రైతు రక్షణ యాత్ర
త్రికాలమ్
‘ఆత్మహత్యలు చేసుకోవద్దు. గౌరవప్రదంగా జీవించే హక్కు మీకు రాజ్యాంగం ఇచ్చింది. ఆత్మహత్య చేసుకునే హక్కు ఇవ్వలేదు. ఆత్మహత్య నేరం. ఇది పోరుగడ్డ. పోరాటం చేసి గెలవాలి కానీ గుండె చెదిరి ఆత్మహత్య చేసుకోవద్దు’. రైతు రక్షణ యాత్ర పేరు మీద శుక్రవారం హైదరాబాద్ నుంచి అయినాపూర్ వెళ్లిన హక్కుల కార్యకర్తలం రైతు సోదరీసోదరులకు విజ్ఞప్తి చేశాం. ‘ఈ రోజు మేం ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద సభలో మాట్లాడి వెళ్లిన తర్వాత ఒక్కరు కూడా ఆత్మహత్యకు ఒడిగట్టకూడదు’ అని ప్రొఫెసర్ హరగోపాల్ గట్టిగా చెప్పారు.
ప్రజ్ఞాపూర్ దాటిన తర్వాత రాజీవ్ రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అయినాపూర్ సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్యమైన కేంద్రం. నక్సలైట్ ఉద్యమంలోనూ ముందు పీటీలో ఉన్న గ్రామం. పోరాటంలో ప్రాణ త్యాగం చేయడమే కానీ ఆత్మహత్య చేసుకోవడం ఈ నేల చరిత్రలో లేదని విద్యావేత్త చుక్కా రామయ్య రైతులకు గుర్తుచేశారు. అప్పుల ఊబిలో కూరుకొని దిక్కులేని స్థితిలో మృత్యువును ఆశ్రయిస్తున్న రైతులకు ఈ ఉద్బోధ మనోధైర్యం ఇస్తుందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ గ్రామంలో అయిదుగురు రైతులు బలవన్మరణం పొందారు.
‘పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలూ, వ్యాపారవేత్తలూ వేలకోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా మాఫ్ చేయాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు పడవేసి విలాసవంతంగా జీవిస్తున్నారు. మీరేమో ఒకటి, రెండు లక్షల రూపాయల అప్పు చెల్లించడానికి నిజాయితీగా ప్రయత్నించి విఫలమై అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరేమి తప్పు చేశారు? మీరెందుకు చనిపోవాలి? మీ అప్పు తిరిగి చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేయండి’, అంటూ ప్రోత్సహించాం. సంఘీభావం ప్రకటించడం, రైతు ఒంటరి కాదనీ, సమాజం వెంట ఉన్నదనీ నమ్మబలకడం మినహా చేయగలిగింది ఏమున్నది? వ్యవసాయం రైతును బలితీసుకోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది.
రైతులలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం లోగడ జరగకపోలేదు. ఆత్మహత్యల పరంపర 1995-96లో ప్రారంభమైతే 1998లోనే రైతు సహాయ కమిటీ ఏర్పాటు చేసిన ‘పీపుల్స్ ట్రిబ్యూనల్’ సభ్యులుగా పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, విద్యావేత్త బూర్గుల నరసింగరావు, న్యాయమూర్తి పీఏ చౌదరి, ఐఏఎస్ అధికారులు ఎస్ఆర్ శంకరన్, కేఆర్ వేణుగోపాల్ మెదక్, వరంగల్లు, గుంటూరు, హైదరాబాద్‌లలో బహిరంగ చర్చ (జన్ సున్వాయీ) నిర్వహిం చారు. ప్రొఫెసర్ రమా మెల్కోటే నాటి ట్రిబ్యూనల్ పర్యటనలలోనూ, నేటి రైతు రక్షణ యాత్రలోనూ రైతులను కలుసుకున్నారు. వారి వెతలు విన్నారు. రైతు ఆత్మహత్యలకి కారణాలు అప్పుడూ, ఇప్పుడూ ఒక్కటేనని ఆమె చెబుతున్నారు.
శాసనసభలో అర్థవంతమైన చర్చ
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో రెండు రోజులు పూర్తిగా రైతు ఆత్మహత్యలపైనే చర్చ జరిగింది. తెలంగాణ విత్తనాల కేంద్రమనీ, దాదాపు అయిదు వందలకు పైగా విత్తన కంపెనీలు ఇక్కడ ఉన్నాయనీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) శాసనసభలో చెప్పారు. రైతుల ఆత్మహత్యలు నివారించడానికి విత్తన కంపెనీల యజమానులు ముందుకు వచ్చారనీ, వారితో సోమవారంనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఒక సదస్సు ఏర్పాటు చేశారనీ ముఖ్యమంత్రి అన్నారు. వంగడాలపై సంపాదిస్తున్న లాభాలలో కంపెనీలు సగం త్యాగం చేస్తే రైతులకు మహోపకారం చేసినట్టే.
రైతులను పీల్చిపిప్పి చేసేవి వంగడాలూ, ఎరువులూ, క్రిమిసంహారకాలూ, ప్రైవేటు రుణాలూ. అయినాపూర్‌లో కిలో మక్కలు (మొక్కజొన్న గింజలు) రూ. 30కి కొనుగోలు చేసిన కంపెనీలు ఇమిలాక్లోబ్రిడ్ మందు కలిపి నాలుగు కేజీల చొప్పున సంచులు తయారు చేసి సంచి ధర రూ. 1800లుగా నిర్ణయించి, 50 శాతం సబ్సిడీ (రూ. 900) ప్రభుత్వం నుంచి వసూలు చేసి రైతులకు రూ. 900లకు అమ్ముతున్నాయి. వాస్తవానికి నాలుగు కేజీల సంచీని రూ. 300లకు విక్రయించినా కంపెనీలకు న్యాయమైన లాభం మిగులుతుందని భైరాన్‌పల్లికి చెందిన రైతు ఎడవెల్లి చంద్రారెడ్డి వాదించారు. తనకున్న 25 ఎకరాలలో రెండు ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నారు. మొత్తం ఎనిమిది బోర్లు వేసినా ప్రయోజనం లేకపోయింది. భూగర్భ జలాలు అడుగంటాయి. ఆ ప్రాంతంలో అంతటా ఇదే పరిస్థితి.
రైతులు సంఘటితం కావాలి
బ్యాంకులు అప్పు ఇవ్వడమే తక్కువ. ఇచ్చినప్పుడు షరతు ఏమంటే ఒక సంవత్సరంలోపు తిరిగి చెల్లిస్తే ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తారు. సంవత్సరం దాటితే వడ్డీ 12 శాతం. వడ్డీ వ్యాపారుల సంగతి సరేసరి. గ్రామాలు విధ్వంసం కావడం, సహకార వ్యవస్థ కూలిపోవడంతో సంఘీభావం కొరవడింది. ఒకరి బాధను మరొకరితో పంచుకునే పరిస్థితి లేదు. అప్పులతో సతమతం అవుతున్న రైతును వడ్డీ వ్యాపారి కానీ బ్యాంకు అధికారలు కానీ గట్టిగా నిలదీస్తే అవమాన భారంతో తల్లడిల్లిపోతున్నాడు. భార్యాపిల్లలకి కూడా చెప్పకుండా పురుగుల మందు తాగుతున్నారు లేదా ఉరి వేసుకుంటున్నారు. చావొక్కటే అతనికి కనిపించే పరిష్కారం. సంఘటిత రంగంలో ఉన్న ప్రభుత్వోద్యోగులు వేతనాలు దర్జాగా పెంచుకోగలిగారు.
రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందలేక దీనంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులకు తీరని అన్యాయం చేస్తున్నారు. అందుకే రైతులు సంఘం ఏర్పాటు చేసుకోవాలంటూ రైతు జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు యోగేంద్రయాదవ్ శనివారంనాడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించి రైతుల స్థితిగతులను విచారించారు. నాలుగు రోజుల కిందట మరో ఆమ్ ఆద్మీ వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హైదరాబాద్ వచ్చినప్పుడు రైతుల ఆత్మహత్యలపై వాకబు చేశారు. రైతుల తరఫున పోరాడేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. ఒంటరిగా కుమిలిపోయి ప్రాణత్యాగం చేయవలసిన అవసరం లేదని హామీ ఇవ్వడమే తెలంగాణ విద్యావంతుల వేదిక, రైతు జెఏసీ సంయుక్తంగా నిర్వహించిన రైతు రక్షణ యాత్ర లక్ష్యం.
అయినాపూర్ సమావేశం తర్వాత రైతు యాత్ర చేర్యాల చేరింది. అక్కడ జరిగిన రైతు సభలో విద్యావంతుల వేదిక నాయకుడు మల్లెపల్లి లక్ష్మయ్య నాలుగు సూత్రాలు ఆధారంగా ఉద్యమం నిర్మించాలని ఉద్బోధించారు. ఒకటి, నకిలీ విత్తనాలు, ఎరువులూ, మందులూ అమ్మే కంపెనీలను మూసివేయడం, ఆ కంపెనీల యజమానులను అరెస్టు చేయడం. రెండు, బ్యాంకులు రైతులను చులకనగా చూడకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించడం, రుణ సౌకర్యం కల్పించడం. మూడు, వ్యవసాయ విస్తరణాధికారుల చేత పని చేయించడం, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయడం, వారి చేత భూసార పరీక్షలు చేయించడం, ఏ భూమిలో ఏ పంట వేయాలో రైతులకు సలహా చెప్పడం వంటి విధులు నిర్వర్తింపజేయడం.
వేలంవెర్రిగా పత్తి పండించేందుకు రైతులు శక్తికి మించి అప్పులు చేయడం, పంట నష్టం కావడంతో కుదేలైపోవడం చూస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న రైతులలో తొంభైశాతం మంది పత్తి రైతులే. 2002లో బీటీ (బయోటెక్) పత్తి వంగడాలు దేశంలో ప్రవేశించడంతో వ్యవసాయం జూదమైపోయింది. దళారులు ఇంటికి వచ్చి డబ్బులు చెల్లించి పత్తి కొనుగోలు చేస్తారు కనుక ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పటికీ పత్తి పంటే గిట్టుబాటు అవుతుందనే భ్రమలో రైతులు పడిపోయారు. విత్తనాల కంపెనీల వ్యాపార ప్రకటనలు ఈ భ్రమ కల్పించాయి. కౌలు రైతులు సర్వస్వం వొడ్డి పత్తి పండించే ప్రయత్నం చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. లోగడ నల్లరేగడి భూములలోనే పత్తి వేసేవారు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ పత్తి పండిస్తున్నారు. మూల్యం చెల్లిస్తున్నారు.
వ్యవసాయ విస్తరణ వ్యవస్థ లేకపోవడంతో విత్తనాల, ఎరువుల, పురుగుమందుల కంపెనీల ప్రతినిధులే రైతుల శ్రేయస్సు కాకుండా కంపెనీ లాభాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు పత్తి వేయమని సలహా ఇస్తున్నారు. నాలుగు, కరువు మాన్యువల్ తయారు చేయడం. మూడు నెలలో నమోదైన వర్షపాతం ఆధారంగా కరువు ఉన్నదీ లేనిదీ నిర్ణయించడం సరి కాదు. భారీ వర్షాలు వచ్చిన సందర్భాలలో కూడా ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ వాటిల్లుతుంది.
ఈ సంవత్సరం అదే జరిగింది. ఖరీఫ్ పంట ఎండిపోయిన తర్వాత వానలు దండిగా పడినాయి. ప్రయోజనం శూన్యం. పంట స్థితినీ, దిగుబడినీ పరిశీలించిన తర్వాత అసవరమైన సహాయసహకారాలను ప్రభుత్వం అందించే విధంగా కరువు మాన్యువల్ ఉండాలి. బ్యాంకు రుణం ఇచ్చినవారికే పంట బీమా (ఇన్సూరెన్స్) ఇస్తున్నారు. తక్కినవారికి ఈ సౌకర్యం అందుబాటులో లేదు. రైతులందరికీ బీమా సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం స్వీకరించాలి. రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన తక్షణ చర్యలు ఇవి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకూ ఇది వర్తిస్తుంది.
వైద్యం, విద్యలో సర్కార్ ప్రమేయం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగానికి నిధుల కేటాయింపులు తగ్గుతు న్నాయి. మార్కెట్ స్థిరీకరణకు 2014-15లో రూ. 400 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ. 75 కోట్లకు కుదించారు. అధీకృత సాగుచట్టం 2011లో వచ్చిన తర్వాత కూడా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే కార్యక్రమం మందకొడిగానే సాగుతోంది. గుర్తింపు కార్డులు కలిగిన కౌలు రైతులకు సైతం బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పత్తి విస్తీర్ణం హెచ్చిన ఫలితంగా కౌలు రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
తెలంగాణ రాష్ట్రంలోనే కనీసం పది లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. వీరిలో అత్యధికులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులపైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. అప్పులు పెరిగి తీర్చలేక నిస్పృహకు లోనై ఆత్మహత్య చేసుకుంటున్నారు. రుణాలూ, వాటి మాఫీ ఫలితాలూ కూడా హైదరాబాద్‌లో ఉన్న భూమి యజమానులకు అందుతున్నాయి కానీ సేద్యం చేసే కౌలు రైతులకు అందడం లేదు. రూ.4000 కోట్ల మేరకు వ్యవసాయ రుణాలూ, రూ.400 కోట్లు పంటరుణాలు ఒక్క ఎకరం కూడా సాగు చేయని హైదరాబాద్ నగరవాసులకు దక్కుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
విద్య, ఆరోగ్య రంగం నుంచి ప్రభుత్వం వైదొలగడం కూడా రైతుల ఉసురు తీస్తున్నది. పిల్లల చదువుకోసం, ఆరోగ్యం కోసం రైతు కార్పొరేట్ రంగంపైనే ఆధారపడవలసి వస్తున్నది. ఈ రెండు రంగాలలోకి ప్రభుత్వం తిరిగి రావడం, చెరువులను పునరుద్ధరించడం ద్వారా గ్రామాలకు పాత వైభవం తిరిగి తీసుకురావడం ద్వారా రైతుల బతుకులలో వెలుగు నింపే అవకాశం ఉంది. రైతు సంక్షేమం కోసం కృషి చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అందుకు తగిన వ్యూహాన్ని తయారు చేసుకోవడం కష్టం కాదు. ఆకాశహర్మ్యాల గురించి కాకుండా వ్యవసాయ క్షేత్రాల గురించి ఆలోచించడం తక్షణావసరం. నేల విడిచి సాము చేయడం వివేకవంతుల లక్షణం కాదు.
- కె.రామచంద్రమూర్తి