ఇప్పుడే పొమ్మంటే ఎలా!
పైడిపాక, రామయ్యపేట నిర్వాసితుల ఆవేదన
అధికారులు బలవంతంగా ఇళ్లు
ఖాళీ చేయిస్తున్నారని వాపోతున్న గిరిజనులు
పునరావాస కేంద్రాల్లో పూర్తికాని నిర్మాణాలు
నిర్వాసిత గ్రామాల్లో ఇళ్ల పైకప్పుల తొలగింపు
‘ఒకే గ్రామంలో ఉండే వాళ్లకు వేర్వేరు గ్రామాల్లో ఇళ్లు కేటాయించారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న వాళ్లను విడదీశారు. కష్టమైనా.. నష్టమైనా పునరావాస కేంద్రాలకు వెళదామంటే అక్కడ మంచినీటి సౌకర్యం కల్పించలేదు. సత్యసాయి పథకం ట్యాంక్ నిర్మిస్తామని చెప్పినా ఆ జాడ లేదు. కనీసం చేతి పంపులైనా వేయలేదు. మరుగుదొడ్లు నిర్మించలేదు. అధికారులొచ్చి ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేయమంటున్నారు. పోనీ.. మంచిరోజు చూసుకుని వెళతామని చెబుతున్నా వినిపించుకోవడం లేదు.
ఇప్పుడుంటున్న ఇళ్ల పైకప్పులను తొలగిస్తున్నారు. బలవంతంగా ఊరినుంచి వెళ్లగొడుతున్నారు’ పోలవరం మండలం పైడిపాక, రామయ్యపేట గ్రామాల్లోని నిర్వాసితుల గోడు ఇది. పోలవరం ప్రాజెక్ట్ ముంపుబారిన పడే ఈ రెండు గ్రామాల్లోని ప్రజలకు వేర్వేరుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోయినా.. సౌకర్యాలు కల్పించకుండానే పోలీసుల సహకారంలో నిర్వాసితులను ఖాళీ చేయించడం వివాదాస్పదమవుతోంది.
పోలవరం :
రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో తమను సొంత ఊళ్ల నుంచి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాలైన పైడిపాక, రామయ్యపేట నిర్వాసితులు ఇవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పైడిపాక గ్రామంలో 500కు పైగా కుటుంబాలు ఉండగా.. వారికి వేర్వేరు గ్రామాల్లో పునరావాసం కల్పిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కుటుంబాల వారిని వేర్వేరు చోట్లకు తరలించిన అధికారులు.. ఇదే గ్రామానికి చెందిన 170 కుటుంబాల వారికి జంగారెడ్డిగుడెం మండలం గుర్వాయిగూడెం పునరావాస కేంద్రంలో ఇళ్లు నిర్మించారు. నిర్మాణాలు పూర్తయ్యాయని, 170 కుటుంబాల వారు తక్షణమే గ్రామాన్ని విడిచి వెళ్లాలని అధికారులు బలవంతం చేస్తున్నారు.
పునరావాస కేంద్రంలో మంచినీటి వసతి లేదని, సత్యసాయి పథకం కింద ట్యాంక్ నిర్మిస్తామని చెప్పినా ఆ ఏర్పాటు చేయలేదని, కాలనీల్లో మరుగుదొడ్లు నిర్మించలేదని, చేతి పంపులు కూడా వేయలేదని నిర్వాహిసితులు చెబుతున్నారు. మంగళవారం పైడిపాక గ్రామానికి పోలీసుల సాయంతో వచ్చిన రెవెన్యూ సిబ్బంది కనమర్లపూడి చినసుబ్బారావు, కాకరపర్తి వెంకటసత్యనారాయణ, సుంకర బాబురావు ఇళ్లల్లోకి వెళ్లి సామగ్రిని బయటకు తరలించారని బాధితులు ఆరోపించారు. చుట్టుపక్కల వారి సాయంతో ఈ చర్యను అడ్డుకున్నామని నిర్వాసితులు కాకరపర్తి వెంకటసత్యనారాయణ, బొట్టా వెంకటేశ్వరరావు, బొట్టా శ్రీను తదితరులు తెలిపారు. పునరావాస కేంద్రంలో సౌకర్యాలు కల్పించకుండా ఎలా వెళ్తామని ప్రశ్నించారు. ఇంకా రాయితీలు కూడా పూర్తిగా ఇవ్వలేదన్నారు.
రామయ్యపేటలో..
రామయ్యపేటలో 492 కుటుంబాలు ఉండగా వారందరికీ వేర్వేరు గ్రామాల్లో పునరావాసం కల్పిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన 24 కుటుంబాల వారికి జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం పునరావాస కేంద్రంలో రెండేసి కుటుంబాలకు ఒక్కొక్క ఇంటిని కేటాయించారు. మంగళవారం తమ ఇళ్లకు పోలీసుల సాయంతో వచ్చిన రెవెన్యూ సిబ్బంది ఇంట్లోని సామగ్రి అంతా బయటపెట్టేశారని కుంచె సత్యనారాయణ ఆయన ముగ్గురు కుమారులు వాపోయారు.
అమావాస్య అనంతరం పునరావాస కేంద్రానికి వెళతామని చెప్పినా వినిపించుకోకుండా అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే గ్రామానికి చెందిన పెనుమత్స సూర్యారావు కూడా గుర్వాయిగూడెంలో ఇల్లు నిర్మించుకున్నాడు. ఉగాది వెళ్లాక గ్రామాన్ని ఖాళీ చేస్తామని చెప్పినా రెవెన్యూ సిబ్బంది వినకుండా ఇంటి పైకప్పును ధ్వంసం చేశారని, విద్యుత్ కనెక్షన్ తొలగించారని సూర్యారావు కుటుంబ సభ్యులు వాపోయారు.
బలవంతమేమీ లేదు
పైడిపాక, రామయ్యపేట గ్రామాల నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించటం లేదు. పునరావాస కేంద్రాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిన వారిని వెళ్లమంటున్నాం. అన్ని రాయితీలు ఇస్తున్నాం. ఇళ్లు పూర్తి కాకుండా అద్దె ఇళ్లల్లోకి వెళితే మూడు నెలల అద్దె కూడా చెల్లిస్తాం.
- ఎం.ముక్కంటి, తహసిల్దార్, పోలవరం