భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మంగళవారం పీఎస్‌ఎల్‌వీ సీ25 ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకుని సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ శ్రీధర్ ఆధ్వర్యంలో కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాలతో అత్యంత భారీ భద్రత ఏర్పాటు చేశారు.
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మంగళవారం పీఎస్‌ఎల్‌వీ సీ25 ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకుని సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ శ్రీధర్ ఆధ్వర్యంలో కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాలతో అత్యంత భారీ భద్రత ఏర్పాటు చేశారు. షార్ భద్రతకు ఉన్న సుమారు 700 మంది సిబ్బందితో భద్రతను అత్యంత అప్రమత్తంగా ఏర్పాటు చేశారు. షార్ మొదటిగేట్ వద్ద వాహనాలను నఖశిఖ పర్యంతం తనిఖీలు చేశారు. చిన్న బ్యాగులను సైతం ఈ సారి నూతనంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ మిషన్‌లో స్కాన్ చేసి అనుమతించారు. సముద్ర మార్గంలో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో భద్రతను పెంచారు.
బంగాళాఖాతం వైపు నుంచి కోస్ట్‌గార్డ్స్, సబ్‌మెరైన్ దళాలు పహారా కొసాగించాయి. షార్ కేంద్రంలో సాయుధ భద్రతా సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట నుంచి షార్‌కు వెళ్లే వాహనాలను తనిఖీ చేసేందుకు స్థానిక పోలీసులతో కలిపి అటకానితిప్ప వద్ద అవుట్‌పోస్టు ఏర్పాటు చేశారు. పులికాట్ పరిసర ప్రాంతాల్లో మొబైల్ పార్టీలు గస్తీ ముమ్మరం చేశారు. ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో 60 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. షార్‌కు సమీప ప్రాంత గ్రామాలైన వేనాడు, ఇరకం దీవుల్లో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట నుంచి షార్‌కు వెళ్లే రోడ్డులో, వేనాడు రోడ్డు, పేర్నాడురోడ్డు, కారిజాత రోడ్డులో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. 11 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో దావాదిగుంట వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేశారు.