శిల్పాశెట్టి గోల్డ్ స్కీమ్..
బాలీవుడ్ తార శిల్పాశెట్టికి చెందిన సత్యుగ్ గోల్డ్ సంస్థ కొత్తగా గోల్డ్ స్కీమ్‌ను ప్రకటించింది. మేరా గోల్డ్ ప్లాన్‌లో నెల నెలా అత్యంత తక్కువగా రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా కస్టమర్లు కట్టే మొత్తానికి సంబంధించి వారి అకౌంట్లో అప్పటి బంగారం రేటును బట్టి అంత మొత్తం పసిడిని (నాలుగు దశాంశ స్థానాల దాకా) కంపెనీ జమ చేస్తుంది.
కస్టమరు వైదొలగాలనుకున్నప్పుడు చివర్లో జమయిన మొత్తానికి సంబంధించి ఆభరణాలు లేదా 24 క్యారట్ల స్వచ్ఛత గల బంగారు నాణేలు (1 గ్రా. నుంచి 50 గ్రాముల దాకా) పొందవచ్చు. బంగారం రేట్లు తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో ఒకేసారి ఎక్కువ ధర పెట్టి కొని నష్టపోకుండా ఉండేందుకు, పసిడిలో ఇన్వెస్ట్మెంట్ అలవాటును ప్రోత్సహించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందంటోంది కంపెనీ.
ప్రత్యేకంగా లాకిన్ వ్యవధి గానీ, స్టోరేజీ చార్జీలు గానీ, ఇతరత్రా చార్జీలు గానీ ఉండవంటోంది. ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్, కార్వీ కంప్యూటర్షేర్ సంస్థల తోడ్పాటు ఉండటం వల్ల పెట్టుబడులకు ఢోకా ఉండదంటూ సత్యుగ్ గోల్డ్ చెబుతోంది. షరా మామూలుగా ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లాగే దీని గురించి కూలంకషంగా సందేహాలన్నీ తీర్చుకుని ఇన్వెస్ట్ చేయవచ్చన్నది నిపుణుల సలహా.