపై తాత్కాలికంగా వేటు వేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమెపై జీవితకాల నిషేధం విధించే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సరిత విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ పలువురు క్రీడాకారులు, అధికారులతో సమావేశమయ్యారు. ‘ఈ విషయంలో సరితకు ప్రభుత్వం అండగా ఉండడమే కాకుండా ఆమెకు కావల్సిన సహాయ సహకారాలు అందిస్తుంది. ఇప్పటిదాకా ఆమె తన విజయాలతో దేశం గర్వపడేలా చేసింది. అందుకే భారత ప్రభుత్వం తరఫున సస్పెన్షన్‌ను పునరాలోచించాలని ఐబాకు విజ్ఞప్తి చేస్తాం’ అని క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ సమావేశంలో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తేందూల్కర్, బాక్సర్లు మేరీకోమ్, విజేందర్ సింగ్, ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్, బాక్సింగ్ ఇండియా అధ్యక్షుడు సందీప్ జజోడియా, జాతీయ బాక్సింగ్ కోచ్ జీఎస్ సంధూ తదితరులు పాల్గొన్నారు. దేశం మొత్తం అండగా ఉండాలి: సచిన్ బాక్సర్ సరితా దేవికి ఈ కష్ట కాలంలో దేశం మొత్తం అండగా నిలవాలని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తేందూల్కర్ కోరాడు. క్రీడల మంత్రితో సమావేశం అనంతరం సచిన్ విలేకరులతో మాట్లాడాడు. ‘సరితా దేవి ఉదంతం గురించే ఈ సమావేశం జరిగింది. ఆమె విషయంలో ఎలా ముందుకెళ్లాలి.. ఐబాతో ఏం చెప్పాలి.. అని మేం చర్చించాం. ఓ క్రీడాకారుడిగా ఆమె బాధ నాకు తెలుసు. పరిస్థితులు అనుకూలించనప్పుడు ఒక్కో వ్యక్తి ఒక్కోలా స్పందిస్తుంటాడు. ఐబా కచ్చితంగా ఆమె కేసును మరోసారి పరిశీలించాలి. ఇప్పటికే తను క్షమాపణలు చెప్పింది. ఈ సమయంలో దేశం యావత్తూ ఆమెకు మద్దతుగా నిలవాలి’ అని సచిన్ కోరాడు. మరోవైపు ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఐబా తమ నిబంధనల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ అభిప్రాయపడ్డాడు. -
సరితకు బీఐ సాయం చేస్తుంది: సోనోవాల్
న్యూఢిల్లీ: తాత్కాలిక నిషేధం ఎదుర్కొంటున్న భారత బాక్సర్ ఎల్. సరితా దేవికి బాక్సింగ్ ఇండియా (బీఐ) అన్ని రకాలుగా సాయం అందిస్తుందని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ పార్లమెంట్లో వెల్లడించారు. నలుగురు ఎంపీలు నాగరాజన్, బోలా సింగ్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కపిల్ మోరేశ్వర్ పాటిల్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి మంగళవారం సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ఏఐబీఏ ఇచ్చిన నోటీసుకు సరిత వివరణ ఇచ్చింది. అక్టోబర్ 27న క్రీడల కార్యదర్శి సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి ఐఓఏ, బీఐ ప్రతినిధులు హాజరయ్యారు. వీరందరూ బాక్సర్‌పై నిషేధం తొలగించేలా చర్యలు చేపడుతున్నారు. కోచ్, ప్లేయర్లపై విధించే నిషేధం విషయంలో వారికి బీఐ చట్టపరమైన సాయం చేస్తుంది’ అని మంత్రి పేర్కొన్నారు. అర్జున అవార్డులపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా జరిగేందుకు సభ్యులు ఇచ్చే సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. సరితపై నిషేధం ఎత్తివేయించేందుకు ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ కేసును పరిశీలించేందుకు బీఐ, ఐఓఏ అధికారులతో పాటు కొంత మంది ప్రఖ్యాత క్రీడాకారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి తాను కూడా హాజరవుతానన్నారు. ఈ కేసు విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తెస్తామన్నారు. మరోవైపు కోర్టు పరిధిలో ఉన్న ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుపై మాట్లాడేందుకు నిరాకరించిన మంత్రి దోషులకు శిక్ష పడాలని మాత్రం చెప్పారు. -
బీసీసీఐని స్వాధీనం చేసుకోం
- ఆర్టీఐ పరిధిలోకి తెస్తాం - క్రీడల మంత్రి సోనోవాల్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)ని స్వాధీనం చేసుకునే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని కేంద్ర క్రీడల మంత్రి సర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. అయితే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి పైవిధంగా సమాధానమిచ్చారు. ‘బీసీసీఐ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. సొసైటీస్ చట్టం కింద దాన్ని రిజస్టర్ చేశారు. కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకొని రోజువారి కార్యకలాపాలు నిర్వహించలేం’ అని సోనోవాల్ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. బీసీసీఐని చుట్టుముడుతున్న వివాదాల (ఫ్రాంచైజీల కేటాయింపులు, మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్)పై తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ విభాగాలు వీటిపై విచారణ జరుపుతున్నాయని చెప్పారు. వీలైనంత త్వరగా బీసీసీఐతో సహా అన్ని క్రీడా సమాఖ్యలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావడంపై తమ మంత్రిత్వ శాఖ దృష్టిపెట్టిందన్నారు. ఈ మేరకు జాతీయ క్రీడాబిల్లు ముసాయిదాను రూపొందించామని తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లాంటి అంశాలను నిరోధించేందుకు అవసరమైన చట్టాలను తీసుకొస్తామని వెల్లడించిన మంత్రి జాతీయ క్రీడా సమాఖ్యలు పారదర్శకంగా పని చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.