సాక్షి అమరావతి: పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రూ.75.78 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖాతాలోకి మళ్లించింది. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ(ఎస్‌ఎంసీ), క్లస్టర్ రిసోర్స్ సెంటర్(సీఎంసీ) ఖాతాలను ఖాళీ చేయించింది. ఈ మేరకు సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు పంపించారు.
స్కూళ్లలో చాక్‌పీస్‌లు, డస్టర్లు, ఇతర ఉపకరణాల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం మేనేజ్‌మెంట్ కమిటీలకు సర్వ శిక్షా అభియాన్ ద్వారా నిధులు అందిస్తూ ఉంటుంది. క్లస్టర్ రిసోర్స్ సెంటర్లకు కూడా నిధులిస్తుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖాతాలోకి మళ్లించడంతో పాఠశాలల్లో బోధనాభ్యసన ప్రక్రియకు ఆటంకం కలుగుతోంది. క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ సెంటర్లకు సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించడంతో టీచర్ల శిక్షణా కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేకుండా పోయింది.
నిధులను తీసుకోవడం దుర్మార్గం
ప్రభుత్వ స్కూళ్లకు సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా నిధులు కేటాయిస్తారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకోవడంతో కనీసం చాక్‌పీస్‌లు కూడా కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది. స్కూళ్ల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన సొమ్మును ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకోవడం దుర్మార్గం. దీనిపై పునరాలోచించాలి. – రామశేషయ్య, యూటీఎఫ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
నిధులివ్వకపోతే బోధన ఎలా సాగించాలి?
రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల ఎస్‌ఎంసీ ఖాతాల్లో బ్యాలెన్స్ జీరోకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 61,529 పాఠశాలలకు చెందిన ఎస్‌ఎంసీ ఖాతాల్లో ఉన్న రూ.75.78 కోట్ల గ్రాంట్లు, నిర్వహణ నిధులను ప్రభుత్వం తీసేసుకుంది. వాస్తవానికి నవంబరు నుంచి పాఠశాలల స్కావెంజర్స్‌కు జీతాలు ఇవ్వలేదు. ప్రతినెలా కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాలో నిధులు లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తమ జేబు నుంచి కరెంటు బిల్లులు చెల్లించడంతోపాటు డస్టర్లు, చాక్‌పీస్‌లు కొనుగోలు చేయాల్సి వస్తోంది.
బ్యాంకు నిబంధనల ప్రకారం ఖాతాలో కనీస నిల్వ(బ్యాలెన్స్) కొనసాగించాల్సి ఉంటుంది. దీన్ని కూడా పక్కనపెట్టి ఎస్‌ఎంసీ ఖాతాను ప్రభుత్వం ఖాళీ చేయడం గమనార్హం. ప్రధానోపాధ్యాయులకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం కొత్త నిధులు ఇవ్వకపోగా, ఉన్న నిధులనే మింగేస్తే పాఠశాలలల్లో బోధన ఎలా సాగించాలని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎస్‌ఎంసీ ఖాతాల్లో ఉన్న నిల్వలను రాష్ట్ర సర్కారు వెనక్కి తీసుకోవడం సరైంది కాదని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment