3,349 కోట్లు కట్టండి..
సత్యం స్కామ్లో రామలింగరాజు సంబంధీకులకు సెబీ తాజా ఆదేశాలు
- 45 రోజుల్లోగా చెల్లించాలని ఉత్తర్వులు
ముంబై: సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించి అక్రమంగా ఆర్జించిన రూ. 1,849 కోట్లు, వడ్డీతో పాటు 45 రోజుల్లోగా కట్టాలని సంస్థ వ్యవస్థాపకుడు రామలింగరాజు సంబంధీకులైన 10 మంది వ్యక్తులు, సంస్థలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. జరిమానా కింద.. 2009 జనవరి 7 నుంచి ఈ మొత్తంపై వడ్డీ సుమారు రూ. 1,500 కోట్లు కూడా వారు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 3,349 కోట్లు దాకా కట్టాల్సి వస్తుంది.
గతంలోనూ ఈ మొత్తానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. తాజా ఆదేశాల్లో రాజు, ఆయన సోదరులు, తల్లితో పాటు మరికొందరు వ్యక్తులు, ప్రమోటరు కుటుంబానికి చెందిన కంపెనీ వేర్వేరుగా కట్టాల్సిన మొత్తాలను సెబీ నిర్ణయించింది. దీని ప్రకారం రామలింగరాజు.. ఆయన సోద రుడు రామరాజు రూ. 56 కోట్లు, మరో సోదరుడు సూర్యనారాయణరాజు రూ. 90 కోట్లు, వారి తల్లి అప్పలనరసమ్మ రూ. 8 కోట్లు కట్టాల్సి ఉంటుంది. దీంతో పాటు సూర్యనారాయణరాజు భార్య ఝాన్సీరాణి రూ. 8.5 కోట్లు, రామలింగరాజు ఇద్దరు కుమారులు తేజరాజు, రామరాజు సుమారు రూ. 95 కోట్లు కట్టాలి. ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ రూ. 1,259 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రమోటరు గ్రూప్, రాజు సోదరులకు ఫ్రంట్ కంపెనీగా ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ వ్యవహరించిందని 39 పేజీల ఉత్తర్వులో సెబీ పేర్కొంది. అటు సత్యం మాజీ డెరైక్టరు చింతలపాటి శ్రీనివాస్ రాజు, ఆయన తండ్రి అంజిరాజు చింతలపాటి (విచారణ దశలోనే కన్నుమూశారు), చింతలపాటి హోల్డింగ్స్, ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ (ఐఈసీసీఎల్) కూడా నిర్దేశిత మొత్తాలను కట్టాల్సి ఉంటుంది. 2009 జనవరి 7 నుంచి 12 శాతం వడ్డీ సహా ఈ మొత్తాలను 45 రోజుల్లోగా కట్టాలని ఆదేశించింది.
ఐఈసీసీఎల్ తర్వాత దశల్లో మేటాస్ను కొనుగోలు చేసినందున ఇన్సైడర్ ట్రేడింగ్లో దాని ప్రమేయం ఉండదు కనుక సంస్థపై నిషేధ చర్యలు తీసుకోవడం లేదని సెబీ పేర్కొంది. అయితే, మేటాస్ ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వచ్చిన నిధులను అది తిరిగివ్వాల్సిందేనని తెలిపింది. సత్యం ఖాతాల్లో కుంభకోణం జరిగిందంటూ 2009లో రామలింగరాజు వెల్లడించడంతో స్కామ్ వెలుగులోకి రావడం, ఆయన జైలుకెళ్లడం, కంపెనీని టెక్ మహీంద్రా టేకోవర్ చేయడం తదితర పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే.