జస్టిస్ సతీశ్‌చంద్ర, జస్టిస్ ప్రశాంత్‌కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ నియమితులు కానున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. కొలీజియం ఇటీవల సమావేశమై పలు హైకోర్టుల సీజేలు, న్యాయ మూర్తుల బదిలీపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 8 మంది న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడంతోపాటు ఐదుగురు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు, 28 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫార్సు చేసినట్లు తెలిసింది.
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు పంజాబ్ –హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కానున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు రానున్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కానున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సి ఉంది.
జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ నేపథ్యమిదీ...
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 1961 నవంబర్ 30న జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ జన్మించారు. ఆయన తండ్రి బీఎన్ శర్మ వ్యవసాయవేత్తగా ప్రసిద్ధి చెందారు. జబల్‌పూర్ వర్సిటీ వీసీగా పని చేశారు. ఆయన తల్లి శాంతిశర్మ జబల్‌పూర్ విద్యాశాఖాధికారిగా పనిచేశారు. జస్టిస్ సతీశ్‌చంద్ర ప్రాథమిక విద్యా భ్యాసాన్ని క్రైస్ట్‌చర్చ్ బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో, జబల్‌పూర్ సెంట్రల్ స్కూల్‌లో 12 వరకూ చదివారు. 1981లో డాక్టర్ హరిసింగ్‌గౌర్ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. అదే యూనివర్సిటీ నుంచి న్యాయ పట్టా అందుకొని 1984 సెప్టెంబర్ 1న మధ్యప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.
రాజ్యాంగం, సేవలు, సివిల్, క్రిమినల్ చట్టాలపై మంచి పట్టున్న జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ... 1993 మే 28న కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా, 2004 జూన్ 28న కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానెల్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాదిగా గౌరవం పొందారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన... 2010 జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఆసక్తిగల చదువరి. ఆయన పలు విశ్వవిద్యాలయాలకు సేవలందించారు. భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ సలహా బోర్డులో సేవలందించారు. న్యాయశాస్త్రంలో వివిధ అంశాలపై పరిశోధనా వ్యాసాలు, పత్రాలు రాశారు. ఈ ఏడాది జనవరి 4న కరా>్ణటక హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవలే కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment