sarvasiksha Abhian officials
-
నిధులున్నాయ్.. నిర్మాణాలే సాగవు
సాక్షి, హైదరాబాద్: మండల వనరుల కేంద్రం (ఎంఆర్సీ) నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. భవనాలకు స్థలాలు, నిధులు విడుదల చేసినప్పటికీ వాటిని నిర్మించడంలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో నాలుగేళ్లుగా వాటి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సర్వశిక్షా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 96 మండలాలకు ఎంఆర్సీ భవనాలు మంజూరు చేసింది. ఒక్కో భవనాన్ని రూ.30 లక్షల వ్యయంతో నిర్మించాలని ఆదేశించింది. మండల వనరుల కేంద్రాల్లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మండల స్థాయి సమావేశాలు, విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో విద్యాశాఖకు కీలకంగా ఉపయోగపడనున్నాయని భావించిన ప్రభుత్వం 96 ఎంఆర్‌సీలను మంజూరు చేసింది. ఇందుకు రూ.30 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలో టెండర్లు పిలిచిన అధికారులు కాంట్రాక్టర్లను ఎంపిక చేసి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇవి మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు పునాదులు దాటలేదు. ఎంఆర్సీ నిర్మాణాలను గరిష్టంగా ఏడాది లోపు నిర్మించాలి. ఈమేరకు కాంట్రాక్టర్లకు నిబంధనలు విధించాయి. కానీ కాంట్రాక్టర్లు నిర్మాణ బాధ్యతలు తీసుకుని ఏడాది దాటినా వాటిని పూర్తి చేయలేదు. నిబంధనలు పాటించని క్రమంలో కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. కొత్తవి జాడేలేదు... సర్వశిక్షా అభియాన్ స్థానంలో కొత్తగా సమగ్ర శిక్షా అభియాన్ ఏర్పాటైంది. ఈక్రమంలో గత రికార్డులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, వాటి పురోగతి ఆధారంగా కొత్త నిర్మాణాలను ఆమోదిస్తోంది. ఈక్రమంలో నాలుగేళ్లనాటి పనులే పూర్తికాకపోవడంతో రాష్ట్రానికి కొత్తగా ఎంఆర్‌సీలను మంజూరు చేయలేదు. వాస్తవానికి కొత్త మండలాలతో కలుపుకుని రాష్ట్రంలో దాదాపు 2వందల ఎంఆర్సీలు అవసరముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కొత్తవాటికి ప్రతిపాదనలు పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయలేదు. దీంతో ఇప్పటికే మంజూరైన వాటిని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించిన అధికారులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. -
పాఠశాలల నిధులకు ఎసరు!
సాక్షి అమరావతి: పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రూ.75.78 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖాతాలోకి మళ్లించింది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ), క్లస్టర్ రిసోర్స్ సెంటర్(సీఎంసీ) ఖాతాలను ఖాళీ చేయించింది. ఈ మేరకు సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు పంపించారు. స్కూళ్లలో చాక్‌పీస్‌లు, డస్టర్లు, ఇతర ఉపకరణాల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ కమిటీలకు సర్వ శిక్షా అభియాన్ ద్వారా నిధులు అందిస్తూ ఉంటుంది. క్లస్టర్ రిసోర్స్ సెంటర్లకు కూడా నిధులిస్తుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖాతాలోకి మళ్లించడంతో పాఠశాలల్లో బోధనాభ్యసన ప్రక్రియకు ఆటంకం కలుగుతోంది. క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ సెంటర్లకు సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించడంతో టీచర్ల శిక్షణా కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. నిధులను తీసుకోవడం దుర్మార్గం ప్రభుత్వ స్కూళ్లకు సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా నిధులు కేటాయిస్తారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకోవడంతో కనీసం చాక్‌పీస్‌లు కూడా కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది. స్కూళ్ల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన సొమ్మును ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకోవడం దుర్మార్గం. దీనిపై పునరాలోచించాలి. – రామశేషయ్య, యూటీఎఫ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిధులివ్వకపోతే బోధన ఎలా సాగించాలి? రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల ఎస్ఎంసీ ఖాతాల్లో బ్యాలెన్స్ జీరోకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 61,529 పాఠశాలలకు చెందిన ఎస్ఎంసీ ఖాతాల్లో ఉన్న రూ.75.78 కోట్ల గ్రాంట్లు, నిర్వహణ నిధులను ప్రభుత్వం తీసేసుకుంది. వాస్తవానికి నవంబరు నుంచి పాఠశాలల స్కావెంజర్స్‌కు జీతాలు ఇవ్వలేదు. ప్రతినెలా కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాలో నిధులు లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తమ జేబు నుంచి కరెంటు బిల్లులు చెల్లించడంతోపాటు డస్టర్లు, చాక్‌పీస్‌లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. బ్యాంకు నిబంధనల ప్రకారం ఖాతాలో కనీస నిల్వ(బ్యాలెన్స్) కొనసాగించాల్సి ఉంటుంది. దీన్ని కూడా పక్కనపెట్టి ఎస్ఎంసీ ఖాతాను ప్రభుత్వం ఖాళీ చేయడం గమనార్హం. ప్రధానోపాధ్యాయులకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం కొత్త నిధులు ఇవ్వకపోగా, ఉన్న నిధులనే మింగేస్తే పాఠశాలలల్లో బోధన ఎలా సాగించాలని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎస్ఎంసీ ఖాతాల్లో ఉన్న నిల్వలను రాష్ట్ర సర్కారు వెనక్కి తీసుకోవడం సరైంది కాదని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు పేర్కొన్నారు. -
మంత్రి సేవలో తరించిన అధికారులకు నోటీసులు!
తిరుపతి: మంత్రి గంటా శ్రీనివాస రావు సేవలో తరించిన ప్రభుత్వ అధికారులకు ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. మంత్రిని చూసేసరికి సర్వశిక్ష అభియాన్ అధికారులకు ఏమీ గుర్తుకు రాలేదు. ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేశారు. ఎన్నికల సంఘం చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది. వారికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన సర్వశిక్ష అభియాన్ పీడీ లక్ష్మి, ఇన్చార్జి డీఈఓ శ్యామ్యూల్లకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.