చీరల దొంగకు.. ఇలాంటి శిక్షా?
న్యూఢిల్లీ: చీరలు చోరీ చేసిన వ్యక్తిని బంధిపోటుగా (దోపిడీదారుడిగా) చూడటమేంటని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఐదు చీరలు చోరీ చేసిన వ్యక్తిపై పీడీ యాక్ట్ ప్రయోగించడంపై చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహర్ అశ్చర్యానికి లోనైనట్లు తెలిపారు. దోపిడీదారులు, డ్రగ్స్ మాఫియా నిందితులను చూసినట్లుగా సాధారణ కేసులో నిందితుడికి ఏడాదిపాటు జైలుశిక్ష విధించడంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్ను ఆదేశించింది. ఇలాగైతే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తూ పోతారని ఆ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వడానికి రెండు వారాల సమయం ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదుకాని వ్యక్తిని అరెస్ట్ చేసి నిర్బంధించడం ఎంతమేరకు సమంజసమని.. ఇందులో రాజకీయ కోణమేదైనా దాగి ఉందా అని అడ్వైజరీ బోర్డును వివరణ కోరారు.
సీహెచ్ ఎల్లయ్య అనే వ్యక్తిని గతేడాది మార్చి 19న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పీడీ యాక్ట్-1986 ప్రకారం.. అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. తెలంగాణ కౌన్సిల్ ప్రకారం.. ఎల్లయ్య ఆరు నెలల వ్యవధిలో మూడు పర్యాయాలు ఇలాంటి చోరీలకు పాల్పడ్డాడు. రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలోని తెలంగాణ అడ్వైజరీ బోర్డు నిర్ణయం మేరకు ఎల్లయ్యను అరెస్ట్ చేశారు. రాష్ట్ర బోర్డు నిర్ణయంపై విచారణ జరిపించాలని బాధితుడు ఎల్లయ్య హైకోర్టును ఆశ్రయించగా నిరాశే ఎదురైంది. బోర్డు నిర్ణయంపై జోక్యం చేసుకోలేమని తేల్చేసింది. భార్య సాయంతో న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఎల్లయ్య పేరు మీదుగా ఒక్క కేసులోనూ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదనీ, చోరీకి పాల్పడ్డడని చెప్పేందుకు సాక్షులేవరూ లేరని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తించింది.