Union Sports Minister
-
‘అర్జున’ అందుకున్న ఇషా
సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళా షూటింగ్ రైజింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను బుధవారం అందుకుంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును ఇషా సింగ్‌కు బహూకరించారు. ఈనెల 9న రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అయితే అదే సమయంలో ఇషా జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతుండటంతో ఆమె హాజరుకాలేకపోయింది. ఇషాకు ‘అర్జున’ అందించిన అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇషా పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. -
అతనికి ఎదురు నిలబడటం కష్టం! కేంద్ర క్రీడా మంత్రిపై ఆరోపణలు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత్ రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత ఏస్ రెజ్లర్ వినేష్ ఫోగట్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న శక్తిమంతమైన వ్యక్తికి చాలా కాలం పాటు వ్యతిరేకంగా నిలబడటం చాలా కష్టం అన్నారు. తాము నిరసన ప్రారంభించడానికి మూడు, నాలుగు నెలల ముందు ఆ అధికారిని కలిశామని చెప్పారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మహిళా అథ్లెట్లు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆవేదనకు గురవుతున్నామని ఆ అధికారికి వివరించి చెప్పామన్నారు. ఆ తర్వాత తాము నిరసనకు దిగిమని వెల్లడించింది వినేష్. ఈనేపథ్యంలోనే కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాగూర్‌పై ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు వినేష్. కమిటీ వేసి విషయాన్ని అణిచివేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. మేము ఆయనతో మాట్లాడాకే నిరసనకు దిగినట్లు చెప్పారు. ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా రెజ్లర్ బజరంగ్ పునియా ఒలింపిక్స్ ఎంపికకు సంబంధించిన కొత్త నిబంధన విషయమై నిసనలు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఒలింపిక్స్ గురించి కాదని తాము లైంగిక వేధింపులకు వ్యతిరేకంగానే నిరసన చేస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాత్రం తాను రాజీనామా చేస్తే ఆరోపణలను అంగీకరించినట్లువుతుందన్నారు. అందుకు స్పందించిన వినేష్ ఫోగట్ తమకు కావాల్సింది న్యాయం అన్నారు. అతేగాదు మా మన్ కీ బాత్ వినండి మోదీ అని వినేష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆఖరికి స్మృతి ఇరానీ కూడా మా గోడు వినడం లేదని ఆవేదనగా చెప్పారు. కాగా, ఇప్పటికే ఈ విషయమై బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: "న్యాయం మీ అంగీకారం కోసం వేచి ఉంది!": ప్రియాంక గాంధీ) -
‘టాప్స్’ కొనసాగిస్తాం: అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: విశ్వ క్రీడల్లో పతక విజేతలను తయారు చేసేందుకు ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్’ (టాప్స్)ను కొనసాగిస్తామని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. 2024–పారిస్, 2028–లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల వరకు ‘టాప్స్’ను పొడిగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారత ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో టోక్యో పతక విజేతలకు అనురాగ్ ఠాకూర్ ప్రోత్సాహకాలు అందజేశారు. ఐఓఏ స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు రూ. 75 లక్షలు, ‘రజత’ విజేతలు మీరాబాయి, రవి లకు రూ. 50 లక్షలు చొప్పున, కాంస్యాలు గెలిచిన సింధు, లవ్లీనా, బజరంగ్‌లకు రూ. 25 లక్షలు చొప్పున, హాకీ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలిచిన జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున బహూకరించారు. -
పతకాల సంఖ్య రెండంకెలు దాటుతుంది
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు గతంలో ఎన్నడూలేని విధంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఆకాంక్షించారు. టోక్యో ఒలింపిక్స్ కౌంట్‌డౌన్ బుధవారంతో 100 రోజులకు చేరింది. ఈ సందర్భంగా జరిగిన వర్చువల్ వెబీనార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఈసారి జరిగే ఒలింపిక్స్ భారత చరిత్రలో ఒక తీపి గుర్తు కావాలనుకుంటున్నాం. అందుకోసం మంత్రి త్వ శాఖ తరఫున చేయాల్సిందంతా చేశాం. ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న క్రీడాకారులకు సకల సదుపాయాలను కల్పించాం. ఇప్పడంతా మీ (అథ్లెట్లు) చేతుల్లోనే ఉంది. రెండంకెల్లో పతకాలను సాధిస్తారని ఆశిస్తున్నాను’ అని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. ఓవరాల్‌గా ఒలింపిక్స్ చరిత్రలో భారత అత్యుత్తమ ప్రదర్శన 2012 లండన్ ఒలింపిక్స్‌లో వచ్చింది. లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యధికంగా ఆరు పతకాలు (రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు) లభించాయి. -
‘నీ పని చూసుకో’...
న్యూఢిల్లీ: సినీ నటి తాప్సీపై జరుగుతున్న ఆదాయపు పన్ను దాడులకు సంబంధించి స్పంది స్తూ సహాయం కోరిన ఆమె స్నేహితుడు, భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ మథియాస్ బో (డెన్మార్క్)ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మందలించారు. ఇతర విషయాలపై కాకుండా కోచ్‌గా తన బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు. తాప్సీ తదితరులపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో గురువారం ఆమెకు మద్దతుగా మథియాస్ బో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతను స్విస్ ఓపెన్‌లో పాల్గొంటున్న జట్టుతోపాటు స్విట్జర్లాండ్‌లో ఉన్నాడు. ‘నా పరిస్థితి గందరగోళంగా ఉంది. తొలిసారి భారత జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అయితే స్వదేశంలో తాప్సీ ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులు ఆమె తల్లిదండ్రులు, కుటుంబంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. కిరణ్ రిజిజు... ఏదైనా చేయగలరా’ అని అతను రాశాడు. దీనిపై మంత్రి శుక్రవారం స్పందిస్తూ కొంత ఘాటుగానే జవాబిచ్చారు. ‘అన్నింటికంటే దేశ చట్టాలు సర్వోన్నతమైనవి. వాటిని మనందరం పాటించాలి. తాజా అంశం మనిద్దరి పరిధిలో లేనిది. మన ఉద్యోగ బాధ్యతలకే మనం కట్టుబడి ఉండాలి. అది భారత క్రీడారంగానికి మేలు చేస్తుంది’ అని రిజిజు ట్వీట్ చేయడం విశేషం. డెన్మార్క్‌కు చెందిన 40 ఏళ్ల మథియాస్ బో 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో రజతం సాధించాడు. పీబీఎల్‌లో పుణే ఏసెస్ జట్టుకు ఆడిన నాటి నుంచి ఆ టీమ్ యజమాని తాప్సీతో మథియాస్‌కు సాన్నిహిత్యం ఉంది. -
సింధు ట్వీట్ స్మాష్
న్యూఢిల్లీ: ఒక్క ట్వీట్‌తో భారత క్రీడాభిమానులకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ‘డెన్మార్క్ ఓపెన్ నా చివరి టోర్నీ. నేను రిటైరయ్యా’ అని సింధు చేసిన ట్వీట్‌తో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ ట్వీట్‌తో పాటు కోవిడ్–19 స్థితిగతులు, దాని ప్రభావంపై ఆమె సుదీర్ఘ ప్రకటన చేసింది. దీంతో కరోనా నేపథ్యంలో నిజంగానే ఆమె ఆటకు దూరంగా వెళ్తుందేమోనని అందరూ బోల్తా పడ్డారు. కానీ ట్వీట్ చివర్లో నెగెటివిటీ, అనవసరపు విశ్రాంతి, భయం నుంచి తాను రిటైర్ అవుతున్నానని ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంత కాలంగా అనవసరపు అనిశ్చితితో బాధపడుతున్నానని, ఇక దానికి స్వస్తి పలుకుతానంటూ ఆమె ట్వీట్‌ను మొదలుపెట్టింది. ‘ఆటలో ఇన్నాళ్లూ పోరాడాను. కానీ కంటికి కనిపించని ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియట్లేదు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఎన్నో కథనాలు చదువుతూ ఇంటి నుంచి అడుగు బయటపెట్టేందుకు ఆలోచించా. కానీ ఈ అనిశ్చితి నుంచి రిటైరవ్వాలని నిర్ణయించుకున్నా. భయం, నెగెటివిటీ, అవాస్తవికతకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. పోరాడకుండా నేనెప్పుడూ ఓటమి ఒప్పుకోను. భారత్‌కు ప్రాతినిధ్యం వహించకుండా ఉండటం డెన్మార్క్ ఓపెన్‌తోనే ముగిస్తున్నా’ అని ఇకపై ఆడతాననే తన అభిలాషను సింధు విశ్లేషణాత్మకంగా వివరించింది. దీనిపై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘సింధు! నాకు మినీ షాక్ ఇచ్చావ్. కానీ నాకు నీ అకుంఠిత దీక్ష, సంకల్పంపై పూర్తి నమ్మకం ఉంది. దేశానికి ఇంకా ఎన్నో పురస్కారాలు అందిస్తావనే విశ్వాసం ఉంది’ అని రిజిజు ట్వీట్ చేశారు. -
నిధులు విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తాము గతంలో కోరిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజికు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. మొత్తం రూ. 218.67 కోట్ల మంజూరు గురించి ప్రతిపాదనలు పంపామని... కానీ వాటికి స్పందన రాలేదని ఆయన అన్నారు. మంగళవారం దక్షిణాది రాష్ట్రాల క్రీడా మంత్రులతో కిరణ్ రిజిజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్... గత రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి కూడా తమకు నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం తెలంగాణ రాష్ట్రం తరఫున ఆరు క్రీడల పేర్లను ప్రతిపాదిస్తే మూడింటికి అనుమతి వచ్చిందని, మిగతా వాటిపై కూడా దృష్టి సారించాలన్న మంత్రి... కరోనా తీవ్రత తగ్గిన తర్వాతే రాష్ట్రంలో ఆటలకు అనుమతినిస్తామని వివరించారు. -
బాధ్యతలు తీసుకున్న గోయెల్
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా విజయ్ గోయెల్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గోయెల్‌కు క్రీడా మంత్రిత్వశాఖను కేటాయించారు. ఈయన వాజ్‌పేయి హయాంలోనూ క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. రియోలో భారతీయ భోజనం భారత ఆటగాళ్ల కోరిక మేరకు రియోలో అథ్లెట్లందరికీ భారతీయ వంటకాలను అందిస్తారని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘రియో గేమ్స్ అధికారిక ఫుడ్ మెనూలో భారతీయ వంటకాలను భాగం చేసినట్లు రియో ఒలింపిక్స్ ఆర్గనైజర్స్ నుంచి స్పష్టత వచ్చింది. ఈ మెగా ఈవెంట్ పూర్తయ్యేవరకు క్రీడా గ్రామంలో భారతీయ భోజనం అందుబాటులో ఉంటుంది’ అని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ యాదవ్ స్పష్టం చేశారు. -
బీసీసీఐని స్వాధీనం చేసుకోం
- ఆర్టీఐ పరిధిలోకి తెస్తాం - క్రీడల మంత్రి సోనోవాల్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)ని స్వాధీనం చేసుకునే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని కేంద్ర క్రీడల మంత్రి సర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. అయితే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి పైవిధంగా సమాధానమిచ్చారు. ‘బీసీసీఐ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. సొసైటీస్ చట్టం కింద దాన్ని రిజస్టర్ చేశారు. కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకొని రోజువారి కార్యకలాపాలు నిర్వహించలేం’ అని సోనోవాల్ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. బీసీసీఐని చుట్టుముడుతున్న వివాదాల (ఫ్రాంచైజీల కేటాయింపులు, మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్)పై తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ విభాగాలు వీటిపై విచారణ జరుపుతున్నాయని చెప్పారు. వీలైనంత త్వరగా బీసీసీఐతో సహా అన్ని క్రీడా సమాఖ్యలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావడంపై తమ మంత్రిత్వ శాఖ దృష్టిపెట్టిందన్నారు. ఈ మేరకు జాతీయ క్రీడాబిల్లు ముసాయిదాను రూపొందించామని తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లాంటి అంశాలను నిరోధించేందుకు అవసరమైన చట్టాలను తీసుకొస్తామని వెల్లడించిన మంత్రి జాతీయ క్రీడా సమాఖ్యలు పారదర్శకంగా పని చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.