satish dhavan
-
షార్ కంట్రోలర్‌గా రైతుబిడ్డ
తడ, న్యూస్‌లైన్: రైతు బిడ్డ జేవీ రాజారెడ్డి అంచెలంచెలుగా ఎదిగి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) కంట్రోలర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. రాజారెడ్డి తడ మండలం మాంబట్టు పంచాయతీలోని ఎన్ఎం కండ్రిగలోని రైతు కుటుంబంలో 1965లో జన్మించారు. జె.వెంకటసుబ్బారెడ్డి, చెంగమ్మ దంపతుల ముగ్గురి కుమారుల్లో రాజారెడ్డి చివరివాడు. పెద్ద సోదరుడు జేఎన్‌రెడ్డి చెన్నైలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో ప్రొఫెసర్ కాగా, మరో సోదరుడు చెన్నైలోని ప్రముఖ ఆడిటర్. సోదరుల స్ఫూర్తితో రాజారెడ్డి అంచెలంచెలుగా ఉన్నతస్థాయికి ఎదిగాడు. గ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న రాజారెడ్డి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సూళ్లూరుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. మద్రాస్ ఎంఐటీలో ఎంఈ చదివి డిస్టింక్షన్లో పాసయ్యాడు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ 1987 బ్యాచ్‌కు ఎంపికైన ఆయన గ్రూప్-ఏ కేడర్‌లో ఇండియన్ టెలికం విభాగంలో తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు. 1989లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ(ఫైనాన్స్) చదివారు. రెండేళ్ల శిక్షణ అనంతరం 1992 మార్చిలో మైసూర్లో ఏడీఈటీగా మెయింటినెన్స్ విభాగంలో నియమితులయ్యారు. అక్కడే డీఈగా పదోన్నతి పొందారు. 1993 జూన్‌లో టెలికాం ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్‌గా, 95లో టెలికాం డిస్ట్రిక్ట్ మేనేజర్‌గా రాయచూర్, హసన్ జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. జూలై 2004లో విశాఖపట్టణం డీజీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2008లో అడ్మిన్ విభాగం డీజీఎంగా తంజావూర్‌కు బదిలీ అయి అక్కడే 2009లో జీఎం హోదా పొంది కేంద్ర స్థాయిలో సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించారు. 2012లో తిరుచ్చికి బదిలీ అయి సౌత్ జోన్ మొబైల్ జీఎంగా దక్షిణ భారత దే శంలోని టెలికం విభాగానికి చెందిన పలు కీలక బాధ్యతలను చేపట్టారు. టెలికం శాఖలో సుదీర్ఘ ప్రయాణం అనంతరం తన స్వగ్రామానికి అతి చేరువలో ఉన్న శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలోని కీలక శాఖల్లో ఒకటైన షార్ కంట్రోలర్ పదవిని ఈ నెల 8న చేపట్టారు. -
షార్‌లో భద్రత అత్యంత కట్టుదిట్టం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మంగళవారం పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకుని సీఐఎస్ఎఫ్ కమాండెంట్ శ్రీధర్ ఆధ్వర్యంలో కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాలతో అత్యంత భారీ భద్రత ఏర్పాటు చేశారు. షార్ భద్రతకు ఉన్న సుమారు 700 మంది సిబ్బందితో భద్రతను అత్యంత అప్రమత్తంగా ఏర్పాటు చేశారు. షార్ మొదటిగేట్ వద్ద వాహనాలను నఖశిఖ పర్యంతం తనిఖీలు చేశారు. చిన్న బ్యాగులను సైతం ఈ సారి నూతనంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ మిషన్‌లో స్కాన్ చేసి అనుమతించారు. సముద్ర మార్గంలో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో భద్రతను పెంచారు. బంగాళాఖాతం వైపు నుంచి కోస్ట్‌గార్డ్స్, సబ్‌మెరైన్ దళాలు పహారా కొసాగించాయి. షార్ కేంద్రంలో సాయుధ భద్రతా సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట నుంచి షార్కు వెళ్లే వాహనాలను తనిఖీ చేసేందుకు స్థానిక పోలీసులతో కలిపి అటకానితిప్ప వద్ద అవుట్‌పోస్టు ఏర్పాటు చేశారు. పులికాట్ పరిసర ప్రాంతాల్లో మొబైల్ పార్టీలు గస్తీ ముమ్మరం చేశారు. ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో 60 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. షార్కు సమీప ప్రాంత గ్రామాలైన వేనాడు, ఇరకం దీవుల్లో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట నుంచి షార్కు వెళ్లే రోడ్డులో, వేనాడు రోడ్డు, పేర్నాడురోడ్డు, కారిజాత రోడ్డులో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. 11 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో దావాదిగుంట వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేశారు.