ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి
తుమ్మపాల : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ అన్నారు. కొత్తూరు ఏఎంఏఎల్ కళాశాల కౌంటింగ్ కేంద్రాలను ఆదివారం పరిశీలించి ఏర్పాట్లపై ఆరాతీశారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల ఓట్ల లెక్కింపు ఇక్కడ జరగనుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఫలితాలు వెలువడే సరికి చీకటి పడే అవకాశం ఉన్నందున విద్యుత్ సదుపాయం ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జనరేటర్‌ను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు.
లెక్కింపు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా పీడీ శ్రీనివాస్, ఆర్డీఓ వసంతరాయుడు మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రవర్తన సరిగా లేని ఏజెంట్లను సైతం బయటకు పంపాలని ఆదేశించారు. బ్యాలెట్ పత్రాలు కట్టలు కట్టేటప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రీకౌంటింగ్ కోరితే అందులోని వాస్తవికతను గుర్తించి చేపట్టాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లను ఏజెంట్లు సమక్షంలోనే తెరిచి బ్యాలెట్ బాక్స్‌లను లెక్కింపు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. చెల్లని ఓట్ల పట్ల అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని, పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా తీసి విజేతను ప్రకటించాలని సూచించారు. కౌంటింగ్ ముందు పోలైన ఓట్ల మొత్తాన్ని పీఓ డైరీలో నమోదు చేసిన సంఖ్యతో సరిపోల్చుకుని అనంతరం లెక్కింపు ప్రారంభించాలన్నారు. అనంతరం అన్ని మండలాల ఎంపీడీఓలతో సమావేశమై సూచనలు చేశారు.