విరమణ మంగళవారమా!
ఈనెల 25 నుంచి వచ్చేనెల 22 వరకూ సత్యదీక్షలు
చివరిరోజు మంగళవారం కావడంపై భక్తుల సందిగ్ధం
మరోసారి పండితులతో చర్చిస్తానంటున్న ఈఓ
అన్నవరం :
రత్నగిరి వాసుడు సత్యదేవుని పేరిట చేపట్టే ‘సత్యదీక్ష’ విరమణ రోజును నవంబర్‌ర్ 22 మంగళవారంగా దేవస్థానం నిర్ణయించడంపై భక్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం సెంటిమెంట్‌తో దీక్ష విరమించడానికి చాలా మంది అయిష్టత చూపుతున్నారు.
అన్నవరం దేవస్థానం అధికారికంగా నిర్వహించే సత్యదీక్షలు స్వామివారి జన్మనక్షత్రం ‘మఖ’ సందర్బంగా ఈనెల 25 నుంచి ప్రారంభమవుతున్నాయి. 27 రోజుల అనంతరం వచ్చే ‘మఖ’ నక్షత్రం నాడు ఈ దీక్ష విరమించడం ఆనవాయితీగా వస్తోంది. అన్నవరం దేవస్థానం పంచాంగం ప్రకారం నవంబర్ నెలలో వచ్చే ‘మఖ’ నక్షత్రం 21 సోమవారం ఉదయం 7.14 గంటల నుంచి 22 మంగళవారం ఉదయం 9.57 గంటల వరకూ ఉంది. అయితే దేవస్థానంలో స్వామివారి ఆలయం తెరిచే సమయానికి ఏ నక్షత్రం, తిథి ఉంటాయో ఆ రోజంతా వాటినే పరిగణనలోకి తీసుకునే ఆచారం ఉంది. దాని ప్రకారం మంగళవారమే స్వామివారి జన్మనక్షత్ర పూజలు నిర్వహిస్తున్నారు. దాంతో బాటు దీక్ష విరమణ కూడా అదే రోజు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రచారం ప్రారంభించింది. అంతే కాదు పెద్ద పెద్ద ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో సత్యదీక్షలు చేపట్టాలనుకునే భక్తులు చాలామంది సందిగ్ధంలో పడ్డారు.
నవంబర్ 21 సోమవారం ఉదయం 7.14 గంటల నుంచి మఖ నక్షత్రం వస్తున్నందున అదే రోజు దీక్ష విరమణ తేదీగా నిర్ణయిస్తే భక్తుల మనోభావాలను గౌరవించినట్టు కూడా అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఆరోజు సప్తమి తిథి కూడా మంచిదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇది సాధ్యం కాదంటే మరుసటి రోజు బుధవారం దీక్ష విరమించేందుకు అవకాశం ఉంటే ఆ విషయాన్ని అయినా దేవస్థానం పండితులు ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు. కాగా సత్యదీక్ష ల విరమణ నవంబర్ 22న అని దేవస్థానం పండితులు నిర్ణయించారని ఈఓ నాగేశ్వరరావు చెప్పారు. అదే రోజున సత్యదేవునికి జన్మనక్షత్రానికి సంబంధించిన పంచామృతాభిషేకం చేస్తారు కాబట్టి ఆరోజునే దీక్ష విరమించాలన్నది పండితుల నిర్ణయమన్నారు. ఆరోజు మంగళవారం కాబట్టి దీక్ష విరమించకూడదన్న సెంటిమెంట్ ఉంటే దీనిపై మరోసారి పండితులతో చర్చిస్తామన్నారు.
భక్తుల అభిప్రాయం ఇలా...
సాధారణంగా ఏ దేవుని దీక్ష అయినా ఇతర వారాలతో పాటు మంగళవారం, శుక్రవారం కూడా చేపట్టే అవకాశం ఉన్నా దీక్ష విరమణ మాత్రం ఆ రెండు రోజుల్లో చేయడానికి ఇష్టపడరు. మెడలో మాల ధరించి నియమనిష్టలతో దీక్ష చేస్తారు. మంగళవారం లేదా శుక్రవారం దీక్ష విరమించి ఆ మాల మెడ నుంచి తీయాలంటే సెంటిమెంట్ అడ్డొస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ రోజుల్లో దీక్ష విరమించి మాలను విసర్జించినా తరువాత ఏమన్నా జరిగితే మంగళవారం దీక్ష విరమించడం వలనే ఇలా జరిగిందన్న అభిప్రాయం వెంటాడుతుందంటున్నారు. దానికి తోడు మంగళవారం అష్టమి తిథి కూడా ఉంది. అందువలన చాలామంది విరమణ తేదీపై పునరాలోచించాలని కోరుతున్నారు.