sarojadevi
-
చిటపట చినుకులు పాట పాడుతుంటారు
‘‘నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే..’ పాట పాడుతూ ఉంటారు. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నేను యన్టీఆర్‌ను అన్నయ్యా అంటాను. ఆ సంభాషణను గుర్తుచేసి మళ్లీ మళ్లీ ఆ డైలాగులు చెప్పమని అడుగుతుంటారు. మరోసారి ఈ విషయాలను గుర్తు చేసుకోవటం ఆనందంగా ఉంది అన్నారు’’ ప్రముఖ నటి బి.సరోజాదేవి. ఆమెకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘విశ్వనట సామ్రాజ్ఙి’ బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సరోజాదేవి మాట్లాడుతూ– ‘‘సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవటం ఆనందంగా ఉంది’’ అన్నారు. టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకున్న నటి సరోజాదేవి. ఆమెకి తెలుగు ప్రజల తరఫున ప్రదానం చేసిన బిరుదు ఇది’’ అన్నారు. ఈ వేడుకలో ప్రముఖ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు. -
విశ్వనటసామ్రాజ్ఞి
అద్భుతమైన అభినయ ప్రతిభతో జాతీయ స్థాయి నటిగా పేరు సంపాదించుకున్నారు బి. సరోజాదేవి. ఆమెను ‘పద్మశ్రీ, పద్మభూషణ్’ అవార్డులు వరించాయి. తాజాగా ‘విశ్వనటసామ్రాజ్ఞి’ అనే బిరుదును ఆమె అందుకోబోతున్నారు. విశాఖ రామకృష్ణ బీచ్‌లో టీఎస్సార్ లలితా కళాపరిషత్ ఆధ్వర్యంలో ఆమె ఈ అవార్డును స్వీకరించనున్నారు. మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో వైభవంగా జరిగే ఈ వేడుకలో బి. సరోజాదేవికి ‘విశ్వనటసామ్రాజ్ఞి’ అనే బిరుదును ప్రదానం చేయనున్నట్లు కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు. సాలూరి వాసూరావు సంగీత విభావరి ఉంటుంది. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్, నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, మీనా, ప్రముఖ గాయని పి. సుశీలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినాన్ని టి. సుబ్బరామిరెడ్డి వైజాగ్‌లో జరుపుతుంటారు. పాతికేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. -
బి.సరోజాదేవికి ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం
అలనాటి అందాల నటి బి.సరోజాదేవిని టీఎస్ఆర్ లలితకళాపరిషత్ ‘విశ్వనట సామ్రాజ్ఞి' బిరుదు తో సత్కరించనుంది. కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి మార్చి 4 మహాశివరాత్రి సందర్భంగా విశాఖలో లో వైభవంగా జరిగే వేడుక లో ఈ బిరుదును ప్రదానం చేయనున్నట్టుగా తెలిపారు. విశాఖ రామకృష్ణా బీచ్ లో మార్చి 4 సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజలచేతనే కోటి శివలింగాల ప్రతిష్ఠాపన, మహాకుంభాభిషేకం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గత పాతికేళ్ల ఈ కార్యక్రమాలను టీఎస్సార్ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మిస్తున్న బి.సరోజాదేవి సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, సుమన్, మీనా, గాయని పి.సుశీల పాల్గొననున్నారు. కన్నడ నాట జన్మించిన బి.సరోజాదేవి, తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమా ద్వారా బి.సరోజాదేవిని తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ సరసన సీతారామకళ్యాణం, జగదేకవీరుని కథ, దానవీరశూర కర్ణ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావుతోనూ పెళ్ళికానుక, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న లాంటి సినిమాలో అలరించారు. తెలుగునాటనే కాకుండా, మాతృభాష కన్నడలోనూ, తమిళ, మళయాళ, హిందీ భాషల్లోనూ సరోజాదేవి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను సైతం అందుకున్నారు. -
34 ఏళ్ల తర్వాత
తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో ఒకప్పుడు వెండితెరను ఏలిక నాయిక బి. సరోజా దేవి. తమిళ, కన్నడ భాషలతో పోల్చితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ కూడా బాగా ఫేమస్. ఇప్పుడామె తొమ్మిదేళ్ల తర్వాత కెమెరా ముందుకు వస్తున్నారు. 2009లో సూర్య నటించిన ‘ఆదవన్’లో కీలక పాత్ర చేశారామె. ఇప్పుడు కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా పవన్ వడియార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నటసార్వభౌమ’ చిత్రంలో ఈ సీనియర్ నటి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. దాదాపు 34 ఏళ్ల తర్వాత సరోజా దేవి, పునీత్ రాజ్‌కుమార్ సిల్వర్ స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారు. సరోజా దేవి కథానాయికగా నటించిన ‘యారివాను’లో పునీత్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు. కన్నడ కంఠీరవ, పునీత్ తండ్రి రాజ్‌కుమార్ సరసన సరోజా దేవి కథనాయిక పలు చిత్రాల్లో నటించడం విశేషం. ఆ సంగతలా ఉంచితే అప్పట్లో సరోజా దేవి సినిమాలో పునీత్ బాల నటుడిగా నటిస్తే, ఇప్పుడు అతను హీరోగా నటిస్తోన్న సినిమాలో ఆమె కీలక పాత్ర చేయడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. -
కొత్త గెటప్ గురూ
కొత్త గెటప్‌లో కనిపించేందుకు రెడీ అవుతున్నారు కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. ఎందుకంటే ఆయన హీరోగా నటించనున్న కొత్త సినిమా కోసం. పవన్ వడియార్ దర్శకత్వంలో రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పునీత్ రాజ్‌కుమార్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అలనాటి కన్నడ స్టార్ సరోజా దేవి కీలక పాత్రలో కనిపించనున్నారట. పునీత్ తండ్రి రాజ్‌కుమార్ సరసన హిట్ మూవీస్‌లో నటించారు సరోజా దేవి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు స్కోప్ ఉండగా, ప్రియాంక జవాల్కర్‌ను ఒక హీరోయిన్గా తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తుదంట. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన ‘టాక్సీవాలా’ చిత్రంలో ప్రియాంకనే కథానాయిక అన్న విషయం తెలిసిందే. -
'ఆయన మై ఫెవరేట్ హీరో....'
తిరుమల : అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన 'ఆత్మబలం'లోని చిటపట చినుకులు పడుతూ ఉంటే... పాట ఎన్నటికీ మరువలేనని అలనాటి సినీనటి సరోజాదేవి అన్నారు. బుధవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సరోజాదేవి మీడియాతో మాట్లాడుతూ 'ఆంధ్రాకు రాగానే నాగేశ్వరరావు గుర్తొచ్చారు. ఆయన మై ఫెవరేట్ హీరో. హాయ్ హీరోయిన్ ఎలా ఉన్నావ్ అని నాగేశ్వరరావు నన్ను అడిగేవారు' అని తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అలాగే ఎన్టీ రామారావు కూడా తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. తెలుగులో నటించిన ప్రతి సినిమా హిట్ అయిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనతోపాటు సినిమాల్లో నటించిన నటీనటులను మిస్సయ్యాను అనే ఫీలింగ్ వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరువాత మనస్సుకు సంతృప్తిగా ఉందని తెలిపారు.