sathish chadra
-
యాదాద్రిలో హైకోర్టు చీఫ్ జస్టిస్ పూజలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఆదివారం దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని స్వయంభూలను సతీసమేతంగా దర్శించుకొని పూజలు నిర్వహించారు. చీఫ్ జస్టిస్ దంపతులకు ఆలయ ఆచార్యులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ముఖ మండపంలో వారికి వేద ఆశీర్వచనం చేశారు. ఇన్చార్జ్ ఈఓ రామకృష్ణారావు చీఫ్ జస్టిస్‌కు లడ్డూ ప్రసాదం అందజేశారు. అంతకుముందు కలెక్టర్ పమేలా సత్పతి కొండపై అతిథి గృహం వద్ద చీఫ్ జస్టిస్‌కు స్వాగతం పలికారు. -
‘కోఠి హాస్పిటల్’లో సౌకర్యాలపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కోఠి మెటర్నిటీ హాస్పిటల్లో సౌకర్యాలను పరిశీలించి నివేదిక సమర్పించేందుకు న్యాయవాది కిరణ్మయిని అడ్వొకేట్ కమిషన్‌గా హైకోర్టు నియమించింది. ఈ మేరకు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కోఠి ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయో స్వయంగా పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని కిరణ్మయిని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక గర్భిణీ లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పత్రికల్లో వచ్చిన కథనాలను 2016లో హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. -
TS: హైకోర్టు సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ నియమితులు కానున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. కొలీజియం ఇటీవల సమావేశమై పలు హైకోర్టుల సీజేలు, న్యాయ మూర్తుల బదిలీపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 8 మంది న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడంతోపాటు ఐదుగురు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు, 28 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫార్సు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు పంజాబ్ –హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కానున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు రానున్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమర్నాథ్ గౌడ్ త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కానున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంది. జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ నేపథ్యమిదీ... మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 1961 నవంబర్ 30న జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ జన్మించారు. ఆయన తండ్రి బీఎన్ శర్మ వ్యవసాయవేత్తగా ప్రసిద్ధి చెందారు. జబల్పూర్ వర్సిటీ వీసీగా పని చేశారు. ఆయన తల్లి శాంతిశర్మ జబల్పూర్ విద్యాశాఖాధికారిగా పనిచేశారు. జస్టిస్ సతీశ్‌చంద్ర ప్రాథమిక విద్యా భ్యాసాన్ని క్రైస్ట్‌చర్చ్ బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో, జబల్పూర్ సెంట్రల్ స్కూల్లో 12 వరకూ చదివారు. 1981లో డాక్టర్ హరిసింగ్‌గౌర్ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. అదే యూనివర్సిటీ నుంచి న్యాయ పట్టా అందుకొని 1984 సెప్టెంబర్ 1న మధ్యప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాజ్యాంగం, సేవలు, సివిల్, క్రిమినల్ చట్టాలపై మంచి పట్టున్న జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ... 1993 మే 28న కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా, 2004 జూన్ 28న కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానెల్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాదిగా గౌరవం పొందారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన... 2010 జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఆసక్తిగల చదువరి. ఆయన పలు విశ్వవిద్యాలయాలకు సేవలందించారు. భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ సలహా బోర్డులో సేవలందించారు. న్యాయశాస్త్రంలో వివిధ అంశాలపై పరిశోధనా వ్యాసాలు, పత్రాలు రాశారు. ఈ ఏడాది జనవరి 4న కరా>్ణటక హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవలే కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. -
‘జగనన్న విద్యా దీవెన’ మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా దీవెన’ పథకం అమలుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర జీవో 14 విడుదల చేశారు. ‘నవరత్నాలు’ అమలులో భాగంగా విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హులైన విద్యార్థులందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ‘జగనన్న విద్యా దీవెన’ మార్గదర్శకాలు ఇవీ.. - ఫీజులపై రాష్ట్ర ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ నోటిఫికేషన్‌కు కాలేజీలు అంగీకరించి ఉండాలి. క్యాపిటేషన్ ఫీజు తదితర అనధికారిక ఫీజులు (డొనేషన్లు లాంటివి) వసూలు చేయరాదు. - ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు భిన్నంగా ఇతర ఫీజులు వసూలు చేయరాదు. విద్యాసంస్థ నిర్వహణలో మిగులు లాభాన్ని తన సొంతానికి కాకుండా తిరిగి సంస్థ కోసం వెచ్చించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాలేదనే సాకుతో విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయరాదు. - యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఏపీఎస్సీహెచ్ఈ లాంటి నియంత్రణ సంస్థల ఆదేశాలను పాటించాలి. ఆన్లైన్ అఫ్లియేషన్, అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలి. విద్యార్థులవారీగా అకడమిక్ పెర్ఫార్మెన్సు తదితర రికార్డులను సంబంధిత విభాగాలకు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. - విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది హాజరును తప్పనిసరిగా ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ హాజరు ద్వారా నమోదు చేయాలి. 75 శాతం కన్నా హాజరు తగ్గితే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. - సెక్యూరిటీ, డేటా గోప్యత ప్రోటోకాల్‌ను పాటించాలి. ప్రభుత్వం, సంబంధిత రెగ్యులేటరీ సంస్థలు అనుమతించే కోర్సులతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిర్దేశించిన కోర్సులను మాత్రమే నిర్వహిస్తూ ఉండాలి. - మార్గదర్శకాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలు, యాజమాన్యాలపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది. ఆ కాలేజీలను ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నుంచి తప్పిస్తారు. - ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిర్దేశించిన ఆదాయ పరిమితి ప్రకారం గుర్తింపు కలిగిన సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. డీమ్డ్ వర్సిటీలు, ప్రైవేట్ వర్సిటీలకు ఈ పథకం వర్తించదు. దూర విద్య, కరస్పాండెన్స్ కోర్సులు చదివే విద్యార్థులు, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులకు ఈ స్కీము వర్తించదు. సాంఘిక సంక్షేమ శాఖ ఈ పథకానికి నోడల్ విభాగంగా పనిచేస్తుంది. -
చంద్రబాబు ముఖ్యకార్యదర్శిగా సతీష్ చంద్ర
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య కార్యదర్శిగా సతీష్ చంద్రను నియమించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా జి.జయలక్ష్మి, ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా రవిచంద్ర, ఏపీఐఐసీ ఎండీగా కేవీ సత్యనారాయణలను నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.