బీసీసీఐని స్వాధీనం చేసుకోం
- ఆర్‌టీఐ పరిధిలోకి తెస్తాం
- క్రీడల మంత్రి సోనోవాల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)ని స్వాధీనం చేసుకునే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని కేంద్ర క్రీడల మంత్రి సర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. అయితే సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి పైవిధంగా సమాధానమిచ్చారు. ‘బీసీసీఐ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. సొసైటీస్ చట్టం కింద దాన్ని రిజస్టర్ చేశారు. కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకొని రోజువారి కార్యకలాపాలు నిర్వహించలేం’ అని సోనోవాల్ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. బీసీసీఐని చుట్టుముడుతున్న వివాదాల (ఫ్రాంచైజీల కేటాయింపులు, మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్)పై తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, ఇన్‌కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ విభాగాలు వీటిపై విచారణ జరుపుతున్నాయని చెప్పారు. వీలైనంత త్వరగా బీసీసీఐతో సహా అన్ని క్రీడా సమాఖ్యలను ఆర్‌టీఐ పరిధిలోకి తీసుకురావడంపై తమ మంత్రిత్వ శాఖ దృష్టిపెట్టిందన్నారు. ఈ మేరకు జాతీయ క్రీడాబిల్లు ముసాయిదాను రూపొందించామని తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లాంటి అంశాలను నిరోధించేందుకు అవసరమైన చట్టాలను తీసుకొస్తామని వెల్లడించిన మంత్రి జాతీయ క్రీడా సమాఖ్యలు పారదర్శకంగా పని చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.