సరితకు బీఐ సాయం చేస్తుంది: సోనోవాల్
న్యూఢిల్లీ: తాత్కాలిక నిషేధం ఎదుర్కొంటున్న భారత బాక్సర్ ఎల్. సరితా దేవికి బాక్సింగ్ ఇండియా (బీఐ) అన్ని రకాలుగా సాయం అందిస్తుందని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ పార్లమెంట్‌లో వెల్లడించారు. నలుగురు ఎంపీలు నాగరాజన్, బోలా సింగ్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కపిల్ మోరేశ్వర్ పాటిల్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి మంగళవారం సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ఏఐబీఏ ఇచ్చిన నోటీసుకు సరిత వివరణ ఇచ్చింది. అక్టోబర్ 27న క్రీడల కార్యదర్శి సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి ఐఓఏ, బీఐ ప్రతినిధులు హాజరయ్యారు.
వీరందరూ బాక్సర్‌పై నిషేధం తొలగించేలా చర్యలు చేపడుతున్నారు. కోచ్, ప్లేయర్లపై విధించే నిషేధం విషయంలో వారికి బీఐ చట్టపరమైన సాయం చేస్తుంది’ అని మంత్రి పేర్కొన్నారు. అర్జున అవార్డులపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా జరిగేందుకు సభ్యులు ఇచ్చే సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. సరితపై నిషేధం ఎత్తివేయించేందుకు ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
ఈ కేసును పరిశీలించేందుకు బీఐ, ఐఓఏ అధికారులతో పాటు కొంత మంది ప్రఖ్యాత క్రీడాకారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి తాను కూడా హాజరవుతానన్నారు. ఈ కేసు విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తెస్తామన్నారు. మరోవైపు కోర్టు పరిధిలో ఉన్న ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుపై మాట్లాడేందుకు నిరాకరించిన మంత్రి దోషులకు శిక్ష పడాలని మాత్రం చెప్పారు.